విశృంఖల మతోన్మాదం

ABN , First Publish Date - 2022-01-08T06:41:11+05:30 IST

క్రిస్మస్ వేడుకలకు భంగం కలిగించడాన్ని, విద్వేష ప్రసంగాలను, ద్వేషపూరిత యాప్‌లను ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మత దురభిమానం అనియంత్రితంగా పెచ్చరిల్లిపోనున్నది....

విశృంఖల మతోన్మాదం

క్రిస్మస్ వేడుకలకు భంగం కలిగించడాన్ని, విద్వేష ప్రసంగాలను, ద్వేషపూరిత యాప్‌లను ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మత దురభిమానం అనియంత్రితంగా పెచ్చరిల్లిపోనున్నది. భయానక భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి. అంతకంటే ముఖ్యంగా మత సంకుచితత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడండి. మౌనం వహిస్తే మీ కోసం మాట్లాడేవారెవ్వరూ మిగలరు.


మొదట వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టును కాను కనుక నేను నిరసన తెలుపలేదు.

ఆ తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు. నేను సోషలిస్టును కాను కనుక నేను వ్యతిరేకించలేదు. 

పిదప వారు కార్మిక నాయకుల కోసం వచ్చారు. నేను కార్మిక నాయకుడిని కాను కనుక నేను ఆక్షేపించలేదు. 

అనంతరం వారు యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాను కనుక ఆగ్రహించలేదు. 

ఇప్పుడు వారు నా కోసం వచ్చారు. నా పక్షాన మాట్లాడేవారు ఒక్కరూ మిగలలేదు.


– జర్మన్ మత ధర్మవేత్త మార్టిన్ నెమోలర్ (1892–1984) అజరామర మాటలవి. 



డిసెంబర్ 25 క్రిస్మస్ పర్వదినం. ఆ రోజు అర్ధరాత్రి వేడుకలు ముగియక ముందే కొన్ని ప్రదేశాలలో పాపాలు పండిపోయాయి. ఏ దౌష్ట్యాలకు వ్యతిరేకంగా జీసస్ ఎలుగెత్తాడో ఆ దుష్కృత్యాలే మళ్ళీ సంభవించాయి. పాత సంవత్సరం (2021) అప్రియంగా ముగిస్తే కొత్త ఏడాది (2022) అమంగళకరంగా ప్రారంభమయింది. క్రిస్మస్ దరిమిలా సంభవించిన పరిణామాలు క్రైస్తవులు, ఉదారవాదులకు ఒకేవిధమైన సవాళ్లను విసిరాయి. 


గడచిన సంవత్సరం ఫాదర్ స్టాన్‌స్వామిని మనకు శాశ్వతంగా దూరం చేసింది. తమిళనాడుకు చెందిన ఆ మిషనరీ తన జీవితమంతా ఒడిషాలోని ఆదివాసుల మధ్య గడిపాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణపై ఆయనను అరెస్ట్ చేశారు. ఇది కచ్చితంగా తప్పుడు అభియోగమనేది నా నిశ్చిత విశ్వాసం. జైల్లో ఆయనను అమానుషంగా వేధించారు. వైద్యం నిమిత్తం బెయిల్ మంజూరు చేయడానికి కూడా నిరాకరించారు. న్యాయస్థానంలో ఆయనపై విచారణే ప్రారంభం కాలేదు. అంతిమ ఘడియల్లోనూ వైద్యంకోసమైనా విడుదల చేయలేదు. చనిపోవడానికి మాత్రమే అనుమతించారు! ఈ అనాగరికం భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. సరే, సంవత్సరాంతంలో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్’ (మదర్ థెరెసా నెలకొల్పిన సేవాసంస్థ)కు, విదేశీ విరాళాలు స్వీకరించే విషయంలో అనుమతి నిరాకరించారు! కారణమేమిటి? ఆవర్జాలో చిన్నపాటి తప్పులు!


క్రిస్మస్ పండగ నాడు జరిగిన ఘటనలు క్షమార్హం కానివి. ‘తాము ఏమి చేస్తున్నదీ వారికి తెలియదు కనుక’ అన్న జీసస్ ప్రవచన స్ఫూర్తితో ఆ నేరగాళ్లను క్రైస్తవసోదరులు క్షమించినా చట్టం క్షమించకూడదు. కొన్నాళ్లుగా అదే రీతిలో చోటు జరుగుతున్న ఈ సంఘటనలనూ పరిగణనలోకి తీసుకోండి.


హర్యానాలోని అంబాలా నగరంలో హోలీ రిడీమర్ చర్చిని 1840లలో నిర్మించారు. క్రిస్మస్ రోజు అర్ధరాత్రి చర్చిని మూసివేసిన తరువాత ఇద్దరు వ్యక్తులు ఆ ఆరాధనా మందిరంలోకి ప్రవేశించారు. జీసస్ ప్రతిమను కూల్చివేశారు. శాంటక్లాస్ బొమ్మలను దగ్ధం చేశారు. అంతకు రెండురోజుల ముందు మరో పట్టణం పటౌడీలోని చర్చిలో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ ప్రార్థనలకు అంతరాయం కలిగించారు.


క్రిస్మస్ రోజునే ఆగ్రాలో మిషనరీ కళాశాలల ఎదుట శాంటక్లాస్ బొమ్మలను దగ్ధం చేశారు. ఈ విధ్వంసాన్ని బజ్‌రంగ్‌దళ్ ప్రధాన కార్యదర్శి సమర్థించాడు. ‘శాంటక్లాస్ తీసుకువచ్చే బొమ్మలతో వారు మా పిల్లలను తమ మతం వైపు ఆకట్టుకుంటున్నారు. లోకం తెలియని పిల్లలకు క్రైస్తవ మతదీక్ష ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన ఆరోపించాడు. మరి మిషనరీ కళాశాలలు దశాబ్దాలుగా ‘మన పిల్లలు’ వేలాది మందికి స్వార్థరహితంగా విద్యనందిస్తున్నాయన్న సత్యాన్ని ఆ బజరంగ్ దళీయుడు విస్మరించాడు. 


అస్సోంలోని సచార్ జిల్లాలో కాషాయ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు క్రిస్మస్ పండుగ రాత్రి ఒక ప్రెస్బిటేరియన్ చర్చిలోకి చొరబడి హిందువులందరూ ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. అదే రోజు పలు ఇతర చర్చిలలో కూడా కొంతమంది ప్రవేశించి మిషనరీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


2021లో పలు రాష్ట్రాలు, ముఖ్యంగా కర్ణాటక, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని మతాంతరీకరణ నిరోధక బిల్లులను ప్రవేశపెట్టాయి. ఇతర మతాలవారికి, ముఖ్యంగా హిందువులకు క్రైస్తవ మతదీక్ష ఇస్తున్నారనేది ఆయా ప్రభుత్వాల ఆరోపణ. అయితే ఇందుకు సరైన రుజువులు లేవు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థలలోని కరడుగట్టిన మితవాదులు తమ దాడులకు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటున్నారనేది స్పష్టం. వీరిని ఇంకెంతమాత్రం నిర్లక్ష్యం చేయలేము. ఎందుకంటే వారు ఇప్పుడు ప్రధాన స్రవంతిగా వర్థిల్లుతున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం కూడా కలిగిఉన్నారు.


ఇప్పుడు వెల్లువెత్తుతున్న విద్వేష ప్రసంగాలకు ముస్లింలే కాదు, క్రైస్తవులు కూడా లక్ష్యంగా ఉన్నారు. హిందూవేతరుల పట్ల ద్వేషభావాన్ని వ్యాపింపచేయడం, పెంపొందించడమే ఆ ప్రసంగాల లక్ష్యం. ఆరు నెలల క్రితం ఢిల్లీలో ‘సల్లీ డీల్స్’ అనే యాప్, కొద్ది రోజుల క్రితం ముంబైలో ‘బుల్లీ బాయి’ అనే యాప్ బాగా పాచుర్యం పొందాయి. ఈ యాప్‌లలో ముస్లిం మహిళల ఫోటోలు ప్రదర్శించారు. ఎందుకు? వారిని వేలం వేయడానికి! మహానీచమైన పని ఇది. ‘బుల్లీ బాయి’ని ప్రమోట్ చేసిన ట్విటర్, సిక్కులవని భావించే ‘ఖాల్సా సూపర్ మాసిస్ట్’, ‘జతీందర్ సింగ్ భుల్లర్’, ‘హర్పాల్’ మొదలైన పేర్లను ఉపయోగిస్తోంది. విద్వేషాలను ప్రజ్వలింప చేసేవారి తదుపరి లక్ష్యం, బహుశా, సిక్కు మతస్థులే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


హిందువులు ఎంతగా భారతీయులో అలాగే ఈ దేశపౌరులయిన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు కూడా అంతగానే భారతీయులు. తమ మత విశ్వాసాలను ఆచరించే హక్కు వాళ్లందరికీ ఉంది. తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కును ప్రతి భారతీయపౌరునికీ భారత రాజ్యాంగం (భారతదేశంలోని ప్రజలందరూ తమకు ఇష్టమైన మత విశ్వాసాలను కలిగి ఉండవచ్చు. ఏ మతాన్ని అయినా  స్వీకరించవచ్చు. ఆచరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు... అని అధికరణ 25 చెప్పింది) కల్పించింది. కరడుగట్టిన మతతత్వవాదులు ఈ హక్కును సవాల్ చేస్తున్నారు. వారి వైఖరి రాజ్యంగ విరుద్ధం.


ఈ మత దురభిమానులు విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. వీరి వల్ల భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు సంభవించనున్నాయనేది మనం ఊహించవచ్చు. ఇటీవల హరిద్వార్‌లో కొంతమంది విద్వేష ప్రసంగాలు చేశారు. ఒక మహాశయుని ప్రసంగాన్ని ఉటంకిస్తాను: ‘మీరు వారి పనిపట్ట దలుచుకుంటే వారిని చంపివేయండి... 20 లక్షల మంది (ముస్లింలు అనేది వక్త భావం)ని చంపివేయడానికి మనకు 100మంది సైనికులు అవసరం... చంపడానికో లేదా చనిపోవడానికో సిద్ధంకండి. మరో ప్రత్యామ్నాయం లేదు. పోలీసులు, సైనికులు, రాజకీయవేత్తలతో సహా ప్రతి హిందువు మయన్మార్‌లో జరిగినట్టుగా ఈ ప్రక్షాళన కార్యక్రమానికి పూనుకోవాలి’. ఈ విద్వేష ప్రసంగం జాతి సంహారానికి ఒక స్పష్టమైన పిలుపు.


ఈ మతోన్మాద ప్రేలాపనలను రాజ్యాంగవిలువలకు నిబద్ధులయిన వారెవరూ సహించరు, సహించకూడదు. అయితే అవి అహేతుక, వాగాడంబర ప్రసంగాలు కావు. వాటి వెనుక ఒక నిర్దిష్టమైన కారణముందని ఆలోచనాపరులకు అనిపిస్తోంది. బీజేపీ ఎజెండాను ప్రధాని మోదీ ఎందుకు, ఎలా పునర్ నిర్వచించారో హిలాల్ అహ్మద్ వివరించాడు. హిందూత్వ శ్రేణుల సర్వోన్నత నాయకుడిగా తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడానికి ప్రధాని మోదీని కొవిడ్ విపత్తు, రైతుల ఉద్యమం, విషమిస్తున్న ఆర్థిక సంక్షోభం పురి గొల్పాయని హిలాల్ పేర్కొన్నాడు. అభివృద్ధి, హిందూత్వ ఒకదానితో ఒకటి ముడివడిపోయాయి. వాటిని ఇంకెంత మాత్రం వేరు చేయడానికి వీలులేదు. ఈ కారణంగానే కరడుగట్టిన మితవాదులు హిందూయేతర మతస్థులను హిందూత్వతో పాటు అభివృద్ధికి కూడా శత్రువులని గట్టి ప్రచారం చేస్తున్నారు. 


క్రిస్మస్ వేడుకలకు భంగం కలిగించడాన్ని, విద్వేష ప్రసంగాలను, ద్వేషపూరిత యాప్‌లను ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మత దురభిమానం అనియంత్రితంగా పెచ్చరిల్లిపోనున్నది. భయానక భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి. అంతకంటే ముఖ్యంగా మత సంకుచితత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడండి. మౌనం వహిస్తే మీ కోసం మాట్లాడేవారెవ్వరూ మిగలరు.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-01-08T06:41:11+05:30 IST