న్యాయ శృంఖలాల్లో స్వేచ్ఛ!

ABN , First Publish Date - 2020-07-04T06:26:51+05:30 IST

‘బెయిల్ ఇవ్వడమే సాధారణం, జైలులో ఉంచడం అసాధారణం’ అనేది ఒక పవిత్ర న్యాయ సూత్రం. చాలా తక్కువ మంది జడ్జీలు మాత్రమే ఈ సూత్రంలోని మొదటి భాగాన్ని వినియోగిస్తున్నారు. అనేక మంది జడ్జీలు...

న్యాయ శృంఖలాల్లో స్వేచ్ఛ!

‘బెయిల్ ఇవ్వడమే సాధారణం, జైలులో ఉంచడం అసాధారణం’ అనేది ఒక పవిత్ర న్యాయ సూత్రం. చాలా తక్కువ మంది జడ్జీలు మాత్రమే ఈ సూత్రంలోని మొదటి భాగాన్ని వినియోగిస్తున్నారు. అనేక మంది జడ్జీలు సంతోషంగా రెండో భాగాన్ని అన్వయిస్తున్నారు! జయరాజ్, బెనిక్స్‌లను నిజానికి పోలీస్ కస్టడీకి గానీ, జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయవలసిన అవసరమేలేదు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడే వారికి బెయిల్ మంజూరు చేసి వుండవలసింది.


ఒకవ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆమె/ అతను తప్పు చేసివుండాలి. ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆమె /అతను దోషి కిందే లెక్క. ఒక వ్యక్తిని జుడీషియల్ కస్టడీకి (ఇది పోలీస్ కస్టడీకి భిన్నమైనది) పంపిస్తే ఆమె/ అతను జైలుశిక్షకు అర్హులవుతారు. ‘స్వేచ్ఛ’అనే అనుల్లంఘనీయమైన హక్కును పరిరక్షించే విషయంలో మన నిర్దయత, స్వేచ్ఛాహక్కు హరించుకుపోతుండడం పట్ల మన అజ్ఞానం అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ విషాదాంతానికి, తమిళనాడులో జయరాజ్, ఫెనిక్స్‌ల విషాదాంతానికి, దరిమిలా అక్కడ, ఇక్కడ ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహాలకు దారితీశాయి. 


జయరాజ్, బెనిక్స్‌ల ఉదంతం భారత్‌లో పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు సంబంధించిన మొదటి కేసు కాదు. పోలీసు నిర్బంధంలో ఉన్న వారు చిత్రహింసలకు గురవుతున్న ఉదంతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ 1996లో డి.కె. బసు (పశ్చిమ బెంగాల్), ఎ.కె. జాన్ (ఉత్తరప్రదేశ్) రాసిన లేఖలను దేశ సర్వోన్నతన్యాయస్థానం న్యాయమూర్తులు ఇరువురు సూ మోటో పిటీషన్లుగా విచారణకు చేపట్టి అదే సంవత్సరంలో చరిత్రాత్మక తీర్పునొకదాన్ని వెలువరించారు. ఆ తీర్పును దేశ ఉన్నత న్యాయవ్యవస్థ పలుమార్లు ధ్రువీకరించింది. ఆ తీర్పు వెలువడి 24 సంవత్సరాలు గడిచినప్పటికీ పోలీసు నిర్బంధంలో ఉన్నవారు ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఎటువంటి మార్పులేకపోవడం ఎంతైనా శోచనీయం.


రాజ్యవ్యవస్థ నిజాయితీని సగటు పౌరుడు విశ్వసిస్తాడు. ఒక పోలీసధికారి, ఒక ప్రాసిక్యూటర్, ఒక మెజిస్ట్రేట్, ఒక న్యాయమూర్తి, ఒక డాక్టర్ సదా చట్టబద్ధంగా ప్రవర్తిస్తారని నమ్మేందుకు కూడా అతనికి ఎటువంటి అభ్యంతరముండదు. అయితే ఈ విషయంలో సగటు పౌరుడు/పౌరురాలు పొరపడుతున్నారు. న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ ఏమన్నారో చూడండి: ‘మనమందరమూ చేసే తప్పులను కార్యనిర్వాహక వర్గం (ప్రభుత్వం) చేయదని ఎవరూ భావించకూడదు. ప్రభుత్వవ్యవస్థలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కొన్నిసార్లు తాము చేయకూడని పనులను చేస్తారు; కొన్నిసార్లు తాము చేయవలసిన పనులను చేయరు’. 


పోలీసు కస్టడీలో చిత్ర హింసల ఉదంతాలకు మూలాలు కేవలం సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతర పరిస్థితుల్లో మాత్రమే వుండవు. వాటి ఆనవాళ్ళను వివిధ దశ (అరెస్ట్, బెయిల్ నిరాకరణ, పోలీసు కస్టడీలో ఉంచేందుకు అనుమతించడం, జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయ డం)లలో ఉంటాయన్న వాస్తవాన్ని మనం గుర్తించి తీరాలి. ప్రతి దశకు సంబంధించి చట్టం స్పష్టంగానే ఉన్నది. అయితే చట్టాన్ని వర్తింప చేయడంలో మనం తరచు తప్పు చేస్తున్నాం. మరింత స్పష్టంగా చెప్పాలంటే చట్టోల్లంఘనకు పాల్పడుతున్నాం.


తొలుత అరెస్ట్ వ్యవహారాన్ని చూద్దాం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారాన్ని రెగ్యులర్ పోలీసులకే కాకుండా సిబిఐ, ఇడి, సి ఐడి, సిఆర్ పిఎఫ్, బి ఎస్ ఎఫ్, ట్రాఫిక్ పోలీస్, ఇన్ కమ్ ట్యాక్స్ తదితర విభాగాల వారికి కూడా దఖలు పరిచామని డికె బసు పిటిషన్ పై విచారణలో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ విభాగాలలో కొన్ని తాము ‘పోలీసు’ వ్యవస్థకు భిన్నమని, కనుక నేర శిక్షా స్మృతి ప్రకారం తాము నడుచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు, ఒక ‘కేసు డైరీ’ ని నిర్వహించాల్సిన అవసరం తమకులేదని, ఈ విషయంలో తమను ఒత్తిడి చేయడం తగదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదిస్తుంది.

మరింత ఘోరమైన విషయమేమిటంటే ఒక వ్యక్తిని ఎటువంటి పరిస్థితులలో అరెస్ట్ చేయాలనే విషయాన్ని మనం నిర్దిష్టంగా స్పష్టం చేయలేదు. పోలీసులు చేస్తున్న మొత్తం అరెస్టులలో 60 శాతం ‘అనావశ్యకమైనవి’ అని జాతీయ పోలీస్ కమిషన్ తన మూడో నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో చేసిన సిఫారసులను ఉటంకించి, వాటిని అమలుపరచకపోవడం పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేశారు. ‘ప్రాథమిక హక్కు అయిన వ్యక్తి స్వేచ్ఛ సంరక్షణకు సంబంధించిన రాజ్యాంగ నిర్దేశాలను పోలీస్ కమిషన్ సిఫారసులు ప్రతిబింబించాయి. అయితే అవి ఇంతవరకు ఎలాంటి చట్ట బద్దమైన హోదాను పొందలేదు’ అని సర్వోన్నత న్యాయమూర్తులు పేర్కొన్నారు.


ఈ పరిస్థితులను ఎలా మార్చాలి? తొలి సంస్కరణ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వివిధ అధికార సంస్థలకు కట్టబెట్టిన అధికారాన్ని ఉపసంహరించుకోవాలి. రెండో సంస్కరణ అరెస్ట్ చేసే అధికారాలు ఉన్న ఏ అధికారి అయినా సరే ‘పోలీసు’ అధికారేనని ప్రకటించాలి. మూడో సంస్కరణ అరెస్ట్ చేసే అధికారాన్ని నిర్దిష్ట పరిస్థితులలో చోటు చేసుకున్న కేసులకు మాత్రమే పరిమితం చేయడం. జయరాజ్, బెనిక్స్‌లను ఎందుకు అరెస్ట్ చేశారో గుర్తు చేసుకోండి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు, అనుమతించిన సమయం కంటే పావుగంటసేపు అదనంగా తమ దుకాణాన్ని తెరిచి వుంచారన్న ఆరోపణపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు! 


రెండో దశ, అరెస్ట్ చేసిన వ్యక్తిని జడ్జి ముందు హాజరుపరచడం, పోలీస్ కస్టడీకి రిమాండ్ చేయడం. అరెస్ట్ చేసి తమ ముందు హాజరు పరిచిన వ్యక్తిని పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసేందుకు ఒక మెజిస్ట్రేట్ లేదా జిల్లా జడ్జి ఏ మాత్రం ఆలోచించరు. యథాలాపంగా రిమాండ్ నిర్ణయం తీసుకోవడం పరిపాటి. పోలీస్ కస్టడీ గడువు (గరిష్ఠంగా 15 రోజులు) పూర్తయిన తరువాత మెజిస్ట్రేట్ లేదా జిల్లా జడ్జి సదరు వ్యక్తిని జుడీషియల్ కస్టడీకి పంపడం పరిపాటి. మనుభాయి రతీలాల్ పటేల్ కేసు (2013)లో సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించింది: ‘తన ముందు హాజరు పరిచిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పరిస్థితులను నిశితంగా అర్థం చేసుకుని, అతన్ని పోలీస్ కస్టడీకి పంపాలా లేక జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయాలా లేక అసలు ఎలాంటి రిమాండ్ చేయడం అవసరం లేదా అన్న విషయమై సొంత నిర్ణయం తీసుకోవాలి’. నిజానికి మెజిస్టేట్/ జిల్లా జడ్జి ఇలా వ్యవహరించడం చాలా అరుదు అనే చెప్పక తప్పదు.


మూడో దశ, అరెస్ట్ చేసిన వ్యక్తికి వైద్య పరీక్షలు లేదా కస్టడీకి రిమాండ్ చేయడం. జయరాజ్, బెనిక్స్‌లకు సరైన విధంగా వైద్య పరీక్షలు నిర్వహించివుంటే వారు ఆరోగ్యవంతంగా ఉన్నారని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా జరిగింది? నాలుగో దశ బెయిల్. దానిని మంజూరు చేయకూడదన్న ప్రాసిక్యూటర్ వాదనను తిరస్కరించే మెజిస్ట్రేట్/ జిల్లా జడ్జీలు చాలా కొద్దిమంది మాత్రమే వుంటారు కనీసం తొలి, మలి విచారణల్లో అటువంటి తిరస్కరణకు ఆస్కారం లేదు. ప్రతి జైలులోను దర్యాప్తులో ఉన్న ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలతో నిండిపోయి వుంటుంది. చట్టం ప్రకారం వారిని బెయిల్ పై విడుదల చేసేది ఎప్పుడు? బాలాచంద్ పిటీషన్ (1977) పై విచారణలో జస్టిస్ కృష్ణయ్యర్ ఇలా నిర్దేశించారు: ‘బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్’ (బెయిల్ ఇవ్వడమే సాధారణం, జైలులో ఉంచడం అసాధారణం). తదాది ఈ నిర్దేశం ఒక పవిత్ర న్యాయనియమం గా పరిగణన పొందుతోంది. అయితే చాలా తక్కువ మంది మెజిస్ట్రేట్/ జడ్జీలు మాత్రమే ఆ పవిత్ర సూత్రంలోని మొదటి భాగాన్ని వినియోగిస్తున్నారు. అనేక మంది జడ్జీలు సంతోషంగా రెండో భాగాన్ని అన్వయిస్తున్నారు! తండ్రీ తనయులు జయరాజ్, ఫెనిక్స్‌లు పాల్పడిన నేరమేదైనా వుంటే అది ఉపేక్షింపదగినదే. నిజానికి వారిని పోలీస్ కస్టడీకి గానీ, జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయవలసిన అవసరమేలేదు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడే వారిరువురికీ బెయిల్ మంజూరు చేసి వుండవల్సింది. అలా జరగక పోవడం చాలా నిరుత్సాహం కల్గిస్తోంది. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన న్యాయం ధర్మ మీమాంసలో ఒక విధంగాను, ఆచరణలో మరో విధంగానూ ఉంటోంది! అయితే ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. 


ఇటీవల (2020 జనవరి 29) సుశీలా అగర్వాల్ కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒకటి, గురు బక్ష్ సింగ్ సిబ్బియా కేసు(1980)లో మరో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఎనిమిది తీర్పులను ధైర్యంగా త్రోసిపుచ్చింది. మరికొన్ని ఇతర తీర్పులలో వెలువరించిన అభిప్రాయాన్ని ‘ఉత్తమ న్యాయం’గా భావించలేమని స్పష్టం చేసింది. తప్పు చేయడం మానవ సహజం. తప్పును సరిద్దిడమే న్యాయం. జయరాజ్, బెనిక్స్‌లు చనిపోయే ముందు వారు ఎదుర్కొన్న విషమ పరిస్థితుల లాంటి చిక్కుల్లో ఉన్నవారు నైరాశ్యానికిలోను కావలసిన అవసరం లేదు. అటువంటి వారికి తప్పక న్యాయం జరుగగలదనే ఆశాభావం ఇంకా ఉన్నది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-07-04T06:26:51+05:30 IST