ఆక్సిజన్‌, మందులు సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2022-01-18T09:02:24+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితులకు వైద్యపరంగా ఉన్న అవసరాలను గుర్తించాలని,

ఆక్సిజన్‌, మందులు సిద్ధం చేయండి

  • 5 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
  • ఉధృతంగా టీకాలు: సీఎం
  • నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ బాధితులకు వైద్యపరంగా ఉన్న అవసరాలను గుర్తించాలని, ఆక్సిజన్‌, మందులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌ విస్తరణ పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 104 కాల్‌ సెంటర్‌ను మరింత పటిష్ఠంగా చేయాలని ఆదేశించారు. టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌ చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌లో ప్రికాషనరీ డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం సూచించారు. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ మందకొడిగా ఉన్న ఐదు (తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళం) జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్ల వారికి నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. మరో 5 జిల్లాల్లో 90 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని ఆదేశించారు.


కొత్త మెడికల్‌ కాలేజీలపై సమీక్ష..

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్‌, వార్డు క్లినిక్‌లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్‌గా క్లినిక్స్‌ వ్యవహరించాలని, వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై పూర్తి వివరాలతో సమాచారం లభించాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద  రిఫరల్‌ వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సమగ్రంగా సమీక్షించారు. 


Updated Date - 2022-01-18T09:02:24+05:30 IST