వంచన, ద్వంద్వ ప్రమాణాల ఎస్పీ, కాంగ్రెస్: ఒవైసీ

ABN , First Publish Date - 2022-01-30T01:21:45+05:30 IST

అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు దొందూ దొందేనని, ముస్లింల ఓట్లు కావాలి కానీ, వాళ్లకి టిక్కెట్లు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావని..

వంచన, ద్వంద్వ ప్రమాణాల ఎస్పీ, కాంగ్రెస్: ఒవైసీ

లక్నో: అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు దొందూ దొందేనని, ముస్లింల ఓట్లు కావాలి కానీ, వాళ్లకి టిక్కెట్లు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీలో మైనారిటీల ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలను ఒవైసీ తోసిపుచ్చారు. సెక్యులర్ పీపుల్ అని చెప్పుకునే పార్టీలు ముస్లింలను చాపకిందే తొక్కిపెడుతూ, జిందాబాద్ నినాదాలకే పరిమితం చేస్తున్నాయని, టిక్కెట్లు కావాలిస్తే అడుక్కోవాల్సి వస్తోందని అన్నారు. ఇది ఆ పార్టీల నయవంచన, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ పేర్కొన్నారు.


సహరాన్‌పూర్‌లో ముస్లిం నేత ఇమ్రాన్ మసూద్‌తో ఫోటోలు దిగి ఆ తర్వాత ఆయనను వంచించలేదా? అని సమాజ్‌వాదీ పార్టీని నిలదీశారు. వివాదాస్పద నేత టీఆర్ ఖాన్‌ను వాళ్లు (ప్రియాంకగాంధీ) దూరంగా పెట్టలేదా అని ప్రశ్నించారు. బదౌన్ ఎంపీ (సంఘమిత్ర మౌర్య) ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నారని, ఆమె తండ్రి మౌర్య సాహెబ్ సమాద్‌వాదీ పార్టీలో ఉన్నారని, ప్రజలు ఇవన్నీ గ్రహించడం లేదా అని ఒవైసీ ప్రశ్నించారు. ముజఫర్‌నగర్‌ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా సమాజ్‌వాదీ పార్టీ సీటు ఇవ్వలేదని అన్నారు.


బీజేపీకి బీ-టీమ్..!

బీజేపీకి బీ-టీమ్‌ అంటూ ఎంఐఎంపై కొందరు చేస్తున్న ఆరోపణలపై ఒవైసీ సూటిగా స్పందించారు. ''మోదీ మా ఇంట్లో పెళ్లికి వచ్చారా? 2019లో పార్లమెంటులో బాసటగా నిలిచి, మోదీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చింది నేనా?'' అని పరోక్షంగా అఖిలేష్ యాదవ్ కుటుంబాన్ని ఉద్దేశించి ఒవైసీ ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో తాము బాబు సింగ్ కుష్వాహ, బాబు సింగ్ మన్ మెష్రం, తదితరులతో కలిసి పొత్తు పెట్టుకున్నామని, తాము గెలిస్తే బాబు సింగ్ కుష్వాహ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో రెండున్నరేళ్లు దళిత వర్గానికి చెందిన నేత సీఎంగా ఉంటారని చెప్పారు. ప్రభుత్వంలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, వారిలో ఒకరు ముస్లిం వర్గానికి, ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు ఉంటారని చెప్పారు. యూపీ ప్రజలు తమను ఎన్నుకుంటారనే గట్టి నమ్మకం ఉందని చెప్పారు. యూపీలోని 19 శాతం ముస్లిం జనాభాకు తగిన ప్రాధాన్యం ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.


''ప్రధాని బీసీలకు చెందిన పెద్ద నేతని వారు చెబుతారు. యోగిని ఠాకూర్ల లీడర్ అంటారు. యాదవుల నేత అఖిలేష్. అనుప్రియ పటేల్‌ను కూర్మీ నేతగా చెబుతారు. యూపీలోని వాస్తవ రాజకీయాలివి. ప్రతి వర్గానికి ఓ నేత ఉన్నాయి. రాజకీయ సాధికారత కనిపిస్తుంది. ఎలాంటి కమ్యూనిటీ లేని వారిని ఉద్దేశించే మేము మా కూటమిని ఏర్పాటు చేశాం'' అని ఒవైసీ తెలిపారు.

Updated Date - 2022-01-30T01:21:45+05:30 IST