పాడేరు జిల్లాకు కొమరం భీమ్‌ పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2022-05-28T06:40:27+05:30 IST

పాడేరు జిల్లాకు అల్లూరి పేరు తొలగించి కొమరం భీమ్‌ జిల్లాగా పేరు పెట్టాలని బహుజన సమాజ్‌ పార్టీ నాయకులు సుర్ల అప్పారావు, మునిపల్లి పండన్న డిమాండ్‌ చేశారు.

పాడేరు జిల్లాకు కొమరం భీమ్‌ పేరు పెట్టాలి
కొమరం భీమ్‌ చిత్రపటం వద్ద బీఎస్పీ నాయకులు


బహుజన సమాజ్‌ పార్టీ నాయకుల డిమాండ్‌

పాడేరురూరల్‌, మే 27: పాడేరు జిల్లాకు అల్లూరి పేరు తొలగించి కొమరం భీమ్‌ జిల్లాగా పేరు పెట్టాలని బహుజన సమాజ్‌ పార్టీ నాయకులు సుర్ల అప్పారావు, మునిపల్లి పండన్న డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరుమార్పును కులమతోన్మాదులు వ్యతిరేకిస్తూ ఆందోళనలను చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అగ్రకులాలకు చెందిన ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, సత్యసాయి, పొట్టి శ్రీరాములు జిల్లాలుగా పేరులు పెట్టినపుడు బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారు ఎక్కడ వ్యతిరేకించలేదన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును ఒక జిల్లాకు పెడితే అగ్రకులాల వారు వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీలకు అల్లూరి సీతారామరాజు వల్ల ఎటువంటి హక్కులు లభించలేదని, ఆదివాసీ ప్రాంతానికి స్వయం పాలన కావాలని సాయుధ పోరాటం చేసిన కొమరం భీమ్‌ పేరును పాడేరు జిల్లాకు పెట్టాలన్నారు. ఆదివాసీ యోధులైన కొమరం భీమ్‌, బిర్షా ముండ వంటి వారు చేసిన పోరాటాల కారణంగానే 1/70 భూబదలాయింపు చట్టం, పంచాయతీ విస్తరణ చట్టం(పెసా) వంటి చట్టాలు వచ్చాయన్నారు. అందువల్ల పాడేరుకు అల్లూరి పేరు తొలగించి కొమరం భీమ్‌ జిల్లాగా పేరు మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సీకరి చిన్నయ్యదొర, జర్సింగి కృష్ణారావు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T06:40:27+05:30 IST