'Bharat Ratna': గానకోకిల సుశీలకు ‘భారతరత్న’ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-07-26T14:04:44+05:30 IST

బహుభాషా కోవిదురాలుగా 12 భాషల్లో పాటలు పాడి, 72 సంవత్సరాల పాటు పాటల యాత్రలో అత్యంత విజయవంతమైన నేపథ్యగాయకురాలిగా

'Bharat Ratna': గానకోకిల సుశీలకు ‘భారతరత్న’ ఇవ్వాలి

                                         - పురస్కార సభలో వక్తలు


ప్యారీస్‌(చెన్నై), జూలై 25: బహుభాషా కోవిదురాలుగా 12 భాషల్లో పాటలు పాడి, 72 సంవత్సరాల పాటు పాటల యాత్రలో అత్యంత విజయవంతమైన నేపథ్యగాయకురాలిగా ప్రసిద్ధిచెందిన పద్మభూషణ్‌ డా.పి.సుశీల(Sushila)కు ‘భారతరత్న’ ఇవ్వాలని పలువురు వక్తలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విశ్వగాన సరస్వతి, విశ్వ గానకోకిల బిరుదులను సుశీలకు ప్రదానం చేశారు. మద్రాసు(Madras) విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించిన ఈ వేడుకలు ఎస్పీ వసంతలక్ష్మి ‘మా తెలుగు తల్లి ....’ ప్రార్థనాగీతంతో ప్రారంభం కాగా, ఆత్మీయ అతిథులుగా మాఢభూషి సాహిత్య కళా పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య మాఢభూషి సంపత్‌కుమార్‌, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు, రచయిత మర్రిపూడి దేవేందరరావు(Marripudi Devendera Rao), జాతీయ అధ్యక్షుడు డా.సి.నారాయణస్వామి, శ్రీకాళహస్తి స్కిమ్స్‌ విద్యాసంస్థల నిర్వాహకులు మిద్దెల హరి, మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖాధ్యక్షుడు డా.యజ్ఞశేఖర్‌ తదితరులు పాల్గొని పి.సుశీల భారతీయ చిత్రరంగానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. మర్రిపూడి దేవేందరరావు రచించిన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP Balasubramaniam), పి.సుశీల విశిష్టతలను తెలియచేసేలా మర్రిపూడి దేవేందరరావు రచించిన ‘గాన బ్రహ్మ’, ‘విశ్వ స్వరకర్త’,  ‘విశ్వ గాన సరస్వతి’ పేరిట మూడు కవితా సంకలనాలను ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ లలిత కళాసాగర్‌ ఆధ్వర్యంలో ‘విశ్వగాన సరస్వతి’, శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘విశ్వగానకోకిల’ బిరుదులను పి.సుశీలకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అదే విధంగా ఎస్పీ వసంతలక్ష్మికి ‘ఎస్పీబీ ఆత్మీయ పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ తాము స్థాపించిన ట్రస్ట్‌ ద్వారా పేదలకు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ‘హిమగిరి సొగసులు...’ అనే పాటను ఆలపించి ఘంటసాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘లవకుశ’ చిత్రంలో పాడడం తన జీవితంలో మరచిపోలేనిదని, ఆ చిత్రం అద్భుత కావ్యమని సుశీల అభివర్ణించారు. సభాధ్యక్షుడు విస్తాలి శంకరరావు మాట్లాడుతూ, 72 ఏళ్ల గాన ప్రస్థానంలో 50 వేలకు పైగా భారతీయ భాషల్లో పాటలు పాడి ప్రపంచ రికార్డులు సాధించిన ఘనత డా.పులపాక సుశీల గారికే దక్కుతుందన్నారు. ఆమె సేవలు గుర్తించి కేంద్రప్రభుత్వం ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని కోరారు. డా.పాండురంగ కాళియప్ప వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Updated Date - 2022-07-26T14:04:44+05:30 IST