P Chidambaram Hot Comments: చేష్టలుడిగిన పార్లమెంటు... ప్రజాస్వామ్యం ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతోంది...

ABN , First Publish Date - 2022-08-07T21:19:10+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని

P Chidambaram Hot Comments: చేష్టలుడిగిన పార్లమెంటు... ప్రజాస్వామ్యం ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతోంది...

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం (Senior Congress leader P Chidambaram) తీవ్ర నిరాశ, నిస్పృహలు వ్యక్తం చేశారు. ఎన్డీయే (NDA) పాలనలో పార్లమెంటు అసలు పని చేయడం లేదని, ప్రజాస్వామ్యం ఊపిరి తీసుకునే సత్తువలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని దాదాపు అన్ని వ్యవస్థలను మచ్చిక చేసుకోవడం, లొంగదీసుకోవడం, పాదాక్రాంతం చేసుకోవడం లేదా కబ్జా చేయడం జరిగిందన్నారు. 


పి చిదంబరం ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ (Congress) శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి తేదీని నిర్ణయించినపుడు తమ దృష్టిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శిలాన్యాసం జరిగిన తేదీ లేదని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతుంది కాబట్టి శుక్రవారం ఎంపీలందరూ ఢిల్లీలో ఉంటారనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఏం చేసినా ఏదో విధంగా మెలికపెట్టి నిందించవచ్చునని ఆరోపించారు. జమ్మూ-కశ్మీరును చట్టవిరుద్ధంగా 2019 ఆగస్టు 5న ముక్కలు చేశారని, అయితే చాలా గంభీరమైన సమస్య గురించి చర్చిస్తున్నాం కాబట్టి వీటిని పక్కనబెడదామని అన్నారు. 


ధరల పెరుగుదల, జీఎస్‌టీ పెంపు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఢిల్లీలో నిరసన తెలిపారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామాలయం (Ayodhya Ramalayam) నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ, బుజ్జగింపు రాజకీయాలు చేయడం కోసం నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నేషనల్ హెరాల్డ్ (National Herald) కేసులో ఈడీ ప్రశ్నలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 


ముందుగానే ప్రకటించాం

ఈ ఆరోపణలను చిదంబరం తిరస్కరించారు. ఆగస్ట్ ఐదున ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్‌ (Agnipath) పథకాలకు వ్యతిరేకంగా నిరసన చేపడతామని ముందుగానే ప్రకటించామని, అది తమకు తెలియదన్నట్లు నటిస్తే, తాము ఏం చేయగలమని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ప్రశ్నలను ఎదుర్కొంటున్న నేతలు తమను తాము కాపాడుకోగలరని, వారికి కాంగ్రెస్‌ పార్టీలోని అన్ని స్థాయులవారు మద్దతిస్తున్నారని చెప్పారు. 


అమెరికాలో అలా, ఇక్కడ ఇలా...

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)కు సమన్లు ఇచ్చిందని, ఆయనకు రక్షణ కల్పించడంలో రాజ్యసభ చైర్మన్ ఎం వేంకయ్య నాయుడు (M Venkaiah Naidu) విఫలమయ్యారని ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelocy) తైవాన్ పర్యటనకు ఆ దేశ ప్రభుత్వం గట్టి మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. అమెరికా కార్యనిర్వాహక శాఖ ఆ దేశ చట్ట సభల స్వయంప్రతిపత్తిని గౌరవించిందన్నారు. తైవాన్ సముద్ర తీరానికి అమెరికా విమాన వాహక యుద్ధ నౌకను పంపించిందన్నారు. గగనతలం నుంచి రక్షణ కల్పించిందని చెప్పారు. అయితే మన దేశంలో కార్యనిర్వాహక శాఖ రాజ్యసభలో ప్రతిపక్ష నేతను పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో పిలిచిందన్నారు. శాసన వ్యవస్థలోని ఇద్దరు అధిపతుల్లో ఒకరు (వేంకయ్య నాయుడు) నిస్సహాయతను వ్యక్తం చేశారన్నారు. ఇది ‘‘విచారకరమైన రోజు’’ అని చెప్పారు. 


ప్రతిపక్ష నేతల కోసమే ఈడీ అధికారాలు

ఈడీ అనేక మంది ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తోందని, దాని అధికారాలు, చట్టాలు కేవలం ప్రతిపక్ష సభ్యులపైనే కేంద్రీకృతమయ్యాయని ఆరోపించారు. వ్యవస్థలను లొంగదీసుకోవడం, మచ్చిక చేసుకోవడం, పాదాక్రాంతం చేసుకోవడం లేదా కబ్జా చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకోవడానికి కొట్టుమిట్టాడుతోందన్నారు. మేడిపండు వంటి ప్రజాస్వామ్యం ఉందని, దానిలోపల అంతా డొల్లేనని అన్నారు. ఇది దాదాపు అన్ని వ్యవస్థలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. 


ఇది బాధాకరం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తరచూ వాయిదాలు పడటంతో కార్యకలాపాలు సజావుగా జరగలేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేయడంతో పదే పదే వాయిదాలు పడ్డాయి. దీనిని చిదంబరం ప్రస్తావిస్తూ, పార్లమెంటు చేష్టలుడిగిందని, అసలు కార్యకలాపాలు జరగడం లేదనే బాధాకరమైన తుది నిర్ణయానికి వచ్చానని తెలిపారు. దీనికి ప్రధాన కారణం అధికార పక్షానికి చర్చలు, సంవాదాలు, సంభాషణలపై ఆసక్తి లేకపోవడమేనని వివరించారు. 


Updated Date - 2022-08-07T21:19:10+05:30 IST