బ్లాక్‌ మార్కెట్‌కు ఆక్సిజన్‌ సిలిండర్లు

ABN , First Publish Date - 2020-07-13T10:37:18+05:30 IST

కరోనా కాలంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఆస్పత్రుల్లో వాటి వినియోగం బాగా పెరిగింది.

బ్లాక్‌ మార్కెట్‌కు ఆక్సిజన్‌ సిలిండర్లు

హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఆస్పత్రుల్లో వాటి వినియోగం బాగా పెరిగింది. దాన్నే అవకాశంగా మలుచుకుని కొందరు బ్లాక్‌ మార్కెట్‌ దందాకు తెరలేపారు. బ్లాక్‌లో సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌, చిలకలగూడ ప్రాంతానికి చెందిన షేక్‌ అక్బర్‌ (36) ముషీరాబాద్‌లో బాబా ట్రేడర్స్‌ పేరిట మెడికల్‌ పరికరాలు విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్ల వినియోగం విపరీతంగా పెరగడం అక్బర్‌ గుర్తించారు. వాటిని బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించి అక్రమంగా సంపాదించేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. దీనిలో భాగంగా నాచారంలోని బాబా గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు సర్దార్‌ఖాన్‌ను సంప్రదించి అతని నుంచి ఎలాంటి లైసెన్సు, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల అనుమతి లేకుండానే సిలిండర్లు కొనుగోలు చేసి తన గోడౌన్‌లో నిల్వ ఉంచాడు.


అవసరమున్న వారికి, ఇళ్లల్లో క్వారంటైన్‌లో ఉన్న వారికి అధికధరల్లో విక్రయించసాగాడు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముషీరాబాద్‌లోని అతని గోదాముపై ఆదివారం దాడులు నిర్వహించారు. అతన్ని అదుపులోకి తీసుకుని 50 కేజీల ఆక్సిజన్‌ సిలిండర్లు-16, 14 కేజీల ఆక్సిజన్‌ సిలిండర్లు-3, ఇతర గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని, స్వాధీనం చేసిన సామగ్రిని ముషీరాబాద్‌ పీఎ్‌సలో అప్పగించారు.

Updated Date - 2020-07-13T10:37:18+05:30 IST