నీటి చౌర్యం.. నూజివీడు రైతు చిత్తు

ABN , First Publish Date - 2022-05-23T04:56:45+05:30 IST

నూజివీడు మెట్ట రైతుల సాగునీటి కల ప్రభుత్వ నిర్లక్ష్యంతో కలగానే మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది.

నీటి చౌర్యం.. నూజివీడు రైతు చిత్తు
నూజివీడు మేజర్‌ యూటీపై ఏర్పడిన బుంగ ద్వారా తరలిపోతున్న సాగునీరు

శివారుకు అందని సాగర్‌ ఎడమ కాల్వ నీరు

అధిక భాగం తెలంగాణ వాడేస్తున్న వైనం

రాష్ట్రంలోను సాగర్‌ కాల్వకు తూట్లు పొడుస్తూ  అక్రమంగా నీరు తరలింపు

చింతలపూడి ఎత్తిపోతలతోనే నూజివీడు రైతు సమస్యకు పరిష్కారం


నూజివీడు మెట్ట రైతుల సాగునీటి కల ప్రభుత్వ నిర్లక్ష్యంతో కలగానే మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. కృష్ణా రివర్‌ బోర్డు నీటి కేటాయింపుల్లో ఎడమ, కుడి కాల్వలకు సమాన కేటాయింపులు చేయవలిసి ఉండగా పోతిరెడ్డిపాడుతో కలసి లెక్కలు కట్టడం, మరోవైపు ఎడమ కాల్వ పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన సాగునీటిని తెలంగాణ ప్రభుత్వం అధిక భాగం సీ పేజ్‌గా చూపడంతో నాగార్జున సాగర్‌ నుంచి విడుదల చేస్తున్న సాగునీరు శివారున ఉన్న నూజివీడు ప్రాంతాల భూములకు అందడం లేదు. అరకొరగా వస్తున్న సాగునీటిని అధికార పెద్దలు కొందరు మేజర్‌ కాల్వలకు బుంగలు ఏర్పాటు చేసి అనధికారికంగా తరలించుకుపోవడంతో అధికార ఆయకట్టు మాత్రం బీడు భూములగా మారిపోతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నూజివీడు సాగునీటి సమస్యకు పరిష్కారం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు.


నూజివీడు, మే 22: నూజివీడు డివిజన్‌ పరిధిలో దాదాపు 25టీఎంసీల నీటిని అందించాల్సి ఉంది. కాని ప్రస్తుతం ఎడమ కాల్వకు ఆన్‌ ఆఫ్‌ విధానంలో సాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనిద్వారా వరుసగా తొమ్మిది రోజులు సాగునీరు విడుదల చేస్తుండగా ఆరురోజులు పూర్తిగా కట్టివేస్తారు. ఎడమ కాల్వకు వదులుతున్న తొమ్మిది రోజులు నీటిలో దాదాపు నాలుగు రోజులు తెలంగాణాను దాటేందుకే సరిపోతుంది. మిగిలిన ఐదు రోజులు నీటిని విడుదల చేసినా టైలెండ్‌ (శివారు) భూములైన నూజివీడు ప్రాంతానికి నీరు చేరే పరిస్థితి కనపించడం లేదు.

  నూజివీడు మేజర్‌ పరిధిలో పూర్తిస్థాయిలో సాగునీరు అందక పోవడానికి మేజర్‌ కాల్వకు కొందరు అక్రమార్కులు బుంగలు ఏర్పాటు చేయడం ఒక కారణంగా కనిపిస్తున్నది. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని మైలవరం నియోజకవర్గం పరిధిలో గల రెడ్డిగూడెం మండలానికి సంబంధించి వేలాది ఎకరాల ఆయకట్టు సాగునీరు అనధికారికంగా తరలిపోతుంది. మరోవైపు మేజర్‌ పరిధిలోగల వాస్తవ అధికారిక ఆయకట్టు మాత్రం సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడుతున్నది. నూజివీడు డివిజన్‌ పరిధిలోగల సాగునీటిని వారబందీ విధానంలో విడుదల చేసి ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, నందిగామ నియోజకవర్గాలకు చెందిన అధికార ప్రతిపక్ష నాయకుల ఒత్తిడి నేపథ్యంలో నూజివీడు మేజర్‌ టైలెండ్‌ పరిధిలోగల రైతులకు రావాల్సిన వాటా సాగునీరు కూడ అక్రమ మార్గాల ద్వారా తరలిపోతున్నా అధికారులు పట్టించుకో వడం లేదు. మరోవైపు సదరు బుంగల వల్ల యూటీ బేస్మెంట్‌లు దెబ్బతిని ఎప్పుడు కుప్పకూలిపోతాయే  తెలియని పరిస్థితి నెలకొంది.


 రూ.242 కోట్ల పనులు బుట్టదాఖలు

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మూడవ జోన్‌ పరిధిలోగల నూజివీడు మేజర్‌ కాల్వ యూటీ మరమ్మతులకు 2020 జనవరిలో 20 పనులగాను రూ.242కోట్లు అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా సంబంధిత ప్రతిపాదనలు ఒక్క రూపాయి కూడ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఫలితంగా నీటి వృథాని అరికట్టలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం షెడ్యూల్‌ ప్రకారం వదిలిన సాగునీరు నూజివీడు మేజర్‌ పరిధిలో శివారు ప్రాంతాలకు చేరడం లేదు.

చింతలపూడితోనే సమస్యకు పరిష్కారం

చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్‌ 1, 2 పనులు పూర్తయితేనే నూజివీడు వేంపాడు పరిధిలో సుమారు 3లక్షల 20వేల ఎకరాల భూమికి సాగునీరు అందించి స్థిరీక రణ చేయ వచ్చు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణానది ఎగువున ఉన్న తెలంగాణ రాష్ట్రం కృష్ణానదిపై నూతన ప్రాజెక్టులు చేపట్టడంతో నదిలో నీటి లభ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ సైతం దాదాపు 90శాతం తెలంగాణ పరిధిలోని ఉండటం మూడవ జోన్‌కు కేటాయించిన నీటిలో అధిక భాగం సీ పేజ్‌ వాటర్‌ లాస్‌ కింద చూపించి కేటాయించిన నీటి కన్నా సగమే నీటిని సరఫరా చేస్తుండటంతో నూజివీడు మేజర్‌ పరిధిలో సాగునీరు అందని పరిస్థితి ఎదురవుతుంది.  ఈనేపథ్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం నూజివీడు ప్రాంత సాగునీటి సమస్య తీర్చడానికి రూ.4909కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2017 సెప్టెంబర్‌ 17న విసన్నపేట మండలం మద్దులపర్వలో శంకుస్థాపన చేయగా 2019 ఎన్నికల నాటికి చింతలపూడి పేజ్‌–1 70శాతం, పేజ్‌–2 50శాతం పనులు పూర్తి అయ్యాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం లో భాగంగా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి నుంచి 13కిలోమీటర్ల కాలువ తవ్వి చాట్రాయి నుంచి రామచంద్రా పురం హేడ్‌ రెగ్యూలేటర్‌ వరకు కాల్వను 18 మీటర్లు విస్తరించి పనులు చేపట్టాలని భావించగా ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయాయి. తదనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతలకు అంత ప్రాఽధాన్యత ఇవ్వకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందంగా మారింది. మరోవైపు కాల్వ విస్తరణలో భూమిని కోల్పోతున్న వారికి పరిహారం అందాల్సి ఉండగా 2022 ఏప్రిల్‌ 25న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.25కోట్లు నష్టపరిహారాన్ని రైతులకు  అందించాల్సి ఉంది. సంబంధిత నష్టపరిహారం త్వరితగతిన చెల్లించి చింతలపూడి ఎత్తిపోతలను ప్రారంభించడం ద్వారా నూజివీడు వేంపాడు పరిధిలోని 3.20లక్షల ఎకరాల రైతుల సాగునీటి చింత తీర్చినట్లు అవుతుంది.


 నిరంతరం నీరు విడుదల చేయాలి

  నిరంతరాయంగా సాగునీరు విడుదల చేయాలి. తెలంగాణ నుంచి ఆన్‌ఆఫ్‌ విధానంలో సాగు నీరు విడుదల చేయ డం వల్ల టెయిల్‌ ఎండ్‌ ప్రాంతాలకు నీరు అందడం లేదు. యూటీలపై ఉన్న బుంగలను మూసి వేయాలి.  

– తుమ్మల లక్ష్మణరావు

వేంపాడు డీసీ మాజీ చైర్మన్‌, ముసునూరు


 చింతలపూడి పూర్తి చేయాలి

ఎన్‌ఎస్‌పీ మూడో జోన్‌ పరిధిలో గల నూజివీడు, వేంపాడు మేజర్లకు సక్రమంగా నీరు అందాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలి. అప్పుడే చివరి భూములకు నీరు అందుతోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. 

– ఉన్నం అనిల్‌, రైతు, తూర్పుదిగవల్లి.



Updated Date - 2022-05-23T04:56:45+05:30 IST