Chitrajyothy Logo
Advertisement

ఎట్టకేలకు ‘పద్మ’ జాబితాలో షావుకారు జానకి

twitter-iconwatsapp-iconfb-icon
ఎట్టకేలకు పద్మ జాబితాలో షావుకారు జానకి

‘కొన్నిసార్లు రావడం లేటవ్వవచ్చు కానీ.. రావడం మాత్రం పక్కా..’ అనేలా తొమ్మిది పదుల వయసులో నటి షావుకారు జానకిని ‘పద్మశ్రీ’ వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పద్మ పురస్కారాలలో నటి షావుకారు జానకి తమిళనాడు రాష్ట్రం తరపున ‘పద్మశ్రీ’కి ఎన్నికయ్యారు. 1932 డిసెంబర్ 11న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన జానకి ఏడో తరగతి వరకే చదువుకున్నారు. నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ, సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యువతరం హీరోలవరకు నటించిన నటి షావుకారు జానకి. తొమ్మిది పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమెలో ఆ చలాకితనం తగ్గలేదు. వయసు తన శరీరానికే కానీ తన మనసుకు కాదని చెప్పే జానకి.. ఇప్పటి వరకు 500కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందే ఆమెకు వివాహం జరిగింది. ఆమె చెల్లెలు కృష్ణకుమారి. జానకి షావుకారు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత కృష్ణకుమారి కూడా చిత్ర రంగ ప్రవేశం చేశారు.

 షావుకారు చిత్రంలో నటించే సమయానికి జానకి వయసు 18 ఏళ్లు. ఓ పిల్లకు తల్లి. అయినా ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి రికమండేషన్‌తో ‘షావుకారు’ చిత్రంలో ఏకంగా హీరోయిన్ అవకాశమే ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలయ్యాక షావుకారు.. జానకి ఇంటి పేరుగా మారింది.


జానకి రెండో చిత్రం ముగ్గురు కొడుకులు. జెమినీ సంస్థ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు కొడుకు పుట్టాడు. కెరీర్ ప్రారంభ దశలో జానకి ఎన్నో కష్టాలు పడ్డారు. కుటుంబం నుంచి ఎవరూ తనని ఎంకరేజ్ చేయక పోయినా స్వశక్తితో పైకి ఎదిగారు. తన కష్టాలు ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడేవారు. ఒక దశలో ఏడాదికి 20 చిత్రాల్లో కూడా జానకి నటించిన సందర్భాలు ఉన్నాయి. తను తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలం మీద అభిమానంతో కొన్ని నాటకాల్లో కూడా జానకి నటించేవారు. ఆ రోజుల్లో దర్శకుడు కే.బాలచందర్ ఆధ్వర్యంలో రాగిణి క్రియేషన్స్ సంస్థ తమిళ నాటకాలు ప్రదర్శించేది. వాటిల్లో జానకి ప్రధాన పాత్ర పోషించేవారు.

తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ సరసన జానకి నటించారు. ఒకప్పుడు కథానాయికగా వెండితెరను ఏలిన జానకి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు బామ్మగా నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె నటించిన చిత్రాల్లో ‘సంసారం చదరంగం’ చిత్రంలోని చిలకమ్మ పాత్రతో ఆమె నంది అవార్డ్ కూడా పొందారు. తన తొలి కథానాయకుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డ్ స్వీకరించారు జానకి. అలాగే సత్యనారాయణతో కలసి నటించిన తాయారమ్మ బంగారయ్య చిత్రం మరొకటి. నటిగానే కాకుండా మంచి వ్యాఖ్యాతగా కూడా పేరొందారు జానకి. ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాలను ఆమె నిర్వహించారు. అలాగే రుచికరమైన వంటలు వండడంలో జానకి స్పెషలిస్ట్ అని ఆమె వండిన వంటకాలు తిన్న చిత్ర ప్రముఖులు చెబుతారు.


‘వ‌ద్దంటే డ‌బ్బు, క‌న్యా శుల్కం, రేచుక్క-ప‌గ‌టిచుక్క, చెర‌పకురాచెడేవు, సొంత‌వూరు, జ‌యం మ‌న‌దే, పెంపుడు కూతురు, రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, అక్కాచెల్లెళ్ళు, మంచి కుటుంబం’ వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన జానకి.. ‘పులిబిడ్డ, క‌ట‌క‌టాల రుద్రయ్య, తోడికోడ‌ళ్ళు వంటి చిత్రాలలో వ‌య‌సుకు త‌గిన పాత్రలలో న‌టించారు. ప్రస్తుతం న‌వ‌త‌రం హీరోలు న‌టించిన ‘ఎవ‌డే సుబ్రమణ్యం, కంచె, బాబు బంగారం, సౌఖ్యం, అన్ని మంచి శ‌కున‌ములే’ వంటి చిత్రాలలో కూడా ఆమె తనదైన నటనతో అలరించారు. దాదాపు 75 సంవత్సరాల నటప్రస్థానంలో ఇప్పటికి ఆమె ‘పద్మ’ జాబితాలో చేరినందుకు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డుకు కారణమైన తమిళనాడు ప్రభుత్వంపై కూడా ఆమె అభిమానులు అభినందిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement