ఆశలు ఆవరి

ABN , First Publish Date - 2020-11-29T06:35:22+05:30 IST

‘నివర్‌’ అతితీవ్ర తుఫాన్‌ వరి రైతుకు అపార నష్టం కలిగించింది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మరికొంత నేల కొరిగి, నీటిలో నానుతోంది.

ఆశలు ఆవరి
రావికమతం మండలం కొమిరలో నీటిలో మునిగి ఉన్న వరిపనలు

తడిచిన ధాన్యం నుంచి మొలకలు

కన్నీటిపర్యంతమవుతున్న రైతులు

జిల్లాలోని 27 మండలాల్లో 11,500 హెక్టార్లలో పంట నీటి పాలు

ప్రాథమికంగా అంచనా

రైతుల సమాచారం సేకరించేందుకు మండలాల వారీగా బృందాల నియామకం


విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

‘నివర్‌’ అతితీవ్ర తుఫాన్‌ వరి రైతుకు అపార నష్టం కలిగించింది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మరికొంత నేల కొరిగి, నీటిలో నానుతోంది. మైదాన ప్రాంతంతోపాటు ఏజెన్సీలోని కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఎక్కడ చూసినా వరి పొలాలు నీటిలో కనిపిస్తున్నాయి. రైతులు నానా ఇబ్బందులు పడి నీటిలో నానుతున్న పనలను గట్టుకు చేర్చుతున్నారు. పొలంలో నీరు బయటకు వెళ్లేలా పాయలు తీస్తున్నారు. కోతకొచ్చి గాలులకు నేల కొరిగిన చేలల్లో మూడు, నాలుగు దుబ్బులను నిలగట్టేందుకు యత్నిస్తున్నారు. చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, చీడికాడ మండలాల్లో పనలు నీటిలో వుండిపోవడంతో ధాన్యం గింజలు మొలకలొచ్చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. శనివారం వరకు మండలాల నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లాలోని 27 మండలాల్లో 23 వేల మంది రైతులకు చెందిన 11,500 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనాకు మండలాల వారీగా బృందాలను నియమించామని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు. వర్షం తగ్గిన వెంటనే అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు.


ఉప్పు నీరు చల్లండి

రైతులకు శాస్త్రవేత్తల సూచన

రావికమతం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే కొంతమేర వరి పంటను కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తల బృందం సూచించింది. రావికమతం మండలంలోని గుడివాడ, మట్టవానిపాలెం, రావికమతం గ్రామాల్లో వర్షాలకు నీట మునిగిన పొలాలను స్థానిక వ్యవసాయ అధికారులతో కలసి ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్‌ పి.ప్రదీప్‌కుమార్‌, అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఆదిలక్ష్మి, డాక్టర్‌ కుమారి, పీడీ త్రినాథస్వామి, రావికమతం ఏవో అరుణకుమారి, ఏఈవో నూకరాజు పరిశీలించారు. శాస్త్రవేత్తలకు మొలకెత్తిన వరి కంకులను చూపించి రైతులు భోరుమన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పొలాల్లో నీరు నిల్వ లేకుండా బయటకు పోయేలా చూసుకోవాలన్నారు. ఆపై లీటరు నీటికి 50 గ్రాముల కళ్లు ఉప్పును కలిపి చేను/పనలు తడిసేలా పిచికారీ చేయాలన్నారు. కోసిన వరిని కుప్పలు పెట్టాలని గనుక రైతులు భావిస్తే ఎకరాకు 40 కిలోల కళ్లు ఉప్పును కుప్ప మధ్యలో వేయాలని సూచించారు. సాంబమసూరి, సోనామసూరి, పుష్మి వంటి రకాలు తడిస్తే మొలక వస్తుందని, అందువల్ల రైతులు తమ సూచనలు పాటించాలని కోరారు.

Updated Date - 2020-11-29T06:35:22+05:30 IST