జెడ్ కేటగిరీ వద్దు, నిందితులపై ఉపా కేసు పెట్టరెందుకు? ఓవైసీ

ABN , First Publish Date - 2022-02-05T01:13:03+05:30 IST

డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విస్మరించి చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ఆ వ్యక్తులు ఎవరో తెలియాలి. వారిపై ఎందుకు ఇంకా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయలేదు. ఎవరైనా క్రికెట్ మ్యాచ్‌పై స్పందిస్తే ఉపా చట్టం కింద కేసు నమోదు చేస్తారు. మరి విధ్వేష ప్రసంగాలు చేసే వారిపై ఎందుకు ఉపా చట్టం మోపరు?..

జెడ్ కేటగిరీ వద్దు, నిందితులపై ఉపా కేసు పెట్టరెందుకు? ఓవైసీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై గురువారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఓవైసీకి ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించింది. అయితే తనకు కేటాయించిన జెడ్ కేటగిరీ భద్రత తిరస్కరించిన ఓవైసీ నిందితులపై ఉపా చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘బ్యాలెట్‌తో కాకుండా బుల్లెట్ మాత్రమే పరిష్కారం అనుకునే ఆ ఇద్దరు ఎవరనేది నా ప్రశ్న? డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విస్మరించి చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ఆ వ్యక్తులు ఎవరో తెలియాలి. వారిపై ఎందుకు ఇంకా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయలేదు. ఎవరైనా క్రికెట్ మ్యాచ్‌పై స్పందిస్తే ఉపా చట్టం కింద కేసు నమోదు చేస్తారు. మరి విధ్వేష ప్రసంగాలు చేసే వారిపై ఎందుకు ఉపా చట్టం మోపరు?’’ అని ఓవైసీ ప్రశ్నించారు.


గురువారం అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రయాణంలో ఉన్న ఓవైసీ కాన్వాయ్‌పై ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్వయంగా ఓవైసీనే వెల్లడించారు. తన కారు పంక్చర్ అయిందని, తాను వేరే కారులో వెళ్లానని తెలిపారు. అయితే దాడికి పాల్పడ్డ వారు ఎవరనేది తెలియలేదు. ఓవైసీ సైతం ఎవరిపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించలేదు.


‘‘కొద్ది సమయం క్రితం ఛిజారసీ టోల్ గేట్ వద్ద నేను ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరమే అక్కడి నుంచి పారిపోయారు. నా కారు పంక్చర్ అయింది. అనంతరం నేను వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం’’ అని దాడి అనంతరం ఓవైసీ ట్వీట్ చేశారు. కాగా ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓవైసీపై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయనను వెంటాడారని.. సభలు, ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు ఓవైసీపై దాడి చేశారని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-02-05T01:13:03+05:30 IST