తిరుపతికి ‘ప్రాణవాయువు’

ABN , First Publish Date - 2021-05-17T06:53:26+05:30 IST

కర్ణాటక నుంచి స్విమ్స్‌కు.. తమిళనాడు నుంచి రుయాస్పత్రికి ఆదివారం ఆక్సిజన్‌ ట్యాంకర్లు వచ్చాయి.

తిరుపతికి ‘ప్రాణవాయువు’
కర్ణాటక నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో వస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్లు

కర్ణాటక, తమిళనాడు నుంచి గ్రీన్‌ఛానెల్‌ ద్వారా ఆక్సిజన్‌ ట్యాంకర్ల రాక 


తిరుపతి(నేరవిభాగం), మే 16: కర్ణాటక నుంచి స్విమ్స్‌కు.. తమిళనాడు నుంచి రుయాస్పత్రికి ఆదివారం ఆక్సిజన్‌ ట్యాంకర్లు వచ్చాయి. జిల్లా సరిహద్దు నుంచి పోలీసులు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ఎక్కడా ట్రాఫిక్‌ సమస్య లేకుండా తీసుకొచ్చారు. స్విమ్స్‌ వైద్యశాలలో ఆక్సిజన్‌ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లాలోని ఎయిర్‌ వాటర్‌ ఫ్యాక్టరీ నుంచి 16 టన్నుల ట్యాంకర్‌ ఆదివారం మధ్యాహ్నం స్విమ్స్‌కు చేరుకుంది. ఎటువంటి ఆటంకాలు, ఆలస్యం లేకుండా ఈ ట్యాంకర్‌ను స్విమ్స్‌ చేర్చేందుకు జిల్లా సరిహద్దు నుంచి తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశారు. మార్గమధ్యంలో ఎటువంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసు ఎస్కార్ట్‌తో ఆక్సిజన్‌ను స్విమ్స్‌ ఆసుపత్రికి చేర్చారు. అలాగే, చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను కూడా గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా రుయాస్పత్రికి చేర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటఅప్పలనాయుడు మాట్లాడుతూ.. తిరుపతికి వచ్చే ఆక్సిజన్‌ ట్యాంకర్లకే కాకుండా ఇతర జిల్లాలకు వెళ్లే వాటికీ గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా ఆ ట్యాంకర్లకు మన జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా జిల్లా సరిహద్దు దాటిస్తామని వెల్లడించారు. 

Updated Date - 2021-05-17T06:53:26+05:30 IST