ఆక్సిజన్‌ కేఫ్‌గా స్కూల్‌

ABN , First Publish Date - 2021-05-14T08:02:37+05:30 IST

అదో కేఫ్‌. అక్కడ కాఫీ, టీ, స్నాక్స్‌ గట్రా ఏమీ దొరకవు. ప్రాణవాయువు మాత్రమే లభిస్తుంది. ఆక్సిజన్‌ లెవల్స్‌ స్వల్పంగా తగ్గిన కరోనా రోగులు అక్కడికి వెళ్లొచ్చు....

ఆక్సిజన్‌ కేఫ్‌గా స్కూల్‌

ఢిల్లీలో ఓ ప్రైవేటు విద్యాసంస్థ యజమాని ఆదర్శం


న్యూఢిల్లీ, మే 13: అదో కేఫ్‌. అక్కడ కాఫీ, టీ, స్నాక్స్‌ గట్రా ఏమీ దొరకవు. ప్రాణవాయువు మాత్రమే లభిస్తుంది. ఆక్సిజన్‌ లెవల్స్‌ స్వల్పంగా తగ్గిన కరోనా రోగులు అక్కడికి వెళ్లొచ్చు. కొన్ని గంటలపాటు ఆక్సిజన్‌ పెట్టుకొని సాచ్యురేషన్‌ లెవల్స్‌ ఆరోగ్యకరమైన స్థాయికి చేరుకున్నాక ఇళ్లకు వెళ్లొచ్చు. ఒకవేళ ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ లెవల్స్‌ బాగా పడిపోయినా బెడ్ల కోసం ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరగాలో అనే ఆందోళన ఏమాత్రం అక్కర్లేదు. అలాంటివారికి అక్కడే ఉన్న కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స కూడా అందజేస్తారు. ఢిల్లీలో విలియమ్స్‌ అనే ఓ ప్రైవేటు స్కూల్‌ యజమాని, తన బడిని ఇలానే ‘ఆక్సిజన్‌ కేఫ్‌’గా మార్చేశారు. ‘మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌’ పేరుతో ఆయన విద్యాసంస్థను నడుపుతున్నారు. ఆయన తండ్రి విజయ్‌ విలియమ్స్‌ గత నెల కొవిడ్‌తో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


తండ్రి స్మారకార్థం బడిని ‘ఆక్సిజన్‌ కేఫ్‌’గా మార్చేశారు. అంతేనా.. ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ లెవల్స్‌ బాగా పడిపోయిన వారికి చికిత్సనందించేందుకు స్కూల్‌ పైఅంతస్తులోని 4 గదులను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చేశారు. ఇందుకు కావాల్సిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌, సిలిండర్స్‌ కావాల్సినన్ని అందుబాటులో ఉంచారు. ఈ తరహాలో స్కూళ్లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చేందుకుగాను క్రిస్టియన్‌ స్కూల్స్‌ యజమానులతో చర్చ లు జరుపుతున్నానని, వారి నుంచి సానుకూలత వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-05-14T08:02:37+05:30 IST