ధాన్యం రైతులకు చెల్లింపుల్లేవ్‌!

ABN , First Publish Date - 2021-07-26T05:26:50+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న అనేక మంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సొమ్ము చెల్లించక, ఖరీఫ్‌ పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణం సకాలంలో కట్టలేక వడ్డీరాయితికీ దూరమవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది.

ధాన్యం రైతులకు  చెల్లింపుల్లేవ్‌!

రూ. 55 కోట్లు పెండింగ్‌ 

2,600 మంది ఎదురుచూపులు 

ఖరీఫ్‌ పెట్టుబడి ఖర్చులకు అవస్థలు 

బ్యాంకుల్లో వడ్డీ రాయితీకి దూరం 

ఒంగోలు (జడ్పీ), జూలై 25 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న అనేక మంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సొమ్ము చెల్లించక, ఖరీఫ్‌ పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణం సకాలంలో కట్టలేక వడ్డీరాయితికీ దూరమవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. 


45 రోజులు దాటినా రైతుల ఖాతాల్లో జమకాని డబ్బు

సాగుకు విత్తనం వేసింది మొదలు పంటను అమ్ముకోవడం, వాటి తాలూకూ సొమ్ము చేతికి అందే వరకూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను అమ్ముకున్నా డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేందాల్లో ధాన్యం విక్రయించిన వారి ఖాతాల్లో రెండు వారాల్లోపు నగదు జమ చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో అనేక మంది రైతులు ధాన్యం అమ్మి 45 రోజులు దాటినా ఇంకా డబ్బులు అందకపోవడంతో వారు అనేక అవస్థలు పడుతున్నారు.


75,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 75,500 టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. ఈ నెల 14తో రబీ సీజన్‌ ధాన్యం సేకరణ అధికారికంగా ముగించింది. 7,906 మంది రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తమ ధాన్యాన్ని అమ్ముకున్నారు. మొత్తం రూ.148 కోట్లు చెల్లించాల్సి ఉండగా దశలవారీగా రూ.93కోట్లను ప్రభుత్వం చెల్లించింది. వీటిలో రూ.10కోట్లు ఈ నెల 23న జమ చేసినవే. ఇంకా 2600 మంది అన్నదాతలకు రూ.55 కోట్ల మేర బకాయి ఉంది. 


వడ్డీ రాయితీని కోల్పోతున్న రైతులు 

తీసుకున్న రుణాలను సకాలంలో కడితేనే ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని బ్యాంకులు అన్నదాతలకు వర్తింపజేస్తాయి. దిగుబడుల తాలూకా డబ్బులు వస్తే బ్యాంకు రుణాలు చెల్లిద్దామనుకున్న  రైతులకు ప్రభుత్వం చేస్తున్న కాలయాపన అశనిపాతమైంది. అసలే దిగుబడులు అంతంతమాత్రంగా ఉండి నష్టాల్లో ఉన్న తాము ప్రభుత్వ తాత్సారం వలన వడ్డీ రాయితీని కూడా కోల్పోతున్నామని రైతులు కన్నీరుపెడుతున్నారు. ఇక వీటికి తోడు ఖరీఫ్‌ పెట్టుబడి కష్టాలు కూడా వారిని వెంటాడుతున్నాయి. కనీసం ప్రభుత్వం బ్యాంకర్లకు తీసుకున్న రుణాల తాలూకా గడువును పెంచే విధంగా అయినా ఆదేశాలిస్తే తమకు కొంతమేర ఊరట కలుగుతుందని లేని పక్షంలో తమ డబ్బులను వెంటనే జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు


Updated Date - 2021-07-26T05:26:50+05:30 IST