Abn logo
Jun 19 2021 @ 00:34AM

బాతాఖానీ దుకాణం

వస్తుసేవల పన్నుకు సంబంధించిన శాసనాధికారాలను జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, కేంద్రప్రభుత్వం సొంతం చేసుకున్నాయి. జీఎస్టీ బకాయిలు, నష్టపరిహారం చెల్లింపు నిలిపివేసి లేదా జాప్యం చేసి నిధుల కోసం కేంద్రప్రభుత్వాన్ని ‘అడుక్కునే’ దుస్థితిని రాష్ట్రాలకు కల్పించాయి.


వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మరీ సరికొత్తదేం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో అది అమల్లో ఉంది. భిన్న జీఎస్టీ నమూనాలు ఉన్నప్పటికీ మౌలిక సూత్రం ఒకటే: సరఫరాల పరంపరలో ఒక దశలో చెల్లించిన పన్ను తదుపరి దశలో చెల్లించవలసిన పన్నుకు చెల్లుబడి అవుతుంది. మరింత వివరంగా చెప్పాలంటే పన్నుపై పన్ను వసూలు చేయకూడదు. ఎక్సైజ్ సుంకం, సర్వీస్ ట్యాక్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు తొలుత మోడ్వాట్, ఆ తరువాత సెన్వాట్ (కేంద్రప్రభుత్వ వ్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇవి మంచి ఫలితాలనిచ్చాయి. సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను అనుసరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను బృహత్ ప్రయత్నంతో కేంద్రం ఒప్పించింది. కేంద్రప్రభుత్వ సెన్వాట్, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ తమ తమ అధికార పరిధులలో స్వతంత్రంగా అమల్లో ఉండేవి. అయితే అంతర్-రాష్ట్ర అమ్మకాలు, అంతర్ రాష్ట్ర సేవలు మొదలైన కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. సరఫరా పరంపరలో ఒకదశలో ‘సేవ’గా పరిగణించినదానిని మరొక దశలో ‘విక్రయం’గా పరిగణించడం జరిగింది. ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారమే జీఎస్టీ. ఇది మొత్తం వస్తు విక్రయాలకు, సమస్త సేవలకు వర్తిస్తుంది. 


వస్తుసేవల పన్ను విషయమై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకాభిప్రాయానికి తీసుకురావడమనేది ఒక బృహత్ ప్రయత్నం. కేంద్రం, రాష్ట్రాలు గౌరవించాల్సిన అంశాలలో కొన్నిటిని పేర్కొంటాను. భారత రాజ్యాంగం సమాఖ్య విధాన స్వభావం కలిగినది. పన్నులు విధించే అధికారం కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజింపబడింది. రాష్ట్రాలు తమ ఆదాయానికి ప్రధాన వనరు అయిన వస్తువిక్రయాలపై పన్ను విధించే అధికారాన్ని వదులుకోవలసిన అవసరముంది. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు అనే ప్రత్యేకత అసంగతమైనది. జీఎస్టీ వల్ల తాము ఆదాయాన్ని నష్టపోవలసివస్తుందనే రాష్ట ప్రభుత్వాల భయాలను నష్టపరిహారం చెల్లింపుపై చట్టబద్ధ హామీలు ఇవ్వడం, వస్తుసేవల పన్ను అమలుకు కట్టుదిట్టమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం తొలగించాలి. పరస్పర విశ్వాసం, గౌరవం ప్రాతిపదికన జీఎస్టీ అమలు వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు భాగస్వాములుగా ఉంటాయి. జీఎస్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతోనే తీసుకోవాలనేది ఒక అతి ముఖ్య అలిఖిత నియమం. అయినా ప్రతి నిర్ణయంపైన ఓటింగ్ నిర్వహించడం తప్పనిసరి. 


కేంద్రం, రాష్ట్రాలు పైన ప్రస్తావించిన నియమాలకు కట్టుబడి వుండేలా చేసేందుకు యశ్వంత్ సిన్హా, కీర్తిశేషుడు ప్రణబ్ ముఖర్జీ, నేను సకల ప్రయత్నాలు చేశాము. అలాగే అరుణ్ జైట్లీ కూడా. అయితే ఆయన తొలుత పన్ను రేట్ల విషయంలో కొన్ని తప్పులు చేశారు. వస్తుసేవల పన్ను వ్యవస్థ రూపకల్పనకు ఏర్పాటైన ఆర్థికమంత్రుల సమావేశాలు, జీఎస్టీ మండలి సమావేశాలు అరుణ్ జైట్లీ అధ్యక్షుడుగా ఉన్నంతవరకు చాలా సజావుగా, ఎటువంటి ఘర్షణలు, వివాదాలకు తావులేకుండా జరిగాయి. కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ జీఎస్టీ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. 


నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టాక ఆమె అధ్యక్షత జరిగిన ప్రతి సమావేశంలోనూ ఏదో ఒక అంశంపై ఘర్షణ ఏర్పడేది, వివాదం నెలకొనేది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాస గౌరవాలకు విఘాతమేర్పడింది. అంతర్ రాష్ట్ర వాణిజ్య వ్యాపారాలపై మినహా జీఎస్టీ విధించేందుకు పార్లమెంటు, శాసనసభలకు అధికరణ 246 ఏ అధికారమిచ్చింది. అంతర్ రాష్ట్ర వ్యాపార లావాదేవీల విషయమై అధికరణ 269 ఏ వివరణ ఇస్తూ కేంద్రం జీఎస్టీ విధించాలని, సంబంధిత రాబడిని జీఎస్టీ మండలి సిఫారసులపై కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపకం చేయాలని పేర్కొంది. జీఎస్టీ మండలిని సృష్టించాలని అధికరణ 279 ఏ నిర్దేశించింది. రాజ్యాంగనిర్దేశం ప్రకారం కేంద్ర ఆర్థికమంత్రి ఆ మండలి చైర్‌పర్సన్‌గా నియమితులవుతారు. వైస్ చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక నిర్వహించాలి. పన్నులు, సెస్‌లు, సర్‌చార్జీలు విధించడంతో సహా జీఎస్టీకి సంబంధించిన ప్రతి అంశంపైన మండలి సిఫారసుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. 


అయితే ఇప్పుడేం జరుగుతోంది? జీఎస్టీ కౌన్సిల్‌కు సంబంధించిన ప్రతి నియమం ఉల్లంఘనకు గురవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ 2016లో ఏర్పడినా ఇప్పటివరకు దాని వైస్ చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక నిర్వహించలేదు. 2020 అక్టోబర్-–2021 ఏప్రిల్ మధ్య ఆరునెలల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనే లేదు. వస్తుసేవల పన్నును అమలుపరిచే అధికారుల కమిటీని రహస్యంగా నియమించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్‌ను పక్కన పెట్టేశారు. దానితోపాటు రాష్ట్ర శాసనసభలను ఉపేక్షించి అధికారుల కమిటీ ‘సిఫారసుల’ను కేంద్రప్రభుత్వం వస్తుసేవల పన్ను నియమాలుగా నిర్దేశిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశానికి ముందు పంజాబ్ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ బాదల్ ఈ అంశాలన్నిటిపై ఆందోళన వ్యక్తం చేశారు. -కొవిడ్ చికిత్సలకు సహాయంగా జీఎస్టీ రేట్లను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ కమిటీలో మరిన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడ ఆయన కోరారు. మండలి సమావేశ అనంతరం కొవిడ్ సంబంధిత జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిది మంది మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసిన మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు అందులో సభ్యత్వం కల్పించలేదు! 


పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి డాక్టర్ అమిత్ మిత్రా 2021 జూన్ 4న కేంద్ర ఆర్థికమంత్రికి ఒక లేఖ రాస్తూ, ఈ ఏడాది జనవరి వరకు జీఎస్టీ నష్ట పరిహార బకాయిలు రూ.63,000 కోట్ల మేరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు కూడా ఈ జూన్ 1 వరకు తమకు కేంద్రం నుంచి వరుసగా రూ.7393 కోట్లు, రూ.4635 కోట్లు, రూ.3069 కోట్లు బకాయిలు రావలసి ఉందని ప్రకటించడం గమనార్హం. వాస్తవం ఇది కాగా ఈ నెల 15న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ బకాయిల విషయాన్ని నిర్మలా సీతారామన్ ఆగ్రహావేశాలతో తిరస్కరించారు. అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు అన్నిటినీ చెల్లించేశామని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలను బెదిరించేందుకు జీఎస్టీని ఒక ఆయుధంగా మలచుకున్నది. జీఎస్టీ కౌన్సిల్‌ను ఒక బాతఖానీ దుకాణంగా తగ్గించివేసింది. వస్తుసేవల పన్నుకు సంబంధించిన కార్యసాధక శాసనాధికారాలను జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, కేంద్రప్రభుత్వం అపహరించాయి. జీఎస్టీ బకాయిలు, నష్టపరిహారం చెల్లింపు నిలిపివేసి లేదా జాప్యం చేసి నిధులు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ‘అడుక్కునే’ దుస్థితిని కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)