పల్లెపల్లెను తట్టి.. ప్రజలతో మమేకమై

ABN , First Publish Date - 2021-10-20T08:30:53+05:30 IST

పల్లెపల్లెను తట్టి.. ప్రజలతో మమేకమై

పల్లెపల్లెను తట్టి.. ప్రజలతో మమేకమై

జనం పక్షాన నిలుస్తాం.. వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకొస్తాం

సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా నేటి నుంచి పాదయాత్ర: షర్మిల

వైఎస్సార్‌ సంక్షేమ పాలనంటే రైతులకు ఉచిత విద్యుత్‌, 

జల యజ్ఞం, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం

ప్రభుత్వ కొలువుల భర్తీ, ప్రైవేటులో ఉద్యోగాలు కల్పించడం

చేవెళ్ల సెంటిమెంట్‌గా తండ్రి బాటలో ప్రజా ప్రస్థానం

జెండా ఊపి ప్రారంభించనున్న తల్లి వైఎస్‌ విజయలక్ష్మి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలంగాణలోని ప్రతి పల్లెను, ప్రతి గడపను తట్టి, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా బుధవారం నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల తెలిపారు. సమస్యలను, కష్టాలను నేరుగా తెలుసుకుని ప్రజల పక్షాన నిలుస్తాం.. నడుస్తాం.. పోరాడతామని ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన ఉందా..? అంటే ఏమాత్రం లేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకు పార్టీని స్థాపించినట్లు పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్రకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. తల్లి విజయలక్ష్మితో కలిసి షర్మిల మంగళవారం ఏపీలోని కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్‌ ఘాట్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌ సంక్షేమ పాలనంటే రైతులకు ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం. స్వయం ఉపాధి ద్వారా మహిళలను లక్షాధికారులను చేయడం. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాక భర్తీ చేయడం, ప్రైవేట్‌లో భారీగా ఉద్యోగాలు కల్పించడం’’ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ స్థాపించానన్నారు. వైఎస్సార్‌ సంక్షేమ పాలన తెచ్చేందుకు ప్రజలు, అభిమానులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.


తొలి రోజు పాదయాత్ర ఇలా..

చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం హైదరాబాద్‌ నుంచి నేరుగా చేవెళ్ల వెళ్లనున్న షర్మిల.. ఉదయం 10గంటలకు తల్లి విజయలక్ష్మితో కలిసి శంకర్‌పల్లి అడ్డ రోడ్డు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. పాదయాత్ర ఉద్దేశాలను వివరిస్తారు. సభ అనంతరం అక్కడినుంచే.. 11.30కు విజయలక్ష్మి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 2.5 కి.మీ దూరంలోని షాబాద్‌ చౌరస్తా వరకు కూతురితో కలిసి నడుస్తారు. వైఎస్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. కిలోమీటర్‌ దూరంలో ఉన్న కందవడ గేట్‌ క్రాస్‌ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం చేశాక 3 గంటల సమయంలో తిరిగి కొనసాగిస్తారు. కందవడ గ్రామంలో రచ్చబండ మాట-ముచ్చట కార్యక్రమం ద్వారా గ్రామస్థులతో షర్మిల మాట్లాడతారు. తొలి రోజు షర్మిల పది కి.మీ పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు మొయినాబాద్‌ మండలం నక్కలపల్లిలో పాదయాత్రకు విరామమిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. 


సెంటిమెంటు కోటలో భారీ సభ

2003లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర, 2004, 2009లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచే ప్రారంభించారు. సీఎం హోదాలో పలు సంక్షేమ పథకాలనూ ఇక్కడినుంచే మొదలుపెట్టారు. తండ్రి సెంటిమెంటు కోటలో.. షర్మిల పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాన్ని భారీగా తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద దాదాపు 2వేల మంది కూర్చునే విధంగా కుర్చీలు వేశారు. భోజనం, తాగునీరు సైతం సమకూర్చనున్నారు. సభా స్థలికి వైఎస్సార్‌ ప్రజాప్రస్థానంగా పేరు పెట్టారు. మరోవైపు షర్మిల పాదయాత్ర నేపథ్యంలో చేవెళ్లలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద వైఎస్‌, షర్మిల కటౌట్లు పెట్టారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు వైఎస్‌ షర్మిల వస్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. షర్మిల పాదయాత్రతో టీఆర్‌ఎ్‌సలో వణుకు మొదలైందని అన్నారు. సభా స్థలంలో మంగళవారం ఆయన మాట్లాడారు.


వైఎస్‌ సమాధి వద్ద విజయ లక్ష్మి, షర్మిల భావోద్వేగం

సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైన షర్మిల.. దీనికిముందుగా తండ్రికి నివాళులర్పించేందుకు ఇడుపులపాయ ఎస్టేట్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విమానంలో కడపకు, అనంతరం రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్‌ సమాధి వద్ద నివాళి అర్పించే క్రమంలో షర్మిల, విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రార్థన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకరినొకరు హత్తుకుని ఓదార్చుకున్నారు. దీంతో వైఎస్సార్‌ ఘాట్‌ ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల, విజయలక్ష్మి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమయ్యారు.





Updated Date - 2021-10-20T08:30:53+05:30 IST