దిగొచ్చిన కేంద్రం.. రేపట్నించే ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2021-10-03T00:12:27+05:30 IST

ధాన్యం సేకరణపై కేంద్రం దిగొచ్చింది. హర్యానా, పంజాబ్‌లలో అక్టోబర్ 3 నుంచే సేకరణ చేపట్టనున్నట్టు..

దిగొచ్చిన కేంద్రం.. రేపట్నించే ధాన్యం కొనుగోలు

న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం దిగొచ్చింది. హర్యానా, పంజాబ్‌లలో అక్టోబర్ 3 నుంచే సేకరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ధాన్యం సేకరణ ఆలస్యమవుతుందంటూ రెండ్రోజుల క్రితం కేంద్రం ప్రకటించడంతో రెండు రాష్ట్రాల రైతులు శనివారం పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. వేలాది మంది రైతులు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. రైతులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ముందస్తు జాగ్రత్తగా సీఎం ఇంటి ముందు బారికేడ్లు, భారీ బలగాలను మోహరించడంతో పోలీసులకు-రైతులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షహబాద్, పంచకులలో రైతు ఆందోళనకారులు బీజేపీ నేతల ఇళ్లకు చేరేందుకు ట్రాక్టర్లతో బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. హర్యానా, పంజాబ్‌లలోని పలు ప్రాంతాల్లో రైతులు, పోలీసుల మధ్య తలెత్తిన వాగ్వాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.


కొనుగోలుకు రెడీ..

కాగా, ధాన్యం కొనుగోలుపై రైతుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. హర్యానా, పంజాబ్‌లో ఖరీఫ్ పంటల సేకరణ ఆదివారం నుంచే ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ప్రకటించారు. పంజాబ్, హర్యానాలలో సహజంగా అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఖరీఫ్ పంటల సేకరణను అక్టోబర్ 11 నుంచి ప్రారంభిస్తామని కేంద్రం ఇంతకు ముందు ప్రకటించింది.

Updated Date - 2021-10-03T00:12:27+05:30 IST