పా‘డీలా’!

ABN , First Publish Date - 2021-06-13T05:10:09+05:30 IST

పా‘డీలా’!

పా‘డీలా’!
డెయిరీకి పాలు పోస్తున్న రైతులు

- పాల ధర అంతంతే.. పెరిగిన దాణా ఖర్చులు

- హామీలు నెరవేర్చని పాలకులు

- పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టిసారించని ప్రభుత్వం

- నిట్టూరుస్తున్న పాడి రైతులు

(లక్కవరపుకోట)

రాష్ట్రంలో వ్యవసాయ తర్వాత రెండో స్థానంలో నిలిచేది పాడి పరిశ్రమ. వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న పాడి పరిశ్రమకు ప్రస్తుత ప్రభుత్వం పొగ పెడుతోంది. రైతు రాజ్యం తెస్తానని చెప్పుకుని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్‌... రైతు వ్యతిరేక విధానాలతో వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వ్యవసాయం పూర్తిగా నష్టమొస్తుందని రైతులు పాడి పరిశ్రమను నమ్ముకొని దానిపైనే ఆధారపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాడిపరిశ్రమను అభివృద్ధిచేసి పాలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని ముఖ్యమంత్రి చెప్పి రెండేళ్లు గడిచినా దాని ఊసేలేదు. లీటరుకు రూ.4 పెంచుతామన్న నేటికీ అమలు కాలేదు. జిల్లాలో రోజుకు సగటున సుమారు రూ.4 లక్షల లీటర్లపై చిలుకు పాల ఉత్పత్తి జరుగుతోంది. విశాఖ డెయిరీ సుమారు రూ.లక్షల లీటర్ల వరకు సేకరిస్తుంది. హెరిటేజ్‌,  కామధేను, జెర్సీ, దొడ్ల, సిటీమిల్క్‌ వంటి డెయిరీలకు సుమారు రూ.2 లక్షల లీటర్లు సరఫరా అవుతున్నాయి. ఇవికాకుండా ప్రైవేట్‌ వెండార్లు అదనం. దీన్నిబట్టి పాడి పరిశ్రమ ప్రాధాన్యం ఏ స్థాయిలో ఆదకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కాలంలో కూడా రైతులకు అండగా ఉన్నది కేవలం పాడి పరిశ్రమనే చెప్పవచ్చు. అటువంటి పాడి పరిశ్రమను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. 


భారీగా పెరిగిన ఖర్చులు

ప్రభుత్వం పాలరేటును పెంచలేదు కదా కనీసం పశుదాణా ధరలను కూడా అదుపుచేయలేదు. మార్కెట్లో పశువుల దాణా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో కిలో నూకలు రూ.12 నుంచి రూ.15 ఉండేది. నేడు రూ.25లకు పెరిగింది. పెసర, మినప పొట్టలు కిలో రూ.14లు ఉండేది. ప్రస్తుతం రూ.22 పెరిగింది. తవుడు కిలో రూ.12 నుంచి రూ.25లకు పెరిగింది. ఇలా అన్ని రకాల దాణాలు పెరగడంతో రైతు పశువులను మేపేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 


అందని సబ్సిడీ దాణా

గతంలో పశువైద్యశాఖ నుంచి పాడి పశువులకు సబ్సిడీపై దాణాలు ఇచ్చేవారు. నేడు అది కరువైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాడి, చూడి పశువులకు, లేగదూడలకు రాయిపై పౌష్టికాహారం గతంలో ఇచ్చేవారని రైతులు గుర్తుచేస్తున్నారు. పశువుల ఆసుపత్రిల్లో మందులు కూడా సరిగా లేవని, వింత వ్యాధులు వచ్చి పశువులను కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాడి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-06-13T05:10:09+05:30 IST