ఆక్సిజన్‌ బ్యాకప్‌ బాధ్యత మీదే

ABN , First Publish Date - 2021-05-16T06:23:09+05:30 IST

ఆక్సిజన్‌ బ్యాకప్‌ బాధ్యత ఆస్పత్రులదేనని, డిమాండును బట్టి 48 లేదా 72 గంటలు సరిపడా నిల్వ ఉంచుకోవాలని లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే లిండే ఇండియా కంపెనీ తిరుపతి రుయా ఆస్పత్రి అధికారులకు సూచించింది.

ఆక్సిజన్‌ బ్యాకప్‌ బాధ్యత మీదే

రుయాస్పత్రి అధికారులకు లిండే ఇండియా కంపెనీ లేఖ


తిరుపతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ బ్యాకప్‌ బాధ్యత ఆస్పత్రులదేనని, డిమాండును బట్టి 48 లేదా 72 గంటలు సరిపడా నిల్వ ఉంచుకోవాలని లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే లిండే ఇండియా కంపెనీ తిరుపతి రుయా ఆస్పత్రి అధికారులకు సూచించింది. రుయాలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి పలువురు చనిపోయిన నేపథ్యంలో లిండే కంపెనీ స్పందించింది.కొవిడ్‌ కారణంగా లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం విపరీతంగా పెరిగిందని, అందుకు తగ్గట్టు ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. రుయా ఆస్పత్రితో ఒప్పందం మేరకు ఆక్సిజన్‌ స్టోరేజీ ట్యాంకు, సంబంధిత పరికరాలను ఏర్పాటుచేశామని తెలిపింది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై ఓ లేఖ ద్వారా పలు సూచనలు చేసింది. 

బ్యాకప్‌, ఎమర్జెన్సీ మ్యానిఫోల్డ్‌ విధానం ఆక్సిజన్‌ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అత్యవసర పరిస్థితిలో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు బల్క్‌ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.వీటి నిర్వహణ ఆస్పత్రి పరిధిలోనే ఉంటుంది కాబట్టి పటిష్ఠంగా అమలుచేయాల్సి ఉంటుంది. 

ఆస్పత్రి అవసరాలను బట్టి 48 లేదా 72 గంటలు తగినంత బ్యాకప్‌ సిలిండర్‌ ద్వారా నిల్వ  ఉంచుకోవాలి

వాతావరణ ఆవిరికారకం ద్వారా ఏవీ కాయిల్‌పై మందపాటి మంచు ఏర్పడే అవకాశం ఉంది. మంచు ఏర్పడకుండా తగ్గించడానికి ఏవీ కాయిల్‌పై నిరంతరం నీటితో పిచికారి చేయాలి

ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు ఆక్సిజన్‌ సరఫరాకు ఆటోమేటిక్‌ స్విచ్‌ ఓవర్‌ ఉండేలా సిలిండర్‌ బ్యాంకును ఎల్లప్పుడూ ఆన్‌లైన్లో ఉంచాలి. 

బ్యాకప్‌ మానిఫోల్డ్‌ వ్యవస్థను తనిఖీ చేస్తుండాలి

ఎల్‌ఎంవో (లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌) అలారమ్‌ ప్యానల్‌ ఎల్లప్పుడూ స్విచ్‌ ఆన్‌ కండిషన్‌లో ఉండాలి. అలారం మోగినప్పుడు ఆస్పత్రి యంత్రాంగం అప్రమత్తం కావాలి.

మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థకు సంబంధించిన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆక్సిజన్‌ ఆపరేటర్‌ ఉండాలి. 

Updated Date - 2021-05-16T06:23:09+05:30 IST