బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డుపై లాక్కెళ్లిన ఘటనపై విచారణ..

ABN , First Publish Date - 2020-08-15T18:21:32+05:30 IST

రూరల్‌ మండలం మల్కాపూర్‌ (ఏ)గ్రామంలో బుధవారం జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన ‘బాలుడిపై దాష్టీకం!’ వార్తపై సుమోటోగా

బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డుపై లాక్కెళ్లిన ఘటనపై విచారణ..

‘బాలుడిపై దాష్టీకం!’పై విచారణ

హెచ్చార్సీ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్‌ 

గ్రామానికి చేరుకొని గుట్టుగా విచారణ చేపట్టిన అధికారుల బృందం


నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండలం మల్కాపూర్‌ (ఏ)గ్రామంలో బుధవారం జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన ‘బాలుడిపై దాష్టీకం!’ వార్తపై సుమోటోగా స్వీకరించి హెచ్చార్సీ కలెక్టర్‌ను నివేదిక కోరిన విషయం తెలిసిందే. కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశాలతో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ యోహాన్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ సలాం, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ చైతన్య, రూరల్‌ మండల రెవెన్యూ అధికారులతో కూడిన బృందం మల్కాపూర్‌ (ఏ) గ్రామానికి వెళ్లింది. గ్రామ పంచాయతీ కార్యాలయానికి బాలుడు, అతడి తల్లిదండ్రులు, దాడికి పాల్పడ్డ ముద్దంగుల బాలయ్యను పిలిపించారు. సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ దొంతు శాంత, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి కాళ్లు, చేతులు కట్టివేసి లాక్కెళ్లిన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనపై బాలుడిని ఆరా తీశారు. 


ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం బాలుడితోపాటు అతడి తల్లిదండ్రులను, దాడికిపాల్పడ్డ ముద్దంగుల బాలయ్యను వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. బాలుడు చెప్పిన వివరాలన్నీ అధికారులు వీడియో రికార్డు చేశారు. బాలుడి వయస్సుకు సంబంధించి కచ్చితమైన తేదీ లేకపోవంతో.. వయసు నిర్ధారణ చేయనున్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయానికి గ్రామస్థులను, కులసంఘానికి చెందిన పలువురిని పిలిచి ఘటనాపూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ విచారణ అంత కూడా అధి కారులు గుట్టుగా చేశారు. శుక్రవారం ఉదయమే అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ జరి పారు. ఈ అంశంపై మీడియాకు సమాచారం ఇవ్వ లేదు. విచారణ సమయంలో ఇతరులెవ్వరూ ఫొటోలు తీయకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో విచారణకు సంబంధించిన వివరాలు కూడా మీడియాకు వెల్లడించడానికి ఇష్టపడక పోవడం గమనార్హం.



Updated Date - 2020-08-15T18:21:32+05:30 IST