జఝారియాకు పద్మ భూషణ్‌

ABN , First Publish Date - 2022-01-26T09:22:54+05:30 IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పద్మ పురస్కారాలను ప్రకటించింది.

జఝారియాకు పద్మ భూషణ్‌

పారా అథ్లెటిక్స్‌ దిగ్గజానికి దక్కిన అరుదైన గౌరవం

ఒలింపిక్‌ హీరో నీరజ్‌ సహా ఎనిమిది మందికి పద్మశ్రీ 


న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 128 మందికి ఈ అవార్డులు ఇవ్వనుండగా.. ఇందులో క్రీడల నుంచి తొమ్మిది మంది (ఒక పద్మభూషణ్‌, ఎనిమిది పద్మశ్రీలు) ఉన్నారు. పారా  అథ్లెటిక్స్‌ దిగ్గజం, పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన దేవేంద్ర జఝారియాను మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్‌ వరించింది. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన యువ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల నీరజ్‌.. గతేడాది టోక్యో క్రీడల్లో చాంపియన్‌గా నిలిచి వందేళ్ల తర్వాత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో దేశానికి  పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. మాజీ షూటర్‌ అభినవ్‌ బింద్రా తర్వాత విశ్వక్రీడల్లో వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరఫున స్వర్ణం నెగ్గిన క్రీడాకారునిగానూ రికార్డు సాధించాడు.


ఇక.. నిరుడు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలతో సత్తాచాటిన పలువురు పారా అథ్లెట్ల ప్రతిభకు అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఆ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌ సుమీత్‌ అంటిల్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్రమోద్‌ భగత్‌, రెండు పతకాల (ఓ స్వర్ణం, కాంస్యం)తో నవచరిత్ర సృష్టించిన పారా షూటర్‌ అవనీ లేఖరా పద్మశ్రీకి ఎంపిక య్యారు.  జాతీయ హాకీ జట్టు క్రీడాకారిణి వందనా కటారియా (ఉత్తరా ఖండ్‌),  గోవాకు చెందిన జాతీయ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ బ్రహ్మానంద్‌ షంక్‌వాల్కర్‌, కేరళ సంప్రదాయ యుద్ధవిద్య కళరిప యట్టులో నిష్ణాతునిగా ఖ్యాతి కెక్కిన 93 ఏళ్ల శంకర నారాయణ మీనన్‌, జమ్మూ కశ్మీర్‌కు చెందిన అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ మాజీ చాంపియన్‌  ఫైజల్‌ అలీ దార్‌ కూడా పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఈసారి పద్మ పురస్కారాల జాబితాలో క్రికెటర్లకు చోటు దక్కలేదు. 


ఒకే ఒక్కడు..

రాజస్థాన్‌కు చెందిన 40 ఏళ్ల జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర జఝారియా అత్యధికంగా పారాలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించాడు. ఇందులో ఓ రజతం, రెండు స్వర్ణాలు ఉండడం విశేషం. 2004 ఏథెన్స్‌ గేమ్స్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన దేవేంద్ర.. 2016 రియో గేమ్స్‌లోనూ విజేతగా నిలిచాడు. దీంతో పారాగేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా చరిత్రలో నిలిచాడు. గతేడాది టోక్యోలో రజతం గెలిచాడు. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుండగా కరెంట్‌ షాక్‌ తగిలి ఎడమ చేతిని కోల్పోయిన దేవేంద్ర.. ఏమాత్రం అధైర్యపడకుండా తానెం చుకున్న క్రీడలో ఒలింపిక్‌ పతకాలు సాధించేస్థాయికి ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం.

Updated Date - 2022-01-26T09:22:54+05:30 IST