ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-01-18T06:29:28+05:30 IST

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న చెరుకూరి రాజేశ్వరరావు

గంపలగూడెం, జనవరి 17: ఆర్బీకేల్లో పూర్తిస్థాయిలో  ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని తెలుగు రైతు విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు అన్నారు. సోమవారం టీడీపీ తోటమూల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యానికి హమాలీ చార్జీలను పీఏసీఎస్‌లే భరించాలంటున్నారని, గతంలో హమాలీల ఖర్చును ప్రభుత్వమే భరించేదని ఆయన అన్నారు. చేసిన ఖర్చుకు సొసైటీలకు ప్రభుత్వం తర్వాత రీయింబర్స్‌మెంట్‌ చేస్తానని చెబుతోందని, ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. రైతులు సున్నా వడ్డీకి తీసుకున్న రుణాలకు ఇంతవరకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేయలేదని, రైతుల నుంచి సహకార బ్యాంకులు వడ్డీతో సహా కట్టించుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు ఆచరణలో చూపడం లేదన్నారు. మిల్లర్లు రైతుల నుంచి నేరుగా మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.200 తగ్గించి తీసుకుంటున్నారని, కొనుగోలు చేసిన కొద్ది ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న మిర్చి పంటల పరిశీలనకు శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు రాలేదని, నష్టంపై స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి పంటకు ప్రభుత్వం బీమా చెల్లించిందో లేదో తెలియకుండా ఉందన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేగళ్ల వీరారెడ్డి, దిరిశాల వెంకట కృష్ణారావు, వై.పుల్లయ్య చౌదరి, జంగా చెంచిరెడ్డి, ఇనుగంటి మధు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T06:29:28+05:30 IST