వడివడిగా వరినాట్లు

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

వడివడిగా వరినాట్లు

వడివడిగా వరినాట్లు
ఘట్‌కేసర్‌ పరిధి చందుపట్లగూడలో వరినాటు వేస్తున్న మహిళలు

  • పుష్కలంగా సాగునీరు  
  • పనుల్లో నిమగ్నమైన రైతులు
  • గతం కంటే సాగువిస్తీర్ణం పెరిగే అవకాశం
  • డీజిల్‌, కూలి రేట్లు పెరగడంతో భారమవుతున్న వ్యవపాయం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు బోర్లు, బావుల్లో అవసరమైన మేరకు నీరుండడంతో వరినాట్లు ఊపందుకున్నాయి. మే చివరి వారంలోనే రెండు భారీ వర్షాలు పడడంతో ఆ సమయంలో నారు పోసిన రైతులు ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. పూర్తి అనుకూల వాతావరణంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరినాట్లు ముందుగానే పడుతున్నాయి. ఇదిలా ఉంటే డీజిల్‌ ధర పెంపు ప్రభావం సాగు రంగంపైనా పడింది. ట్రాక్టర్‌ యజమానులు కేజ్‌వీల్స్‌తో దున్నుకానికి గంట కు 14వందల వరకు పెంచారు. అలాగే కూలి రేటూ 5వందలకు పెరిగింది. ఏటికేడు సాగు ఖర్చులు భారీగా పెరుగుతున్నా పంట ఉత్పత్తుల రేట్లలో పెరుగుల లేదని రైతులు వాపోతున్నారు.


ఘట్‌కేసర్‌, జూలై 3: గత నాలుగైదేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడి బోర్లలో భూగర్భ జలాలు బాగానే ఉండడంతో రైతులు 20రోజుల ముందుగానే వరినాట్లు వేస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో వర్షాలు బాగానే కురియడంతో రోహిణి కార్తెలోనే నారుపోసిన రైతుల నారు ఏతకొచ్చింది. దీంతో వరినా టు పనుల్లో బిజీ అయ్యారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలో బావులు, బోర్లకింద వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం దొడ్డు రకం పంట నాట్లు వేస్తున్నారు. సాధారణంగా దొడ్డు రకాలను నారు పోసిన 25 నుంచి 45 రోజుల్లో వేయాలి. పంటకాలం ఎక్కువ ఉండే సన్నరకాల నారును 45 నుంచి 70 రోజుల వరకు వేసుకోవ చ్చు. మే చివరి వారంలోనే రెండు భారీ వర్షాలు పడడంతో అప్పుడు ముందస్తుగా నారు పోసిన రైతులు ఇప్పుడు వరినాట్లు వేస్తున్నారు.


  • భారీగా పెరిగిన సాగు ఖర్చులు

డీజిల్‌ రేటు పెరగడంతో ఆ ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడింది. గతంలో బురద దున్నుకానికి గంటకు రూ.12వందల చొప్పున తీసుకునేవారు. ప్రస్తుతం రూ.13వందల నుంచి 14వందలకు పెంచారు. రెండు వందలు పెంచినా నష్టమే వస్తోందని ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు. దున్నుకం ఖర్చులు పెరగడం, డీఏపీ, ఇతర దుక్కి ఎరువుల ధర బస్తాకు రూ.1350పైగానే ఉండడంతో పెట్టుబడి ఖర్చులు ఎక్కువవుతున్నాయని, ప్రభుత్వం రైతుబంధు కింద ఇస్తున్న ఎకరానికి రూ.5వేలు సగానికి కూడా సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. సాగు ఖర్చులు యేటికేడు పెరుగుతున్నాయని, ఆ మేరకు పంట ఉత్పత్తుల రేట్లు మాత్రం పెరగడం లేదంటున్నారు.


  • ముమ్మరంగా పనులు.. కూలీల కొరత

సాగు పనులు జోరందుకోవడంతో కూలీల కొరత ఏర్పడింది. కూలీలు వరినాటు ఎకరానికి చొప్పు న గుత్తకు మాట్లాడుకుంటున్నారు. ఎకరం వరినా టుకు రూ.4,500 నుంచి రూ.5వేలు తీసుకుంటున్నారు. రోజు కూలి మనిషికి రూ.500 తీసుకుంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలోనే రైతులంతా పనులు ముమ్మరం చేయడ ంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో అవసరం ఉన్న రైతులు కొంత డబ్బు ఎక్కువైనా చెల్లించి ప నులు చేయించుకుంటున్నారు. అదును దాటితో నా ట్లు వేసుకోవడం కష్టమని వర్షాలు, ముసురు కురుస్తున్న రోజుల్లోనే వరినాట్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో నెలన్నర వరకూ వానాకాలం సాగుపనులు కొనసాగే అవకాశం ఉంది. వారంలో రెండు, మూడు వానలు పడితే మాత్రం నెలలోనే వానకాలం పంటలు వేసుకోవడం పూర్తవుతుంది.


  • సాగు నీటికి ఇబ్బంది లేదు :  మధు, కౌలు రైతు, అనంతారం 

రెండేళ్లుగా మంచి వర్షాలే కురుప్తున్నాయి. బోర్లు, బావుల్లో సాగుకు సరిపోయే నీరు వస్తో ంది. ఈ సారి ముందుగానే కొన్ని వర్షాలు కురియడంతో వరినాట్లు, మక్కజొన్న, కంది, పత్తి, జొన్న, బెబ్బర వంటి పంటల సాగుకు అనుకూ ల వాతావరణం ఉంది. గతంలో ఎన్నడూ ఇంత ముందుగా నేను వరినాటు వేయలేదు. నీటి సౌకర్యంతో ఇప్పుడు ముందుగానే వేస్తు న్నా. వరి ఎంత ముందు నాటేస్తే అంత త్వరగా పంట చేతికొస్తుంది. దసరా కంటే ముందుగానే పంట వస్తుంది. మరో రెండు నెలలు వరకూ నాట్లు వేస్తారు.


  • దుక్కులు సిద్ధం చేసుకుంటున్నాం : వాకిటి ప్రవీణ్‌రెడ్డి, రైతు, బొక్కోనిగూడ

వరినాట్ల కోసం బురద దుక్కి సిద్ధం చేసుకుంటున్నాం. నెలన్నర కిందనే వరినారు పోసి ఉంచాం. అందరి నారు ఒకేసారి ఏతకు రావడంతో ట్రాక్టర్లకు, కూలీలకు డిమాండ్‌ ఏర్పండింది. బురదలో ట్రాక్టర్‌తో కేజ్‌ వీల్‌ దున్నుకానికి ఎక్కువ మంది ట్రాక్టర్ల యజమానులు ముందుకు రావడం లే దు. బురద పొలం దున్నే వారి వద్దకే వెళ్తున్నాం. చిన్న రైతులకు ట్రాక్టర్లు లేక, కూలీల కొరతతో రేటు పెరిగి ఇబ్బంది ఏర్పడుతోంది. సొంత ట్రాక్టర్లు ఉన్న రైతులు మాత్రం సకాలంలో వరి నాట్లు వేసుకుంటున్నారు.


  • రైతులకు అవసరమైన మేర ఎరువులు సిద్ధంగా ఉన్నాయి : ఎంఏ బాసిత్‌, ఏవో, ఘట్‌కేసర్‌

మండలంలో వానాకాలం వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులు, యూరియా ఫెర్టిలైజర్‌ షాపులు, సొ సైటీలు, ఆగ్రోస్‌ సెంటర్లలో ఉన్నాయి. అన్ని ర కాల పంటల సాగుకు అనుకూల వర్షాలు పడుతున్నాయి. బోర్లు, బావుల్లో నీరు బాగానే ఉండడంతో ఈ సారి వరినాట్లు ముందుగానే చేపట్టారు. మెట్ట పంటలు, వరినాటు పనులు ఊపందుకున్నాయి. ఈ సారి సాగువిస్తీర్ణం పెరి గే అవకాశం ఉంది. రైతులకు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST