హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ కోసం బారులు...

ABN , First Publish Date - 2021-04-23T13:26:24+05:30 IST

పెరుగుతున్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే బాధితులు

హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ కోసం బారులు...

హైదరాబాద్‌ సిటీ : పెరుగుతున్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా లభించకపోవడంతో ఆక్సిజన్‌ ఫిల్‌ చేసుకోవడంలోనూ సమస్యలు తప్పడం లేదు. సిలిండర్‌ ఉన్నా ఫిల్లింగ్‌ చేయడానికి సమయం పడుతుండడంతోపాటు డబ్బులు కూడా అధికంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల దృష్ట్యా భరించక తప్పడం లేదని.. ఇదే విషయమై ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ నిర్వాహకులను అడగ్గా.. వారు నిస్సహాయత ప్రకటిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. గతేడాది కరోనా తొలి వేవ్‌ విజృంభించినప్పుడు కూడా ఆక్సిజన్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, సెకండ్‌ వేవ్‌లో గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 శాతం ధరలు పెరిగాయి. ఆస్పత్రులలో ఆక్సిజన్‌ బెడ్‌లు నిండిపోవడం, డిమాండ్‌ విపరీతంగా పెరగడంతోపాటు హోం ఐసొలేషన్‌లోనూ ఉన్న అవసరం దృష్ట్యా ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.


సిలిండర్‌ ఆధారంగా ఫిల్లింగ్‌

ఆక్సిజన్‌ సిలిండర్లు వివిధ సైజులు. వాటికి అనుగుణంగా నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఆస్పత్రులలో వాడే సింలిండర్లలో ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం 3 నుంచి 50 లీటర్లకు పైగా ఉంటుంది. సిలిండర్‌ ధర రూ. 4 వేల నుంచి 15 వేల వరకు ఉంటుందని ఓ డీలర్‌ వివరించాడు. ప్రస్తుతం సరఫరాలో కొరత ఉన్నందున కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, వారి నుంచి డీలర్లకు చేరడంలో ధరలు పెరుగుతున్నాయని వివరించారు. తర్వాత వాటిలో ఆక్సిజన్‌ నింపడం మరో ప్రక్రియ. వాటిలో ఆక్సిజన్‌ నింపడానికి సిలిండర్‌ ఆధారంగా ఫిల్లింగ్‌ ఉంటుందని ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ నిర్వాహకుడు తెలిపాడు. సాధారణంగా ఫిల్లింగ్‌ చేయడానికి రూ. 150 నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటారని ఓ డీలర్‌ చెప్పాడు. 


కొన్ని సందర్భాల్లో ధరలు తగ్గుతుంటాయని.. మరికొన్ని సందర్భాల్లో పెరుగుతుంటాయని వివరించాడు. ప్రస్తుతం డిమాండ్‌ అధికంగా ఉన్నందున 24 గంటలు పనిచేయాల్సి వస్తోందని, ఎక్కువమంది పనిచేయాల్సి వస్తున్నప్పటికీ, ధరలు కనీస మార్జిన్‌తోనే విక్రయిస్తున్నట్లు ఆక్సిజన్‌ సరఫరా చేసే నిర్వాహకుడు ఒకరు తెలిపాడు. నగరంలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అవసరాలు అధికంగా ఉన్న దృష్ట్యా కొరత ఉన్నప్పటికీ ఆస్పత్రులకు సరఫరా చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు జల్‌పల్లి లోని గ్యాస్‌ఫిల్లింగ్‌ నిర్వాహకుడు తెలిపాడు.


సెల్ఫ్‌ ఫిల్లింగ్‌

ఆక్సిజన్‌ సిలిండర్ల స్థానంలో సెల్ఫ్‌ ఫిల్లింగ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర రూ. 50 వేల వరకు ఉంటుంది. ఇవి ఖరీదైన సిలిండర్లు అయినప్పటికీ ఫిల్లింగ్‌ అవకాశం లేకుండా ఆటోమేటిక్‌గా ఆక్సిజన్‌ తయారు చేసి రోగికి అందజేసే సౌకర్యం ఉటుంది. డబ్బు ఖర్చు చేసే స్థోమత ఉన్న వారు ఖరీదైన సిలిండర్లను వినియోగిస్తున్నప్పటికీ సగటు జీవి మాత్రం ఆక్సిజన్‌పైనే ఆధారపడుతున్నాడు.

Updated Date - 2021-04-23T13:26:24+05:30 IST