‘రెక్కల గుర్రం’పై మోదీ సర్కార్!

ABN , First Publish Date - 2021-07-24T06:20:29+05:30 IST

నరేంద్ర మోదీ గారూ, మీరు గుజరాతీ కవి, నాటకకర్త చినుమోడీ రాసిన ‘అశ్వమేధ్’ నాటకం చదవలేదా? ఆ నాటకంలోని యజ్ఞాశ్వం పేరు బైజాక్. ఈ పేరుతో ఉన్న స్పైవేర్ కోసం మీ అధికార యంత్రాంగం ఎందుకు వెతకలేదు?...

‘రెక్కల గుర్రం’పై మోదీ సర్కార్!

నరేంద్ర మోదీ గారూ, మీరు గుజరాతీ కవి, నాటకకర్త చినుమోడీ రాసిన ‘అశ్వమేధ్’ నాటకం చదవలేదా? ఆ నాటకంలోని యజ్ఞాశ్వం పేరు బైజాక్. ఈ పేరుతో ఉన్న స్పైవేర్ కోసం మీ అధికార యంత్రాంగం ఎందుకు వెతకలేదు? ఈ ఆత్మ నిర్భరత రోజుల్లో గ్రీక్ పురాణగాథకు సంబంధించిన ‘పెగాసస్’ పేరుతో ఉన్న స్పైవేర్‌ను ప్రభుత్వం ఎంపిక చేసుకోవడం ఏమీ బాగోలేదు...!


నిష్పాక్షికంగా విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తానని పదవీస్వీకారం సందర్భంగా మంత్రులు ప్రమాణం చేస్తారు. అయితే ఆ ప్రమాణంలో సత్యమే చెబుతానన్న హామీ సూచనప్రాయంగా ఉందా? లేదు. సత్యం పలు విధాలుగా ఉంటుంది. వివిధ రూపాలలో ఉంటుంది. సార్స్ కరోనా వైరస్–-2లా అది ఉత్పరివర్తనం చెందుతుంది. ఒక విజ్ఞుని లెక్కలో సత్యానికి యాభై ఛాయలు ఉన్నాయి. సంపూర్ణ సత్యం ఉంది. ప్రత్యామ్నాయ సత్యం ఉంది. ఒక మంత్రి, సందర్భాన్ని బట్టి సత్యం రూపాంతరాలలో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటాడు. అదే సత్యమని వాదిస్తాడు.


ఒక కొత్త మంత్రి, పార్లమెంటులో తన తొలి ప్రసంగంలో ఇదే చేశాడు. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, పాత్రికేయులు, పౌరహక్కుల కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ‘ఎంచుకున్న వ్యక్తుల’ సామాజిక స్నేహితులు మొదలైన వారిపై గూఢచర్యం నిర్వహించడం గురించి విపక్షాలు ధ్వజమెత్తినప్పుడు ‘వేలాది మొబైల్ ఫోన్ల యజమానుల పేర్లు ‘ఆసక్తికర వ్యక్తుల’ జాబితాలో ఉన్నాయని ఆ మంత్రి వెల్లడించారు. ఆ వేలాది మొబైల్స్‌లో కనీసం కొన్ని వందల ఫోన్లలో స్పైవేర్ అక్రమంగా ప్రవేశించి, వాటిని హ్యాక్ చేసింది. ఇందుకు పెగాసస్ అనే మాల్‌వేర్‌ను ఉపయోగించారు. విశేషమేమిటంటే ‘ఆసక్తికర వ్యక్తుల’ జాబితాలో ఆ మంత్రి పేరు కూడా ఉంది! 


ఈ నిఘా వ్యవహారాన్ని అర్థం చేసుకునేందుకు మనం గ్రీక్ పురాణగాథలలోకి వెళ్లవలసి ఉంది. పెగాసస్ అంటే రెక్కలగుర్రం. మెడుసా (ఒక రాక్షస స్త్రీ. ఈమె తల వెంట్రుకలు పాములు) రక్తం నుంచి పెగాసస్ ఉద్భవించింది. ఆ రెక్కలగుర్రం జ్యూస్ అనే ధీరోదాత్తుని సేవకి. తన యజమానికి అవసరమైనప్పుడల్లా ‘ఉరుములు, పిడుగులు’ తీసుకువస్తుంది. పెగాసస్ ఒక నిగూఢ జీవి. దానికి అసాధ్యమైనవేవీ లేవు. దివ్యస్ఫూర్తికి ప్రతీక. స్వర్గయాత్రకు సంకేతం. అది ఒకవిధంగా ‘మోదీ హై, తో ముమ్కిన్ హై’ అనే నినాదం లాంటిది. 


పురాణగాథల నుంచి వర్తమానానికి వస్తే పెగాసస్ ఒక సాఫ్ట్‌వేర్. దానిపై సర్వ హక్కులు ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌వి. అది ఇప్పుడు భారత ప్రభుత్వ సేవకి. ఎవరినైనా అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచేందుకు తనకు గల అసాధారణాధికారాలను ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఉపయోగించుకోవడంలో ప్రభుత్వానికి ఆ సేవకి విశేషంగా తోడ్పడుతోంది. అన్నట్టు అది, అచ్ఛేదిన్ దిశగా యాత్రకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది.


గూఢచర్యం ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని సమర్థించేందుకు కొత్త మంత్రి చాలా ఔదార్యం, క్షమాగుణం ప్రదర్శించారు. ఆయన వాదనలు ఊహించిన విధంగానే ఉన్నాయి. సమస్యను తార్కికంగా చూడాలని ఆయన అన్నారు. ‘అనధికార నిఘా’అనేది లేనేలేదని ఆయన అన్నారు. కాన్పూర్ ఐఐటి, వార్టన్ బిజినెస్ స్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన మంత్రికి వాదనా నైపుణ్యం కొరవడుతుందా ఏమిటి? తప్పుపట్టలేని ఆ తర్కాన్ని మీరు గానీ, నేను గానీ తిరస్కరించలేం. 


అయితే సాధారణ విద్యావంతుడైన ఒక సగటుపౌరుడు ఒక సూటిప్రశ్నకు సమాధానాన్ని ఆశిస్తున్నాడు. తర్కభాష, తార్కిక వాద ప్రతివాదాల గురించి అతడికి తెలియవు కదా. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి అధికారిక నిఘా నిర్వహిస్తున్నారా? అన్నదే ఆ సామాన్యపౌరుని ప్రశ్న. అధికారిక నిఘా, అనధికారిక నిఘా మధ్య తేడా ఏమిటో మంత్రికి తప్పక తెలిసే ఉంటుంది. అయితే తొలుత కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఏమిటో తెలుసుకుంటే సామాన్యపౌరుని ప్రశ్నకు మంత్రి సూటి సమాధానాన్ని ఇవ్వగలరు. ఇవీ ఆ ప్రశ్నలు:


భారత్‌లో ప్రముఖుల మొబైల్స్‌లోకి పెగాసస్ స్పైవేర్ చొరబడిందనడానికి రుజువులు ఉన్నాయా?; ప్రభుత్వం గానీ, దాని ఏజెన్సీలు గానీ పెగాసస్ స్పైవేర్‌ను సంపాదించాయా?; ఆ సాఫ్ట్‌వేర్‌ను పొందేందుకు ఎంత సొమ్మును చెల్లించారు? దానిని లక్షిత మొబైల్స్ ఒక్కోదానిలో ప్రవేశ పెట్టేందుకు ఎంత వెచ్చించారు? విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఈ ధర చాలా పెద్దమొత్తంలో ఉంది. అయితే వందలాది మొబైల్స్‌ను లక్ష్యంగా నిర్ణయించుకున్నందున రాయితీలు ఉన్నాయి. తనపై నిఘా ఉంచిన కాలంలో తన ఫోన్ హ్యాక్ అయిందీ లేనిదీ తెలుసుకోవడానికి మంత్రి తన మొబైల్‌ను న్యాయసంబంధిత పరీక్షకు నివేదించడానికి అంగీకరిస్తారా? 


మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. గూఢచర్య ఆరోపణలను నిరాకరిస్తూ ఎన్‌ఎస్ఓ గ్రూప్ ఇచ్చిన వివరణను కూడ తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘అటువంటి సేవలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా సదా బహిరంగంగా అందుబాటులో ఉంటాయి. ఆ సేవలను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్‌కంపెనీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి.’ అని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ వివరించడమే కాక తమ సాంకేతికతలను సమగ్రంగా పరిశీలించి వాటి ఉపయుక్తతను నిర్ధారించుకున్న ప్రభుత్వాల ఏజెన్సీలకు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను విక్రయిస్తామని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ తన ప్రకటనలో ప్రస్తావించిన సేవలు వాస్తవానికి హెచ్‌ఎల్‌ఆర్ లుక్‌అప్ సేవలే గానీ పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించినవి కావు. అదలా ఉంచితే ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ సాఫ్ట్‌వేర్‌ విక్రయించిన ప్రభుత్వాలలో భారత ప్రభుత్వం కూడా ఉందా? కొత్త మంత్రి తన ఇన్నింగ్స్‌ను ఒక క్లిష్టపరిస్థితిలో ప్రారంభించారు. అయితే పైన పేర్కొన్న ప్రశ్నలకు ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ సమాధానాలు కనుగొని, మనతో పంచుకోక ముందే కొత్త మంత్రి ఆ ప్రశ్నలకు సమాధానాలను సమకూర్చాలి. అధ్యక్షుడు మాక్రాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్యం జరగడంపై దర్యాప్తునకు ఫ్రాన్స్ ఆదేశించింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణకు ఇజ్రాయెల్ ఒక కమిషన్‌ను నియమించింది. 


పాలకపక్షానికి ఆగ్రహం కలిగించే ఒక ప్రశ్న వేయదలచుకున్నాను. ప్రాచీన భారతదేశంలో పరాక్రమవంతులైన పలువురు రాజులు, చక్రవర్తులు అశ్వమేధయాగాలు నిర్వహించారు. వాటి నిర్వహణకు వారు ఉపయోగించుకున్న భారతీయ అశ్వాల పేరుతో ఉన్న స్పైవేర్‌ను కాకుండా గ్రీక్ పురాణగాథకు సంబంధించిన ‘పెగాసస్’ పేరుతో ఉన్న స్పైవేర్‌ను భారత ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది? ఈ ఆత్మ నిర్భరత రోజుల్లో మోదీ ప్రభుత్వ ఎంపిక నాకు కొంత నిరుత్సాహం కలిగిస్తోంది. నరేంద్ర మోదీ గారూ, మీరు గుజరాతీ కవి, నాటకకర్త చినుమోడీ రాసిన ‘అశ్వమేధ్’ నాటకం చదవలేదా? ఆ నాటకంలోని యజ్ఞాశ్వం పేరు బైజాక్. ఈ పేరుతో ఉన్న స్పైవేర్ కోసం మీ అధికార యంత్రాంగం ఎందుకు అన్వేషించలేదు? పురుకుత్సుడు, కుమార విష్ణు, సముద్రగుప్తుడు, రెండో పులకేశి, రాజరాజచోళుడు మొదలైన వారి స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం ఒక బలిష్ఠమైన గుర్రాన్ని కనుగొని అశ్వమేధం నిర్వహించాలి. ప్రధానమంత్రి వీరభక్తులను తోడిచ్చి ఆ యాజ్ఞాశ్వాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించాలి. రాష్ట్రాల పాలకులను సంపూర్ణ స్వామి భక్తులుగా చేసుకుని యావద్భారత దేశమంతటా పాలకపక్షమైన భారతీయ జనతాపార్టీ సర్వాధిపత్యాన్ని నెలకొల్పాలి. అలా చేయడం వల్ల ప్రతి ఐదేళ్ళకొకసారి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ తొలగిపోతుంది కదా. ఆసేతు హిమాచలం కాషాయ పార్టీ పాలన సుస్థిరమవుతుంది. 


పెగాసస్ నిఘాపై విపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా నిందలు వేస్తున్నారు. ‘జాతివ్యతిరేకులు’, ‘విదేశీశక్తులు’ ‘వామపక్ష సంస్థల అంతర్జాతీయ కుట్ర’ వంటి ముద్రలతో అభాండాలు వేస్తున్నారు. గూఢచర్యాన్ని ఒక దేశభక్తి ప్రపూరిత కర్తవ్యంగా కూడా ‘సమున్నతం’ చేయవచ్చు. ప్రభుత్వం గూఢచర్యం నిర్వహించడాన్ని సమర్థించేవారు చాలా పెద్దసంఖ్యలో ఉన్నప్పుడు గోప్యత హక్కుకు భరోసా ఉంటుందా? అనైతిక భారతరాజ్య ఆవిర్భావాన్ని ఎవరు అడ్డుకోగలరు?



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-07-24T06:20:29+05:30 IST