పచ్చిరొట్ట... అందేదెన్నడో?

ABN , First Publish Date - 2022-05-24T05:41:31+05:30 IST

పచ్చిరొట్ట విత్తనాలు పోషకగని లాంటివి. ఏటా ఖరీఫ్‌ సాగుకు ముందు రాయితీపై రైతులకు వీటిని అందిస్తుంటారు. మే రెండోవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది.

పచ్చిరొట్ట... అందేదెన్నడో?

భూసారానికి ఉపయుక్తంగా పచ్చిరొట్ట విత్తనాలు

ఇంకా రైతులకు అందుబాటులోకి రాని వైనం

కేటాయింపులు కూడా అరకొరే.. జిల్లాకు 1350 క్వింటాళ్లతో సరి


బాపట్ల, మే 23(ఆంధ్రజ్యోతి): పచ్చిరొట్ట విత్తనాలు పోషకగని లాంటివి.  ఏటా ఖరీఫ్‌ సాగుకు ముందు రాయితీపై రైతులకు వీటిని అందిస్తుంటారు. మే రెండోవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది. మే మూడో వారం దాటినా ఇంతవరకు రైతుభరోసా కేంద్రాల్లో వాటి జాడే లేదు. ఇదే అంశంపై  జిల్లా వ్యవసాయ శాఖను వివరణ కోరగా జిల్లాకు 1,350 క్వింటాళ్లను కేటాయించారని రవాణా విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని రెండమూడు రోజుల్లో వాటిని రైతుభరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు  అందిస్తామని తెలిపింది


దిగుబడులు పెరిగే అవకాశం...

పచ్చిరొట్ట విత్తనాలు వాడడం వలన భూసారం పెరుగుతుంది. వీటివల్ల నేలలోనే సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కలకు అవసరమైన పోషకాల లభ్యతకు పచ్చిరొట్ట ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేలకు నీటిని ఎక్కువరోజులపాటు నిల్వ చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఇమిడి ఉండడం వల్లనే వ్యవసాయశాఖ వీటిని రాయితీలపై రైతులకు అందిస్తోంది. కానీ అవి సకాలంలో వారికి అందించకపోవడంతో రైతులకు నష్టం చేకూరుతోంది.


జిల్లాకు 1,350 క్వింటాళ్ల కేటాయింపు..

వీటి కేటాయింపులు కూడా అవసరానికి తగ్గట్లు కాకుండా అరకొరగానే ఉంటున్నాయి.  1,350 క్వింటాళ్లు  మాత్రమే జిల్లాలోని అన్నదాతలకు అందుబాటులో ఉంచనున్నారు.  50 శాతం రాయితీతో జీలుగ, జనుము, పిల్లిపెసర ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందించనున్నారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం తీసుకుని సమీపంలోని రైతుభరోసా కేంద్రాల్లోని వీఏఏని సంప్రదించి పచ్చిరొట్ట విత్తనాల కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకుని నగదు చెల్లించాలి. వెంటనే రైతు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. నగదు చెల్లించిన ఏడు రోజుల్లోపు పచ్చిరొట్ట విత్తనాలను రైతులు పొందవచ్చు..

   

Updated Date - 2022-05-24T05:41:31+05:30 IST