ఆశలు ఆ‘వరి’

ABN , First Publish Date - 2020-11-30T07:21:47+05:30 IST

ఏటా ఏదో ఓ కారణంతో నష్టపోతున్న రైతులను.. ఈసారి ‘నివర్‌’ కోలుకోలేని దెబ్బ వేసింది.

ఆశలు ఆ‘వరి’
మదనపల్లె మండలం వేంపల్లెలో నీళ్లలోనే వరి కోత కోస్తున్న మహిళలు

24వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట 

వెయ్యి ఎకరాల్లో టమోటా 

రూ.70 కోట్లకుపైగా అన్నదాతకు నష్టం


చిత్తూరు, ఆంధ్రజ్యోతి 

ఏటా ఏదో ఓ కారణంతో నష్టపోతున్న రైతులను.. ఈసారి ‘నివర్‌’ కోలుకోలేని దెబ్బ వేసింది. జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో చాలా ఏళ్ల తర్వాత పశ్చిమ ప్రాంత రైతులు వరి సాగు చేశారు. 40,555 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 24 వేల ఎకరాల్లో దెబ్బ తిన్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం పంట కోతకు రాగా.. కొన్ని చోట్ల నూర్పిళ్లు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల పొలాల్లో ఉంచిన ధాన్యం నీళ్ల పాలయింది. తూర్పు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో పంట పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఎకరాకు రూ.20 వేల ప్రకారం నష్టం అంచనా వేస్తే, 24 వేల ఎకరాలకు రూ.48 కోట్ల వరకు నష్టం ఉండవచ్చు.

ఈ భారీ వర్షాలకు ఉద్యాన పంటలూ దెబ్బతిన్నాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో టమోటా సాగు అధికం. ‘నివర్‌’ కారణంగా టమోటాకు నల్లటి మచ్చలు రావడం, కాయలు మెత్త పడిపోవడంతో రైతులు నష్టపోయారు. 76 గ్రామాల్లోని 1100 ఎకరాల్లో టమోటా సాగు దెబ్బతిని రూ.6.5 కోట్ల నష్టం వచ్చిందని అధికారుల అంచనా. జిల్లాలో రూ.20.5 కోట్ల మేర, టమోటా, అరటి, బొప్పాయి, వంగ వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

పంట దెబ్బతిన్న విస్తీర్ణం(ఎకరాల్లో..)

వరి           24 వేలు

వేరుశనగ   2 వేలు

ఉద్దులు   2 వేలు

మిరప   1500

టమోటా   1100

అరటి   350

బొప్పాయి           150

వంగ           175

పెసలు   120

మొక్కజొన్న           200



వరి పొలంలోనే నీళ్లు 

ఈయన పేరు ఉమాపతి నాయుడు. పలమనేరు మండలం మొసలిమడుగ. తనకున్న ఎకరాలో రూ.40 వేలు ఖర్చు చేసి వరి సాగు చేశారు. రెండు రోజుల్లో కోతకు సిద్ధమవుతుండగా.. కౌండిన్య కాలువలో నీటి ఉధృతి పెరిగి పంట మునిగిపోయింది. నాలుగు రోజులైనా పొలంపై నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.


టమోటాకు నల్ల మచ్చలు 

పుంగనూరు మండలం ఆరంట్లపల్లెలో శంకర్‌ యాదవ్‌ రెండు ఎకరాల్లో రూ.3 లక్షలు ఖర్చు చేసి టమోట సాగు చేశారు. ఒక్క కోత కూడా కోయలేదు. తుఫాను నేపథ్యంలో వీచిన ఈదురుగాలులకు టమోట మొక్కలకు కట్టిన కట్టలు పడిపోవడంతో పంట నేలవాలింది. టమోటలకు నల్లగా మచ్చలు వచ్చాయి. పురుగులు పట్టి కుళ్లిపోతుందని, రూ.3 లక్షలూ నష్టపోయానని రైతు వాపోతున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి 

అరటి, పసుపు వంటి పంటలు అధికంగా సాగు చేస్తున్నా. ఆరు నెలల కిందట రెండు ఎకరాల్లో 1300 అరటి చెట్లను సాగు చేయగా.. నివర్‌ దెబ్బకు ఒక్కటీ మిగల్లేదు. రూ.2లక్షలపైగా నష్టం కలిగింది. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.

- సదాశివరెడ్డి 

 


ఉప్పు నీటిని పిచికారి చేయండి

పాకాల: నీటమునిగిన ధాన్యం మొలకెత్తకుండా ఉప్పునీటిని పిచికారీ చేయాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు సూచించారు. పాకాల మండలం వల్లివేడు పరిసరాల్లో మునిగిన వరిపంటను ఆదివారం శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. లీటరు నీటిలో 50 గ్రాముల రాళ్ల ఉప్పు కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎకరాకు పది కిలోల చొప్పున పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. శాస్త్రవేత్తలు డాక్టర్‌ తిరుమల రెడ్డి, డాక్టర్‌ చంద్రాయుడు, డాక్టర్‌ లత, డాక్టర్‌ దివ్య, ఏడీఏ సుబ్రహ్మణ్యం, ఎంఏవో పుష్పావతి, ఏఈవో సురేష్‌బాబు, డీఆర్సీ ఏడీఏ భారతి, ఏవో వేణుగోపాల్‌, వీహెచ్‌ఏ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T07:21:47+05:30 IST