వీరు ఆక్సిజన్‌ సిస్టర్స్‌!

ABN , First Publish Date - 2021-05-12T05:38:21+05:30 IST

రెండో విడత కొవిడ్‌ ఉద్ధృతిలో దేశమంతా ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతూ ఉంటే... ఆ మారుమూల గిరిజన జిల్లా ఇప్పటికే అయిదు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది...

వీరు ఆక్సిజన్‌ సిస్టర్స్‌!

రెండో విడత కొవిడ్‌ ఉద్ధృతిలో దేశమంతా ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతూ ఉంటే... ఆ మారుమూల గిరిజన జిల్లా ఇప్పటికే అయిదు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. అవసరమైన రోగులందరికీ ఆక్సిజన్‌ అందించి ప్రాణాలు నిలబెడుతోంది. దీని వెనుక వ్యూహకర్త ఆ జిల్లా కలెక్టర్‌ కాగా, సమర్థంగా అమలు చేస్తున్నవారు ఆక్సిజన్‌ సిస్టర్స్‌.


సంక్షోభం ఎదురైనప్పుడు భయపడకుండా... అందుబాటులో ఉన్న వనరులతో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని చాటి చెబుతోంది ఉత్తర మహారాష్ట్రలోని మారుమూల గిరిజన జిల్లా నందూర్‌బార్‌. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ రోగులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఈ విపత్కర సమయంలో... ముందుచూపుతో, చక్కటి ప్రణాళికతో ఆక్సిజన్‌ సమస్యను విజయవంతంగా ఆ జిల్లా అధిగమించింది. దీని వెనుక ప్రధాన యోధులు ఆక్సిజన్‌ సిస్టర్స్‌. ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ప్రతి ఇరవై పడకలకూ ఒక నర్సును బాధ్యురాలిగా నియమించారు. కరోనా బారిన పడి, ఆక్సిజన్‌ అవసరమైన రోగులు వీరి పర్యవేక్షణలో ఉంటారు. ఆక్సిజన్‌ సిస్టర్స్‌ నిబద్ధత, నైపుణ్యం కారణంగా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. మరోవైపు నిర్దేశిత చర్యలనూ, ప్రమాణాలనూ ఈ నర్సులు తూచా తప్పకుండా పాటిస్తూ, సంజీవని లాంటి ఆక్సిజన్‌ వృధా కాకుండా చూస్తున్నారు. 


నందూర్‌బార్‌ జిల్లా జనాభా పదహారున్నర లక్షలకు పైనే. వీరిలో డెబ్బై మంది షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారు. ఈ జిల్లాలో 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 290 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటిలో తగినంత మంది సిబ్బంది, సరైన భవనాలు, సిబ్బంది నివసించడానికి క్వార్టర్స్‌ లేవు. ‘‘కిందటి ఏడాది ఏప్రిల్‌ - మే నెలల మధ్య ఈ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటివరకూ కరోనా గురించి వింటూ వచ్చిన ప్రజల్లో భయాందోళనలు బాగా పెరిగిపోయాయి. ఎక్కువమంది ప్రజలు గిరిజనులే. వారిలో చాలామంది మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్ల గురించి కనీసం విననైనా లేదు. అంతేకాకుండా, మొదటి కేసులు వచ్చినప్పుడు, కొవిడ్‌ పరీక్షలు చేసే సౌకర్యాలేవీ ఇక్కడ లేవు’’ అని గుర్తు చేసుకున్నారు నందర్‌బార్‌ జిల్లా ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఒక మహిళ. జిల్లా సివిల్‌ ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నప్పటికీ, అవన్నీ దాదాపు ఎప్పుడూ నిండిపోయే ఉంటాయి. దాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చేస్తే సాధారణ రోగులంతా ఏమైపోవాలి? 


ఇలాంటి పరిస్థితుల్లో, కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొవడానికి కలెక్టర్‌ రాజేంద్ర భారుడ్‌ నడుంకట్టారు. నిరుపేద భిల్ల ఆదివాసీ కుటుంబానికి చెందిన రాజేంద్ర స్వయంగా వైద్యుడు. ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రతను ఆయన ముందే గ్రహించారు. మూడునెలల కాలంలో మరో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయించారు. జిల్లా మొత్తం మీద మరో 200 మంది వైద్యులనూ, నర్సులనూ నియమించారు. కరోనా రోగుల చికిత్స, సంరక్షణల్లో నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ప్రభుత్వం తరఫున ల్యాబరేటరీలు ఏర్పాటు చేయించి, రోజుకు సుమారు రెండువేల వరకూ ఆర్‌-టిపిసిఆర్‌ పరీక్షలు చేయించారు. అలాగే గ్రామాల్లో, వార్డుల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయడానికి 28 సంచార బృందాలను నియమించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఏడువేల ఐసోలేషన్‌ పడకలనూ, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారి కోసం 1,300 పడకలనూ ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఒక రోజు గరిష్టంగా ఈ జిల్లాలో నమోదైన కేసులు 190. ఈ ఏడాది ప్రారంభానికల్లా కేసులు తగ్గి, పరిస్థితి కుదుటపడిందని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే.. సెకెండ్‌ వేవ్‌ ముంచుకొచ్చింది. అయితే దానికి కూడా ఈ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగానే ఉంది.




కొవిడ్‌ వల్ల ఎక్కువ మరణాలు ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే జరుగుతున్నాయని కలెక్టర్‌ రాజేంద్ర గుర్తించారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లోనే జిల్లాలోని ఆసుపత్రుల్లో సొంత ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ జిల్లాలో అయిదు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉన్నాయి. మరో రెండు సిద్ధమవుతున్నాయి. నందూర్‌బార్‌ను ఆదర్శంగా తీసుకొని ఆక్సిజన్‌ ప్లాంట్లు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని మిగిలిన జిల్లాలకు మహారాష్ట్ర ప్రభుత్వం సూచనలిచ్చింది. అయితే, కలెక్టర్‌ రాజేంద్ర ప్రణాళికలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది మాత్రం నర్సులే. ‘‘రోగులకు ఎంత ఆక్సిజన్‌ అవసరమనేది గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతి రోగికీ ఒకే పరిమాణంలో ఆక్సిజన్‌ అవసరం ఉండదు. అలాగే రోజులో కొన్ని సమయాల్లో ఎక్కువ ఆక్సిజన్‌ కావలసి ఉంటుంది. మరి కొన్ని సార్లు తక్కువ అందిస్తే చాలు. సిలిండర్‌ మీట సాయంతో ఈ సర్దుబాట్లు చేసుకోవచ్చు’’ అంటున్నారు జిల్లా కేంద్రంలోని ఒక నర్స్‌. ‘‘అలాగే రోగి ఆహారం తీసుకుంటున్నప్పుడూ, స్నానాలకో, కాలకృత్యాలకో వెళ్ళినప్పుడూ సిలిండర్‌ మీట ఆఫ్‌ చేస్తే ఆక్సిజన్‌ వృఽథా కాదు. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. రోగులకు కూడా ముందే వివరిస్తున్నాం కాబట్టి వారూ ఎంతో సహకరిస్తున్నారు’’ అని చెబుతున్నారామె. 


రెండో విడత కరోనా తాకిడి ఈ జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఏప్రిల్‌లో ఒకే రోజు కేసులు 1,200కు పైగా పెరగడంతో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కలెక్టర్‌ రాజేంద్ర శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగం ద్వారా ఈ జిల్లాలో నిమిషానికి 1,800 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రైవేట్‌ సంస్థల ద్వారా మరో 1,200 లీటర్లు ఉత్పత్తి అవుతోంది. ఒక ప్లాంట్‌ ఏర్పాటుకు దాదాపు 85 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కేసులు పెరుగుతున్నప్పటికీ, ముందు జాగ్రత్తగా ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుతో సమస్య తీవ్రత తగ్గింది. ‘‘శ్రమతో వనరులు సమకూర్చుకున్నా వాటిని సరిగ్గా వాడుకోకపోతే అనుకున్న ఫలితాలు రావు. ఆక్సిజన్‌ వినియోగంలో మా సిస్టర్స్‌ తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగానే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొవిడ్‌ రోగులకు సన్నిహితంగా ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం భయపడకుండా నిబద్ధతతో పని చేస్తున్నారు. ‘‘మేము కుటుంబాలకు దూరంగా ఉన్నా... రోగులు కోలుకుంటే అదే మాకు సంతోషం’’ అని చెబుతున్నారు. వారి సేవలకు వెల కట్టలేం’’ అంటారు కలెక్టర్‌ రాజేంద్ర. ఆ నర్సుల అంకితభావం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.

(ఇంటర్నేషనల్‌ నర్సెస్‌ డే సందర్భంగా)

Updated Date - 2021-05-12T05:38:21+05:30 IST