Abn logo
Apr 23 2021 @ 16:36PM

బెంగాల్ ఆక్సిజన్‌ను యూపీకి తరలిస్తున్నారు: మమత

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొవిడ్-19 కేసులతో విలవిల్లాడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌కి రావాల్సిన ఆక్సిజన్ సరఫరాను కేంద్రం యూపీకి తరలిస్తోందంటూ ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్‌లో ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘పశ్చిమ బెంగాల్లో గెలవడం కోసం బీజేపీ దేశవ్యప్తంగా కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేసింది. మాకు రావాల్సిన ఆక్సిజన్ సరఫరాను ఉత్తర ప్రదేశ్‌కు తరలించింది...’’ అని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏమాత్రం లేదనీ.. తమ రాష్ట్రంలో కేవలం మరో 20 వేల ఆక్సిజన్ సిలిండర్లు మాత్రమే ఉన్నాయని ఆమె అన్నారు. ‘‘మాకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? బెంగాల్లో పరిస్థితిని మరింత దిగజార్చేందుకు కేంద్ర ఉబలాటపడుతోంది...’’ అని మమత పేర్కొన్నారు. 


‘‘కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆక్సిజన్‌ను నిల్వచేసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో ఎప్పుడో చెప్పింది. మరి ఎందుకు ఆ మాట పెడచెవిన పెట్టారు?..’’ అని మమత ప్రశ్నించారు. దేశంలో ఓ వైపు కొవిడ్ మందులు లేక అల్లాడుతుంటే... మరోవైపు మన దేశం నుంచి ఇప్పటికీ ఎగుమతులు కొనసాగుతున్నాయి...’’ అని మమత దుయ్యబట్టారు. 

జాతీయంమరిన్ని...

Advertisement