నిండా ముంచేసిన ‘నివర్‌’

ABN , First Publish Date - 2020-11-28T06:16:16+05:30 IST

ఆరుగాలం శ్రమించి, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిండా ముంచేసిన ‘నివర్‌’
పాయకరావుపేట మండలం పాల్తేరులో నీట మునిగిన వరిచేను

ఆరుగాలం శ్రమించి పండించిన పంట తుఫాన్‌ పాలు

ఎడతెగని వర్షాలతో వేలాది హెక్టార్లలో నీట మునిగిన వరి

నీటిలో తేలుతున్న పనలను చూసి కర్షకుల కన్నీటిపర్యంతం

రెండు రోజుల నుంచి నీటిలో నానుతుండడంతో కుళ్లిపోతున్న వైనం

పలు గ్రామాల్లో మొలకలు వచ్చిన కంకులు

కూరగాయలు, అపరాలు, పత్తి పంటలకూ నష్టం

24 మండలాల్లో సుమారు 9,375 హెక్టారుల్లో పంట నష్టం

అధికారుల ప్రాథమిక అంచనా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఆరుగాలం శ్రమించి, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత కోసిన పొలాల్లో నీటిలో నానుతున్న వరి పనలను, కోతకు వచ్చిన పొలాల్లో గాలులకు నేలకొరిగి నీట మునిగిన పైరును చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. బుధవారం అర్ధరాత్రి తీరం దాటిన ‘నివర్‌’ తుఫాన్‌  బలహీనపడి వాయుగుండంగా మారిన తరువాత వాతావరణ నిపుణులకు అంచనాలకు భిన్నంగా దక్షిణ కోస్తాపైకి రావడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు జిల్లాలో వరి రైతులకు తీవ్రనష్టాన్ని కలిగించాయి. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 24 మండలాల్లో సుమారు 9,375 హెక్టారుల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. మైదాన ప్రాంతంలోని దాదాపు అన్ని మండలాల్లో వరి రైతులు నష్టపోయారు.


పెను తుఫాన్‌ ‘నివర్‌’...జిల్లాలో అన్న దాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీవర్షం కురవడంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. చేతికొచ్చిన వరి పంట నీటి పాలయ్యింది. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వరి పంటకు అధిక నష్టం వాటిల్లింది. కూరగాయలు, అపరాలు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న వరి పనలను చూసి తీవ్ర మనోవేదన చెందారు. వీలైనంత వరకు వరి పనలను గట్లపైకి, ఎత్తు ప్రదేశాలకు చేర్చారు. గింజ మొలకెత్తకుండా వుండడానికి ఉప్పునీటి ద్రావణాన్ని చల్లుతున్నారు. ఇక గింజ గట్టిపడి, కోతకు వచ్చిన పొలాల్లో వరి పైరు గాలులకు ఒరిగిపోయి, మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. ఆయా రైతులు వరి దుబ్బులను పైకిలేపి నిలగట్టుకోవడానికి శ్రమిస్తున్నారు. కాగా రెండు రోజుల నుంచి వరి పనలు నీటిలో వుండడం లేదా తడుస్తుండడం వల్ల ధాన్యం రంగుమారిపోవడంతోపాటు మొలకలు వచ్చే అవ కాశం ఉందని రైతులు వాపోతున్నారు. శనివారం కూడా వర్షాలు కురిస్తే ఒక్క గింజ కూడా దక్కదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలమంచిలి సబ్‌ డివిజన్‌లోని నాలుగు మండలాల్లో 5,316 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైనట్టు ప్రాథ మికంగా అంచనా వేశామని ఏడీఈ మాణిక్యాంబిక చెప్పారు. ఎలమంచిలి మండలంలో 1,916 హెక్టార్లు, అచ్యుతా పురంలో 236, రాంబిల్లిలో 1,640, ఎస్‌.రాయవరం మండలంలో 1,524 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్టు తెలిపారు. నర్సీపట్నం సబ్‌డివిజన్‌లోని ఐదు మండలాల్లో 1,309 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. నర్సీపట్నం మండలంలో 65 హెక్టార్లు, గొలుగొండలో 312, రోలుగుంటలో 265, రావికమతంలో 92, వి.మాడుగుల మండలంలో 575 హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. 


పాయకరావుపేట సబ్‌ డివిజన్‌లోని ఐదు మండలాల్లో 1,444 హెక్టార్లలో వరి పంట నీట మునగడం లేదా నేలవాలడం జరిగినట్టు ఏడీ చెప్పారు. పాయకరావుపేట మండలంలో 1,021 హెక్టార్లు, నక్కపల్లిలో 115, కోటవురట్లలో 270, మాకవరపాలెంలో 38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు.

Updated Date - 2020-11-28T06:16:16+05:30 IST