Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పశ్చిమలో విరబూసిన పద్మాలు

twitter-iconwatsapp-iconfb-icon
పశ్చిమలో విరబూసిన పద్మాలు

సాహిత్యంలో గరికపాటికి వైద్యంలో డాక్టర్‌ సుంకరకు  పద్మశ్రీ పురస్కారాలు

బోడపాడు నుంచి గరికపాటి ప్రస్థానం.. అవధానం, ప్రవచనాలతో ప్రపంచ ఖ్యాతి

ఏబీఏన్‌–ఆంధ్రజ్యోతి నవజీవన వేదంతో తెలుగు వారికి మరింత చేరువ8

పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దేవుడిగా డాక్టర్‌ ఆదినారాయణరావుకు పేరు

ఎముకల వైద్యంలో ఎన్నో పరిశోధనలు.. 

పుట్టింది భీమవరం.. తండ్రి మాజీ సర్పంచ్‌పెంటపాడు, జనవరి 25 : పెంటపాడు మండలం బోడ పాడులో 1958 సెప్టెంబరు 15న గరికపాటి సూర్యనారాయ ణ, వెంకటరవణమ్మ దంపతులకు ఏడో సంతానంగా జన్మించారు గరికపాటి నరసింహారావు (నరసింహాచార్యులు). నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. చిన్నతనం నుంచి సాహిత్యంపై మక్కువ ఎక్కువ. పదో తరగతి వరకు కాశిపాడు ఉన్నత పాఠశాలలోను, పెంటపాడు డీఆర్‌ గోయెంకా కళాశాలలో తెలుగులో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. తెలుగు సాహిత్యంపై రాజమండ్రిలో తెలుగు విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. అనంతరం తన గురువు బేతవోలు రామబ్రహ్మం వద్ద సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నారు. చదువు పూర్తి అయిన అనంతరం వరంగల్‌ జిల్లా కోనాపురం, గుంటూరు, తాడేపల్లిగూడెం, కాకినాడలలో తెలుగు పండితునిగా పనిచేశారు. అనంతరం గరికిపాటి జూనియర్‌ కళాశాలను ప్రారంభించి కష్టనష్టాలను చవిచూశారు. ఆ క్రమంలో బోడపాడులో తనకున్న రెండున్నర ఎకరాల పొలాన్ని అమ్ముకున్నారు. తర్వాత తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. అవధానంలో పట్టు సాధించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో రాటుదేలి తల్లి ప్రోత్సాహంతో ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లారు. సాహిత్యంలో పట్టు సాధించిన గరికపాటి సాగర ఘోష, మన భారతం వంటి పద్య కావ్యాలను రాశారు. మా అమ్మ, అవధాన శతకం, శతావధాన భాగ్యం, శతావధాన విజయం, కవితా ఖండిక శతావధానం వంటి ఎన్నో రచనలు చేశారు. ఆయన సాహిత్యంపై పరిశోధనలు నిర్వహించారు. ఆయన అసాధారణ ధారణా సంపత్తికి ‘ధారణా బ్రహ్మరాక్షసుడు, ‘అమెరికా అవధాన భారతి’ వంటి బిరుదులు వరించాయి. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో నవ జీవన వేదం పేరిట గరికపాటి నరసింహారావు ప్రతీరోజు ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. చాలా ఇళ్లల్లో తెల్లవారేది ఆయన ప్రసంగంతోనే కావడం విశేషం. లెక్కలేనన్ని ప్రసంగాలు, అంతేస్థాయిలో సన్మాన పురస్కారాలు గరికపాటి పాండిత్యానికి దాసోహమయ్యాయి. మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన ఆయన సరసన పద్మశ్రీ వచ్చి చేరింది. 


అప్పుడే గుర్తించారు

 చిన్నవయసులో బోడపాడు రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సాహిత్యంపై పట్టున్న ఎనిమిది మంది వేద పండితుల ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పారు. సాహిత్యంపై ఆయనుకున్న ప్రజ్ఞను చూసి నువ్వో గొప్ప సాహితీవేత్తవవుతావని దీవించారు.  గరికపాటి నరసింహారావుకు భార్య శారద, కుమారులు శ్రీశ్రీ, గురజాడ ఉన్నారు. సాహిత్యంపై ప్రేమతో తమ సంతానానికి తెలుగు దిగ్గజకవుల పేర్లు పెట్టుకున్నారు. పెద్దకుమారుడు శ్రీశ్రీ ఉద్యోగంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు గురజాడ హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో సాహిత్యం పై పీహెచ్‌డీ చేసి    అక్కడే తెలుగు సాహిత్య బోధకునిగా పనిచేస్తున్నారు. తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో గడిచిన ఐదు దశాబ్దాలుగా ప్రపంచం నలుమూలలా సాహితీ పరిమళాలను వెదజల్లుతున్నారు. 


ఎముకల వైద్యంలో ఎన్నో పరిశోధనలు.. 

భీమవరం, జనవరి 25 : భీమవరానికి చెందిన సుంకర శేషమ్మ, కనకం దంపతుల నలుగురి సంతానంలో  మూడో కుమారుడిగా 1939 జూన్‌ 30న జన్మించారు వెంకట ఆదినారాయణరావు. తండ్రి కనకం న్యాయవాది, స్వాతంత్రోద్యమకారుడు. ఆ రోజుల్లో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఆదినారాయణరావు ఉన్నత విద్య భీమవరంలోని యుఎస్‌సిం ఉన్నత పాఠశాల (ప్రస్తుత లూథరన్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఆసక్తి కనబరిచేవారు. యూనివర్సిటీ స్థాయిలోను వంద మీటర్ల పరుగు పందెంలో రికార్డు నెలకొల్పారు. విద్యా విద్యాలయ క్రీడల పోటీలలో అనేక మెడళ్ళును సాధించారు. 1961–66లలో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. 1970లో అదే కళాశాల నుండి ఆర్థోపెడిక్‌ సర్జరీలో ఎం.ఎస్‌ (ఆర్థోపెడిక్స్‌)ను పూర్తిచేశారు. ఆపై శిక్షణ కోసం జర్మనీ వెళ్ళారు. మైక్రోవాస్క్యులర్‌, హాండ్‌ సర్జరీ అంశాలలో శిక్షణ పొందారు. కేజీహెచ్‌లో ఎముకల వ్యాధి నిపుణుడు వ్యాఘ్రేశఽ్వరుడు పోలియో ఆపరేషన్లు చేయడంలో నైపుణ్యం సంపాదించారు. ఆయన వద్ద ఆదినారాయణ శిష్యుడిగా చేరారు. గురువు సూచనలతో తొలిసారి 1978లో పాలకొల్లులో సత్యనారాయణమూర్తి అనే వైద్యుడి సహాయంతో తొమ్మిది మందికి ఆదినారాయణ పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. తర్వాత పుట్టపర్తిలో పోలియో క్యాంపు నిర్వహించినప్పుడు సత్యసాయిబాబా స్వయంగా  పరిశీలించి అభినందించారు. అక్కడున్న గుజరాత్‌కు చెందిన జైన్‌షా అనే భక్తుడు స్ఫూర్తిపొంది డాక్టర్‌ ఆదినారాయణను కలిసి గుజరాత్‌ రావాలని కోరడంతో అక్కడ క్యాంపు నిర్వహించి 220 మందికి ఆపరేషన్లు చేశారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా వందల క్యాంపులు నిర్వహించి పెద్దఎత్తున ఆపరేషన్లు చేశారు. గుజరాత్‌ సీఎంలుగా పనిచేసిన శంకర్‌సింగ్‌ వాఘేలా, కేశుబాయ్‌పటేల్‌ వంటి వారు స్వయంగా క్యాంపులు ఏర్పాటుచేసి, ఆదినారాయణను ఆహ్వానించారు. గతంలో కేంద్ర మంత్రిగా వున్న మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్‌లో క్యాంపు నిర్వహించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూనే డాక్టర్‌ ఆదినారాయణ విశాఖలో ప్రేమ ఆస్పత్రిని ప్రారంభించి పోలియో ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చారు. డా.సుంకర సతీమణి కూడా వైద్యురాలే. కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ సూపరిండెంట్‌గా పనిచేసిన డా.ఆర్‌.శశిప్రభను వివాహం చేసుకున్నారు. ఈమె కూడా భర్తబాటలో వైద్యరంగంలో సేవలందించేవారు. మరో సోదరుడు సుంకర బాలపరమేశ్వరరావు భీమవరంలో ప్రఖ్యాత న్యూరోసర్జన్‌గా గుర్తింపు పొందారు. ఆయనకు 1988లో వికలాంగుల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలకుగాను భారత ప్రధాని జాతీయ అవార్డును అందించా రు. మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే మహావీర్‌ ఫౌండేషన్‌ జాతీయ అవార్డు పొందారు. ఆయన అనేక పరిశోధన పత్రాలను ప్రచురించారు. 

చాలా ఆనందంగా ఉంది

 తనకు పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందంగా వుందని డాక్టర్‌ ఆదినారాయణ అన్నారు. ఇది వైద్య రంగం లో అనేక రకాలుగా సేవలందిస్తున్న యువతకు స్ఫూర్తి నిస్తుందన్నారు. ఆపరేషన్ల తర్వాత రోగులు నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లడం జీవితంలో మరిచిపోలేనన్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.