అనంత సాహితీ ప్రకాశం

ABN , First Publish Date - 2021-01-26T07:05:23+05:30 IST

అనంత సాహితీ చక్రవర్తి, అష్టావధాని ఆశావాది ప్రకాశరావును పద్మశ్రీ అవార్డు వరించింది. పెరవలి గ్రామంలో పుట్టి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, విద్యలో రాణించి, అధ్యాపకులయ్యారు. తర్వాతి దశలో సాహిత్యంలో ఆదర్శంగా నిలిచి 60 పుస్తకాలు రచించారు.

అనంత సాహితీ ప్రకాశం

అష్టావధాని ఆశావాదికి పద్మశ్రీ పురస్కారం

జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం


అనంతపురం టౌన్‌, జనవరి 25 : అనంత సాహితీ చక్రవర్తి, అష్టావధాని ఆశావాది ప్రకాశరావును పద్మశ్రీ అవార్డు వరించింది. పెరవలి గ్రామంలో పుట్టి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, విద్యలో రాణించి, అధ్యాపకులయ్యారు. తర్వాతి దశలో సాహిత్యంలో ఆదర్శంగా నిలిచి 60 పుస్తకాలు రచించారు. ఇతరులు ఈయనపై 22 పుస్తకాలు, 44 వ్యాసాలు రచించారు. ఆశావాది 170కి పైగా అష్టావధానాలు చేసి, ఈతరం సాహితీవేత్తల్లో మేటిగా నిలిచారు. 


నేపథ్యం... ఉద్యోగం

శింగనమల మండలం పెరవలి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పక్కీరప్ప, కుళ్లాయమ్మ దంప తులకు 1944 ఆగస్టు 2న ఆశావాది ప్రకాశరావు జన్మిం చారు. పది మంది సంతానంలో ఆశావాది మొదటివారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆశావాది విద్యాభ్యాసం సాగింది. బెళుగుప్పలో 1 నుంచి 3వ తరగతి వరకు, కళ్యాణదుర్గం మండలం శీర్పి కొట్టాల లో 4, 5వ తరగతులు, అనంతపురంలోని పొట్టిశ్రీరాములు స్కూల్‌లో 6 నుంచి 8వ తరగతి వరకు, రాజేంద్ర మున్సి పల్‌ స్కూల్‌లో 9 నుంచి ఎస్‌ఎ్‌సఎల్‌సీ వరకు చదివారు. 6 నుంచి ఎస్‌ఎ్‌సఎల్‌సీ వరకు కేశవ విద్యానికేతన్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. తర్వాత ఆర్ట్స్‌ కళాశా లలో పీయూసీ, డిగ్రీ పూర్తి చేశారు. 1965లో తెలుగు పండిట్‌గా ప్రభుత్వోద్యోగం పొంది వెంకటాద్రిపల్లి, వై.రా మాపురం, కణేకల్లులోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లలో పని చేశారు. 1968లో ఎస్వీయూ పీజీ సెంటర్‌లో తెలుగులో ఎంఏ చేశారు. 1970 అక్టోబర్‌లో ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ లెక్చరర్‌గా చేరి విధులు నిర్వర్తించారు. 1976లో గుంత కల్లుకు బదిలీ అయి కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ కళాశాల లో 1984దాకా పనిచేశారు. తర్వాత చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ అయి 1988దాకా, ఆ తర్వాత పుంగనూరులో 1990దాకా పనిచేశారు. 1990లో పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ అయి 2002 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సమ యంలోనే ఆరేళ్లపాటు ప్రిన్సిపాల్‌(ఎ్‌ఫఏసీ)గానూ చేశారు.

 కాగా ఆశావాది భార్య లక్ష్మిదేవి 2006లో మృతి చెందారు. ఈయనకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో కొందరు లెక్చరర్లుగా, మరికొందరు ప్రభుత్వోద్యోగు లుగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు.


సాహితీ ప్రయాణం...

ఆశావాది చిరుప్రాయంలో ఉండగానే తండ్రి పక్కీరప్ప పద్యాలు రాయడంతోపాటు ఆశావాదిచే శతకాలు కంఠ స్తం చేయించేవారు. తర్వాతికాలంలో ఆశావాది సినిమా బాణిలో పాటలు రాసేవారు. పొట్టిశ్రీరాములు స్కూల్‌లో 8వ తరగతి చదివేటపుడు తెలుగుపండితుడు పులిపాటి సుబ్బరామయ్య చందస్సుపై మంచి పట్టు వచ్చేలా తీర్చిదిద్దారు. తర్వాత రాజేంద్ర మున్సిపల్‌ స్కూల్‌లో 9వ తరగతిలో  తలమర్ల కళానిధి, కుంటిమద్ది రాఘవాచార్యులు, మాధవ రాజులు ఆశావాది పద్యాలను ఆసక్తిగా ఆలకించడంతో పాటు తప్పొప్పులుంటే సవరించి, అవగాహన కల్పించే వారు. వీరి బోధనలతో 10వ తరగతికల్లా ఆశావాది పద్యాలు రాయగల సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఈ సమయంలోనే అస్పృశ్యత అనే వ్యాసం రాశారు. హాస్టల్‌లోనూ ప్రభాకర్‌జీ, చెరుకువాడ నర్సింహం, నాగప్ప, కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు లాంటి వారిని పిలిపించి బోధనలు చేయించేవారు. ఈ బోధనల ప్రభావంతో వ్యాసరచనను ఆరంభించారు ఆశావాది. దీంతో సాహిత్య సాధన చేస్తూ డిగ్రీ మొదటి సంవత్సరంలోనే తొలి అవధానం చేశారు. నాటినుంచి తన సాహిత్యాభిలాషను రచనల రూపంలో విస్తరించుకుంటూ వెళ్లారు. 


చిరుప్రాయంలోనే కుటుంబానికి ఆసరా...

ఆశావాది పీయూసీ చదువుతున్న సమయంలో ఇంగ్లీష్‌ సబ్జెక్టులో తప్పడంతో అప్పట్లో మొదటిరోడ్డులోని షెల్టర్‌ హోంలో చేరి చదువుకోవడంతోపాటు టైప్‌రైటింగ్‌ నేర్చుకు న్నారు. ఈ సమయంలో అక్కడక్కడా జరిగే సాహిత్య కార్యక్రమాల్లోనూ పాల్గొనడంతోపాటు పద్యాలు రాసేవారు. ఆ సమయంలో పర్యవేక్షకుడుగా వచ్చిన రిటైర్డ్‌ కలెక్టర్‌ భోగిశెట్టి జూగప్ప ఈయనలోని సాహిత్య భావజాలాన్ని చూసి ముగ్ధుడై తన ఇంటికి తీసుకెళ్లి, ఆయన ఉత్తరాలను టైప్‌ చేయించడంతోపాటు శ్రీశైలజ్యోతి పత్రికకు వచ్చే వ్యాసాల్లో ముద్రణాదోషాలు లేకుండా చూసే పనిని కల్పించారు. దీని ద్వారా నెలకు రూ.60లు వేతనం కూడా ఇచ్చేవారు. ఈ వేతనంలో తన చదువు, ఖర్చులకు రూ.20లు తీసుకుని మిగిలిన రూ.40లు ఇంటికి పంపి ఆసరాగా నిలిచేవారు.


పదవినెక్కించిన పద్యం..

ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువు తున్న సమయంలో కళాశాల సారస్వత సంఘ కార్యదర్శి ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో అందరిలా కాకుం డా, ఏ ఒక్కరినీ ప్రలోభాలకు గురిచేయకుండా ఆశావాది వినూత్న ప్రయోగం చేశారు. తండ్రి ఇచ్చిన రూ.9లతో 3వేల కరపత్రాలు ముద్రించి, పద్యం రూపంలో ఓట్లను అడిగారు. ఈ కొత్త విధానానికి అందరూ ఆకర్షితులై ఆశా వాదికే ఓట్లు వేయడంతో సీనియర్‌ విద్యార్థిపై 600 ఓట్ల మెజార్టీతో గెలిచి కళాశాలలో చదివినంతకాలం సారస్వత సంఘ కార్యదర్శిగా కొనసాగారు.


ఆశావాది రచనలు

కవితా సంపుటాలు :  పుష్పాంజలి, లోకలీలా సూక్తం, మెరుపుతీగలు, అంతరంగ తరంగాలు, దీవన సేసలు, రామకథా కలశము, పార్వతీ శతకము, ఆత్మతత్వ ప్రబోధము, వాత్సల్య మానసం, ప్రశాంత సదనం, జయశ్రుతులు.

వ్యాస సంపుటాలు : శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము, సహయాచారి సాహితీ సాహచర్యము, దోమావధాని సాహితీకుంజర మూర్తిమత్వము, ప్రత్యూష పవనాలు, ప్రసార కిరణాలు, సమారాధన, భాగవత సౌరభము, సువర్ణ గోపురము, తన్మయ సాహితీరశ్మి, తెలుగు పద్యకవితా ప్రస్థానం, అవధాన సాధన, సాంప్రదాయ కవితారీతి.

అవధాన సంపుటాలు : అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము

అనువాద గ్రంథాలు : పోతన భాగవతం తృతీయ స్కందము, జ్యోతిస్సుభ్రాతం, జాషువా గబ్బిలం.

సిద్ధాంత గ్రంథం :  ప్రహ్లాదచరిత్ర - ఎర్రన, పోతనల తులనాత్మక పరిశీలన

జీవిత గ్రంథాలు : విద్యావిభూషణ, మాలదాసరి, ప్రశస్త జిగీషామతి డా. బీఆర్‌ అంబేడ్కర్‌. సంత్‌ రవిదాస్‌ సందేశ సంహిత

పరిష్కరణ పుస్తకాలు : వెలుగుబాట, చెల్లపిళ్ళరాయ చరిత్రము, ఇతిహాస పురాణాలు ఎందుకు చదవాలి..?, నారాయణ శతకము, ఘోషయాత్ర నాటకం.

వ్యాఖ్యారచనలు : నిరోష్ఠ్య కృష్ణశతకము, భర్తృహరి వైరాగ్యశతి.

సంకలన గ్రంథాలు : ఆర్కెస్ర్టా(వచనకవిత), శ్రీ హనుమత్‌ స్తోత్రమంజరి, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర కదం బము, నడిచే పద్యం నండూరి, అవధాన సూర్యప్రభలు.


వరించిన పురస్కారాలు..

ఆశావాది సాహితీ సేద్యాన్ని మెచ్చి ఎన్నో అవార్డులు, ప్రతిభా పురస్కారాలు వరించాయి. ఉత్తమ ఉపాధ్యాయుడిగానే కాకుండా గ్రంథ రచయితగా అనేక అవార్డులు, డాక్టరేట్‌లు వచ్చాయి.  స్వర్ణ గండపెండేర,  కనకాభిషేక సత్కారాలు లభించాయి. కళారత్నగా, గాంధేయకవిగా, అవధాన శిరోమణిగా వేనోళ్ల కీర్తించబడ్డారు.


తెలుగు పద్యం గౌరవం పెరిగింది 

జిల్లాలో ఇప్పటివరకూ పుట్టపర్తి నారాయణాచార్యు లు, కల్లూరు సుబ్బారావు, తోలుబొమ్మల దళవాయి చలపతి వంటివారికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇపు డు వారి సరసన నాపేరు కూడా వినబడేలా పద్మశ్రీ వరించడం మరవలేని ఘట్టం. ఇది తెలుగు గొప్పత నం వల్ల తెలుగు పద్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. పద్మశ్రీతో తెలుగు పద్యానికి మరింత గౌరవం పెరిగిందని భావిస్తున్నా.

                                - ఆశావాది ప్రకాశరావు

Updated Date - 2021-01-26T07:05:23+05:30 IST