కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా పాదయాత్ర

ABN , First Publish Date - 2022-05-16T08:24:38+05:30 IST

దేశవ్యాప్తంగా బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దరిజేర్చుకునేందుకు కాంగ్రెస్‌ యాత్రల బాట పడుతోంది.

కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా పాదయాత్ర

అక్టోబరు 2 నుంచి ఏడాది పాటు

‘భారత్‌ జోడో యాత్ర’ నిర్వహణ

జూన్‌ 15 నుంచి జిల్లాల్లో మళ్లీ జనజాగరణ్‌ యాత్ర

‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ ముగింపు సభలో సోనియా ప్రకటన

ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ విడుదల

అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు 50% వాటా

కుటుంబంలో ఒకరికే టికెట్‌

2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ టికెట్లలో సగం 50 ఏళ్లలోపు వారికే


దేశవ్యాప్తంగా మళ్లీ బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దరిజేర్చుకునేందుకు పాదయాత్రలు, ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ నిర్ణయించింది.  కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేపట్టబోతోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై జూన్‌ 15 నుంచి అన్ని జిల్లాల్లో జనజాగరణ్‌ యాత్ర 2వ దశ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.


ఉదయ్‌పూర్‌/న్యూఢిల్లీ, మే 15 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దరిజేర్చుకునేందుకు కాంగ్రెస్‌ యాత్రల బాట పడుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడ్రోజులపాటు ‘నవసంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ పేరిట కాంగ్రెస్‌ నిర్వహించిన మేధో మథన సదస్సు ఆదివారం ముగిసింది. 450 మందికిపైగా ప్రతినిధులు విస్తృతంగా చర్చించిన అంశాలను క్రోడీకరించి ‘ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌’ పేరిట ఆమోదించి ప్రకటించారు.

పార్టీ భావి కార్యాచరణను, సంస్థాగత సంస్కరణలను అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ హయాంలో సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిందని.. సామరస్యాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రారంభించాలని నిర్ణయించినట్లు అధ్యక్షురాలు సోనియాగాంధీ  ప్రకటించారు. ఇది ఏడాదిపాటు జరుగుతుందన్నారు. ఇక నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై వచ్చే నెల 15 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ‘జనజాగరణ్‌ యాత్ర’ రెండో దశను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని పూర్తి సన్నద్ధం చేసే ‘నవ సంకల్ప్‌’ రోడ్‌మ్యా్‌పను కూడా ‘డిక్లరేషన్‌’ ఆమోదించింది. అన్ని స్థాయుల పదవుల్లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఇస్తున్న 20 శాతం ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని, ఉపకులాలకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చింతన్‌ శిబిర్‌ నిర్ణయించింది.

మార్పుల గురించి ఎప్పటికప్పుడు అధ్యక్షురాలికి సల హా ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో సామాజిక న్యాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆరు నెలలకు ప్రత్యేక వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిపి పార్టీలో సామాజిక న్యాయం అమలు తీరును సమీక్షిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉపాధి తగ్గిపోతున్నందున ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్‌కు మద్దతివ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని, మహిళా రిజర్వేషన్‌ బి ల్లు కోసం పోరాడాలని.. బలహీనవర్గాలు, మైనారిటీలకు ఇచ్చే కోటాలో మహిళలకూ ప్రాతినిఽధ్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే యువతకు పెద్దపీట వేసే దిశగా 2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సగం టికెట్లు 50 ఏళ్లలోపు వారికే ఇవ్వాలని తీర్మానించింది.


సంస్థాగతంగా మార్పులివీ.. 

సంస్థాగతంగా చేయాల్సిన మార్పులకు సంబంధించి చింతన్‌ శిబిర్‌లో వివిధ కమిటీలు చేసిన సూచనలను పరిశీలించిన వర్కింగ్‌ కమిటీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇక ఒకే కుటుంబానికి ఒకే టికెట్‌ ఇస్తారు (సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు మినహాయింపు). కుటుంబంలో మరొకరికి టికెట్‌ కావాలనుకుంటే వారు కనీసం ఐదేళ్లు పార్టీలో క్రియాశీలంగా పనిచేసి ఉండాలి. ఏఐసీసీ, పీసీసీ, జిల్లా, బ్లాక్‌ కమిటీల్లో, వివిధ విభాగాల్లో, అనుబంధ సంస్థల్లో ఆఫీసు బేరర్లు పదవీకాలం ఐదేళ్లు మాత్రమే. అ నంతరం మూడేళ్లు పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాక వారిని మళ్లీ ఆ పదవుల్లో నియమించవచ్చు. అన్ని కమిటీల్లోనూ 50 ఏళ్లలోపు వారికి 50ు సభ్య త్వం కల్పించాలి. వచ్చే మూడు నెలల్లోపు అన్ని సా ్థయుల్లో పార్టీ పదవులను భర్తీ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణకు పబ్లిక్‌ ఇన్‌సైట్స్‌ విభాగం, జాతీయ స్థాయి లో పార్టీ సభ్యులకు శిక్షణ సంస్థ, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ తెలిపారు. 


సీనియర్ల అనుభవం కూడా..

రాజకీయ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనకు సలహాలివ్వడానికి వర్కింగ్‌ కమిటీలోని కొందరు సభ్యులతో రాజకీయ సలహా గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు సోనియా వెల్లడించారు. అయితే ఇది విధాన నిర్ణాయక విభాగం కాదని.. సీనియర్ల విస్తృత అనుభవాన్ని తాను ఉపయోగించుకుంటానని చెప్పారు. అలాగే అంతర్గత సంస్థాగత సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ సంస్థాగత స్వరూపం, పదవుల నియామక నిబంధనలు, కమ్యూనికేషన్లు, పబ్లిసిటీ, ప్రజలకు చేరువ కావడం, నిధులు, ఎన్నికల నిర్వహణ వంటి అంశాల్లో సంస్కరణలు ఉంటాయని. 2-3 రోజుల్లో దీని కూర్పు ఉంటుందని తన ముగింపు ప్రసంగంలో తెలిపారు.

చింతన్‌ శిబిర్‌ ఉపయుక్తంగా, ఫలవంతంగా ఉందని ప్రశంసించారు. రాజకీయాలు, సామాజిక న్యాయం-సాధికారికత, సంస్థాగత వ్యవహారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులు-రైతు కూలీలు, యువత అనే ఆరు ప్రధానాంశాలపై చర్చించిన ఆరు గ్రూపుల నివేదికలు తనకు అందాయని.. కాంగ్రెస్‌ వైఖరి, విధానాలు, కార్యక్రమాలకు అవి ప్రాతిపదిక అవుతాయని చెప్పారు. అలాగే రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లో మేనిఫెస్టోల రూపకల్పనకూ తోడ్పడతాయని అన్నారు. ప్రధానంగా సంస్థాగత వ్యవహారాల గ్రూపు నివేదికను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమష్టి ప్రయోజన స్ఫూర్తితో నిర్వహించిన ఈ శిబిరంతో అందరం నిస్సందేహంగా పునరుత్తేజితులమయ్యామని చెప్పారు. ‘గత రాత్రి ఏర్పాటు చేసిన విందు చూశాక.. నా కుటుంబంతో, విస్తృత కుటుంబంతో గడిపిన ఆనందం కలిగింది. పలువురు యువ అతిథులు, సహచరులు కూడా ఇదే భావన వ్యక్తంచేయడం ముదావహం’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కష్టనష్టాలను కచ్చితంగా అధిగమిస్తామని, ఇదే మన సంకల్పమని ఆమె ముమ్మారు పలకడం గమనార్హం.


అధికారంలోకి వస్తే ఈవీఎంలను తొలగిస్తాం

పేపర్‌ బ్యాలెట్లను పునరుద్ధరిస్తాం: చవాన్‌

ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై (ఈవీఎంలు) కాంగ్రెస్‌ మరోసారి సందేహాలు వ్యక్తం చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలను తొలగిస్తామని, వాటి స్థానంలో సంప్రదాయ పేపర్‌ బ్యాలెట్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌ అన్నారు. ‘‘ఈవీఎంలపై చింతన్‌ శిబిర్‌లో చాలా చర్చ జరిగింది. పేపర్‌ బ్యాలెట్లను పునరుద్ధరిస్తామని 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవీఎంలను రద్దుచేయాలని మోదీని కోరినా ఆయన పట్టించుకోరు’’ అని చవాన్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-16T08:24:38+05:30 IST