ముంపులోనే పంట పొలాలు

ABN , First Publish Date - 2021-09-29T05:48:21+05:30 IST

ముంపులోనే పంట పొలాలు

ముంపులోనే పంట పొలాలు
ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరులో నీట మునిగిన వరి పొలాలు

తగ్గని వర్షాల జోరు

లోతట్టు ప్రాంతాలు జలమయం

సోముదేవుపల్లి వద్ద మరింత కోతకు గురైన వరహా నది గట్టు


పాయకరావుపేట, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం మంగళవారం కూడా కొనసాగింది. మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెయిన్‌రోడ్డుపై పలుచోట్ల నీరు నిలిచిపోయి కుంటలను తలపించాయి.  మట్టిరోడ్లు బురదమయం కావడంతో రాకపోకలకు ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు.  తాండవ నదిలో మంగళవారం వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతోచాకలిపేట, ఏటిఒడ్డువీధి, తోకలవారివీధి తదితర ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పింది.  


మూడో రోజూ ముంపులోనే పొలాలు

కోటవురట్ల: మండలంలో మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. వరి, చెరకు, పత్తి పొలాల్లో నీరు నిలిచింది. గెడ్డలు, వాగుల్లో వరద కొనసాగుతున్నది. సర్పా, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాగునీటి చెరువులు పూర్తిగా నిండడంతో జలకళను సంతరించుకున్నాయి.

 

120 ఎకరాల్లో నీట మునిగిన వరి 

పాయకరావుపేట రూరల్‌: మండలంలోని గుంటపల్లి, గోపాలపట్నం, నామవరం గ్రామాల్లో సుమారు 120 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని వ్యవసాయ శాఖాధికారి సౌజన్య తెలిపారు. భారీ వర్షాలకుతోడు తాండవ నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడం, కాలువల ద్వారా ఆవలో నీరుచేరుతుండడం, ఉద్దండపురం తదితర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో ఆవ ప్రాంతం ముంపునకు గురైందని ఆమె చెప్పారు. పొలాల్లో నుంచి వీలైనంత త్వరగా నీరు బయటకు పోయేలా చూసుకోవాలని ఆమె సూచించారు. కాగా వరి పైరు చిగుళ్లు కూడా కనిపించనంతగా మునిగిపోయాయని, వారం రోజుల వరకు ముంపు తొలిగే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా సోమవారం రాత్రి సత్యవరం వద్ద తాండవ నది వరద నీరు బ్రిడ్జి మీదుగా ప్రవహించింది. గ్రామ సర్పంచ్‌ అప్రమత్తమై వంతెన మీదుగా రాకపోకలు జరపకుండా తాళ్లు కట్టించారు.


చెరువులను తలపిస్తున్న వరి పొలాలు

ఎస్‌.రాయవరం: మండలంలోని పెదగుమ్ములూరు, వాకపాడు, పెనుగొల్లు, వెంకటాపురం, జేవీపాలెం, తదితర గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. పెదగుమ్ములూరులో వరి పొలాలు పూర్తిగా మునిగిపోయి చెరువును తలపిస్తున్నాయి. ఇదిలావుండగా సోముదేవుపల్లి వద్ద వరహా నది గట్టు మరింత కోతకు గురైంది. దీనికి ఆనుకుని ఉన్నత పాఠశాల వుండడంతో మంగళవారం మధ్యాహ్నం డీఈవో చంద్రకళ ఇక్కడకు వచ్చి పరిశీలించారు. కోతకు గురైన  గట్టు వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడాలని ఎంఈవో మూర్తికి సూచించారు. అనంతరం ఆమె రేవుపోలవరం పాఠశాలను పరిశీలించారు. శిథిలావస్థలో వున్న తుఫాన్‌ రక్షిత భవనం వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.


Updated Date - 2021-09-29T05:48:21+05:30 IST