Petrol Price : పెట్రో ధరల తగ్గింపుపై కేంద్రం చెప్పింది సరైనదే : చిదంబరం

ABN , First Publish Date - 2022-05-22T17:26:27+05:30 IST

పెట్రోలు, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సయిజ్ సుంకంలో

Petrol Price : పెట్రో ధరల తగ్గింపుపై కేంద్రం చెప్పింది సరైనదే : చిదంబరం

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సయిజ్ సుంకంలో ప్రతి రూపాయికి 41 పైసలు రాష్ట్రాలదేనని తాను శనివారం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం ఉపసంహరించుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‘‘ఎక్సయిజ్ డ్యూటీ’’ అనే పదాలను ఉపయోగించినందు వల్ల తాను ఆ విధంగా భావించానని తెలిపారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం అదనపు ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిందని, ఇది రాష్ట్రాలకు సంబంధించినది కాదని, తాను తన వ్యాఖ్యలను సరిదిద్దుకుంటున్నానని ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. 


పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం చెప్పిన సంగతి తెలిసిందే. పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.8 చొప్పున, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు., రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇంధనం ధరలు పెరుగుతున్నాయని, ఆ ధరలకు కళ్ళెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించిందని చెప్పారు.  పెట్రోలియం ఉత్పత్తులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2021 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ సామాన్య ప్రజలకు ఆ మేరకు ఉపశమనం కల్పించని రాష్ట్రాలు కూడా ఈసారి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయాలని కోరారు. 


ఈ నేపథ్యంలో చిదంబరం శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పెట్రోలు, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరడంలో అర్థం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెంట్రల్ ఎక్సయిజ్ సుంకంలో ప్రతి రూపాయిలో 41 పైసలు రాష్ట్రాలదేనని చెప్పారు. దీని అర్థాన్ని మరింత వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం 59 పైసలు తగ్గించగా, రాష్ట్ర ప్రభుత్వాలు 41 పైసలు తగ్గించినట్లు అవుతుందని చెప్పారు. రాష్ట్రాలతో పంచుకొనని సుంకాన్ని తగ్గిస్తే, అది నిజమైన తగ్గింపు అవుతుందని తెలిపారు. 


అయితే చిదంబరం ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, పెట్రోలు, డీజిల్‌లపై పన్ను తగ్గిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటన చేసినపుడు ఉపయోగించిన పదజాలం గురించి ప్రస్తావించారు. ఆమె ‘‘ఎక్సయిజ్ డ్యూటీ’’ అనే పదాలను ఉపయోగించారని చెప్పారు. అయితే వాస్తవంగా తగ్గించినది ‘‘అదనపు ఎక్సయిజ్ సుంకం’’ అని పేర్కొన్నారు. దీనిలో రాష్ట్రాల వాటా లేదని వివరించారు. కాబట్టి శనివారం తాను చెప్పిన దానికి విరుద్ధంగా, మొత్తం భారమంతా కేంద్ర ప్రభుత్వంపైనే పడుతుందని చెప్పారు. ఆ మేరకు తాను తన వైఖరిని సరిదిద్దుకుంటున్నానని తెలిపారు. 


రాష్ట్రాలకు ఆదాయం పెట్రోలు, డీజిల్‌లపై VAT ద్వారానే లభిస్తుందని, సుంకాల నుంచి వచ్చే వాటా రూపంలో అవి పొందుతున్నది స్వల్పమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులను కానీ, మరిన్ని గ్రాంట్లను కానీ రాష్ట్రాలకు ఇవ్వనిదే అవి తమ ఆదాయాన్ని వదులుకోగలవా? అని అన్నారు. 


Updated Date - 2022-05-22T17:26:27+05:30 IST