మోదీ ఉన్నారు, అది సాధ్యమే : చిదంబరం

ABN , First Publish Date - 2022-05-01T00:56:51+05:30 IST

దేశంలో విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత

మోదీ ఉన్నారు, అది సాధ్యమే : చిదంబరం

న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, బొగ్గును రవాణా చేయాలని నిర్ణయించి సరైన పరిష్కారాన్ని కనుగొన్నారని ఎద్దేవా చేశారు. మోదీ ఉన్నారని, ఇలాంటివి సాధ్యమేనని వ్యాఖ్యానించారు. 


చిదంబరం శనివారం ఇచ్చిన వరుస ట్వీట్లలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బొగ్గు పుష్కలంగా ఉందని, విస్తృతమైన రైల్ నెట్‌వర్క్ ఉందని, థర్మల్ ప్లాంట్లను గరిష్ఠ సామర్థ్యంతో వాడుకోవడం లేదని, అయినప్పటికీ, తీవ్రమైన విద్యుత్తు కొరత వేధిస్తోందని దుయ్యబట్టారు. దీనికి మోదీ ప్రభుత్వాన్ని నిందించకూడదని,  అరవయ్యేళ్ళ కాంగ్రెస్ పాలన వల్లే ఇలా జరిగిందని వ్యంగ్యంగా అన్నారు. 


వ్యంగ్యం నిండిన మరొక ట్వీట్‌లో, బొగ్గు, రైల్వే లేదా విద్యుత్తు మంత్రిత్వ శాఖల్లో అసమర్థత లేదన్నారు. ఈ శాఖల గత కాంగ్రెస్ మంత్రులనే నిందించాలన్నారు. ప్రభుత్వం సరైన పరిష్కారాన్ని కనుగొందని, ప్రయాణికుల రైళ్లను రద్దు చేయడం, బొగ్గు రవాణా చేయడమే ఆ పరిష్కారమని ఎద్దేవా చేశారు. ‘మోదీ ఉన్నారు, అది సాధ్యమే’ అన్నారు. 


అనేక రాష్ట్రాల్లో విద్యుత్తు సంక్షోభం

వేసవి తాపం పెరగడంతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతోంది. అనేక రాష్ట్రాలు విద్యుత్తు కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. శుక్రవారం డిమాండ్ ఆల్ టైమ్ హైకి చేరింది. 207.11 గిగా వాట్ల విద్యుత్తు అవసరమైంది. దీంతో విద్యుదుత్పత్తి సంస్థలకు బొగ్గును రవాణా చేయడానికి మార్గం సుగమం చేయడం కోసం అనేక ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఇదిలావుండగా, విద్యుత్తు సంక్షోభానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నాయి. 


Updated Date - 2022-05-01T00:56:51+05:30 IST