సిమెంటు ప్లాంటుకు ‘సొంత’ మిక్సింగ్‌!

ABN , First Publish Date - 2022-09-29T08:06:29+05:30 IST

సిమెంటు ప్లాంటుకు ‘సొంత’ మిక్సింగ్‌!

సిమెంటు ప్లాంటుకు ‘సొంత’ మిక్సింగ్‌!

తమ వల్లే ఫ్యాక్టరీ వచ్చినట్లుగా కలరింగ్‌

కర్నూలు జిల్లాలో సిమెంట్‌ హబ్‌కు చంద్రబాబు శ్రీకారం

2018లోనే రామ్‌కోకు వర్చువల్‌గా శంకుస్థాపన 

పనులూ ప్రారంభం.. 14 నెలల్లో నిర్మాణం లక్ష్యం

3.15 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ పరిశ్రమ

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మందగించిన పురోగతి

ఎట్టకేలకు రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ నిర్మాణం పూర్తి

ఇప్పుడు ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌

రామ్‌కోను సొంత ఖాతాలో వేసుకున్న జగన్‌


(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

‘2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే స్టార్ట్‌ కావడం, ఆ తర్వాత ఇప్పుడు కర్మాగారాన్ని ప్రారంభించడం వేగంగా జరిగాయి. ఇది గొప్ప మార్పునకు చిహ్నం. రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సకు... ఈ ఫ్యాక్టరీ ఇంత వేగంగా రావడమే నిదర్శనం. మనం ఇచ్చిన సపోర్ట్‌ వల్లే ఇది సాధ్యమైంది. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రతి అడుగులో సపోర్ట్‌ చేసినందునే వేగంగా జరిగింది!’


..నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా సీఎం జగన్‌ చెప్పిన మాటలివి!  తమ వల్లే ఈ ఫ్యాక్టరీ వచ్చిందన్నంత గొప్పగా... ఇదంతా తమ ఘనతే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అసలు విషయం ఏమిటంటే.... రామ్‌కో సిమెంట్‌ కర్మాగారానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబే అన్ని అనుమతులూ ఇచ్చారు. అవసరమైన భూమి కేటాయించారు. ఆయనే శంకుస్థాపన చేశారు.  పనులూ ప్రారంభించారు. ఇదంతా జరిగిన నాలుగేళ్లకు ఇప్పుడు... ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ ఆ కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అన్నీ తానే చేసినట్టుగా కలరింగ్‌ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమను ముఖ్యమంత్రి తమ ఖాతాలో వేసుకున్నారు.  


నాడు చంద్రబాబు ఆలోచన...

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నీరు, భూములు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగానే ఓర్వకల్లు కేంద్రంగా 33 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌, ఫార్మాసిటీ, నంద్యాల, నందికొట్కూరు కేంద్రంగా సీడ్‌ హబ్‌, కొలిమిగుండ్ల కేంద్రంగా సిమెంట్‌ పరిశ్రమల హబ్‌ ఏర్పాటుకు ఆనాడే బీజం చేశారు. కొలిమిగుండ్ల, కల్వటాల, కనకాద్రిపల్లె, మీర్జాపురం గ్రామాల మధ్య 5,600 ఎకరాల విస్తీర్ణంలో రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమ నిర్మాణానికి ఆ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో 3.15 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. తద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, మరో 1,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దేశంలోనే అతి పెద్ద ఐదు సిమెంట్‌ పరిశ్రమల్లో ఒకటైన రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ నిర్మాణానికి 2018 డిసెంబరు 14న చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 14 నెలల్లో అంటే 2020 ఫిబ్రవరి ఆఖరులోగా  నిర్మాణం పూర్తి చేయాలని రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ ఎండీ వెంకటరామరాజుకు అప్పట్లో చంద్రబాబు సూచించారు. భవిషత్తులో 8 మిలియన్‌ టన్నులకు విస్తరించాలన్నది ఆశయం. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పురోగతి మందగించింది. 14 నెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణం 4 ఏళ్ల 4 నాలుగు నెలలు పట్టింది. 


ఈ పరిశ్రమల సంగతేంటి..? 

చంద్రబాబు ప్రభుత్వంలో కొలిమిగుండ్ల సిమెంట్‌ హబ్‌ కేంద్రంగా కల్వటాల, నందిపాడు, కోటపాడు గ్రామాల్లో 4,600 ఎకరాల్లో ప్రిజం సిమెంట్‌ పరిశ్రమ, మరో 4,600 ఎకరాల్లో గ్రాసింగ్‌ సిమెంట్‌ పరిశ్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. సిమెంట్‌ ఉత్పత్తికి అవసరమైన లైమ్‌ స్టోన్‌ మైనింగ్‌ లీజు అనుమతులు మంజూరు చేశారు. ఈ ఫ్యాక్టరీల పనులు మొదలు కాలేదు. మూడున్నర ఏళ్లలో వీటి నిర్మాణానికి సీఎం జగన్‌ కానీ, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కానీ కృషి చేసిన దాఖలాలు లేవు. నిజంగా రాయలసీమ జిల్లాల్లో పారిశ్రామిక ప్రగతిపై వైసీపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల అనుమతులు పొందిన పరిశ్రమల ఏర్పాటుకు ఎందుకు చొరవ తీసుకోలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. 


పనులు ఎక్కడికక్కడ బంద్‌ 

నందికొట్కూరు మండలం తంగడంచ కేంద్రంగా అంతర్జాతీయ సీడ్‌ హబ్‌ ఏర్పాటుకు 2018లో నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ సీడ్‌ హబ్‌ కోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన 621 ఎకరాలు కేటాయించారు. మౌలిక వసతులకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. అయితే, 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సీడ్‌ హబ్‌ రద్దు చేశారు. భూములను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు తిరిగి అప్పగించారు. అలాగే నందికొట్కూరు మండలంలో జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు చంద్రబాబు 620 ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేశారు. షెడ్లు, కాలువల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. జగన్‌ వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జగన్‌ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు కూడా ఎవరూ మందుకురాలేదు. బుధవారం జరిగిన సభలో జగన్‌ ‘గ్రీన్‌కో’ గురించి కూడా గొప్పగా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంలో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌ కోసం 33 వేల ఎకరాలు కేటాయించింది. టీడీపీ హయాంలోనే ‘గ్రీన్‌ కో’ వచ్చింది. జగన్‌ సీఎం అయ్యాక అక్కడ కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. చంద్రబాబు హయాంలోనే పనులు మొదలుపెట్టిన గ్రీన్‌కో ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను ఈ ఏడాది మేలో జగన్‌ ప్రారంభించారు.


Updated Date - 2022-09-29T08:06:29+05:30 IST