సమస్యలు అధిగమించేనా?

ABN , First Publish Date - 2022-05-27T05:08:57+05:30 IST

నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్‌ 3వ తేదీ నుంచి

సమస్యలు అధిగమించేనా?

  • జూన్‌ 3 నుంచి పట్టణ ప్రగతికి సన్నాహాలు 
  • ఈసారి 5 అంశాలకు ప్రాధాన్యం
  • వార్డుల వారీగా హరిత ప్రణాళిక 
  • అక్టోబర్‌ నాటికి వైకుంఠధామాల నిర్మాణం పూర్తి
  • వైకుంఠధామాలకు మిషన్‌ భగీరథ నీరు 
  • అన్నిచోట్లా సమీకృత మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు


నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్‌ 3వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా అయిదు అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, మే 26) : గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పురపాలికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో నాలుగో విడతలో నిర్వహించే పట్టణ ప్రగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణ సమస్యలను గుర్తించి వీలైనంత త్వరగా వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. పురపాలిక అధికారులతోపాటు పురపాలికసంఘాల్లోని పాలకవర్గాలు 15 రోజులపాటు జరిగే పట్టణ ప్రగతిలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పురపాలిక బడ్జెట్‌లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించాలని, ఈ మొత్తాన్ని పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టాలని ఆదేశించింది. ప్రతి కాలనీ, వీధుల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పట్టణ ప్రగతి కోసం వార్డుకో ప్రత్యేకాధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలాఉంటే జూన్‌ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల మంత్రి సబితారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో కమిషనర్లు, మేయర్లు, చైర్మన్లు, కీలక పాత్ర పోషించడంతోపాటు ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, గతేడాది వర్షాకాలంలో సమస్యలు ఎదురైనందున ఈసారి ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్‌ నాటికి వైకుంఠధామాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను పూర్తిచేయడంతోపాటు ప్రస్తుత కార్యాచరణ రూపొందించుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు. 


నాలుగో విడతలో వీటికి ప్రాధాన్యం

ఇదిలాఉంటే ఈసారి పట్టణ ప్రగతిలో అయిదు అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. హరితహారం, సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, సామూహిక మరుగుదొడ్లు, పరమ పదవాహనాల ఏర్పాటుపై దృష్టికేంద్రీకరిస్తున్నారు. పురపాలికల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. ఇందుకోసం పురపాలికల బడ్జెట్‌లో పదిశాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయించి, దీన్ని పూర్తిగా ఖర్చుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే పట్టణాల్లో వార్డుల వారీగా హరిత ప్రణాళిక రూపొందిస్తున్నారు. వార్డుల్లో సాధ్యమైనంత వరకు నర్సరీలు ఏర్పాటు చేయడమే కాకుండా బృహత్‌ పట్టణ ప్రకృతి వనాల పెంపునకు అవసరమైన స్థలాలు గుర్తించనున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో, వీధుల్లో ఎంపిక చేసిన చోట్ల మొక్కలు నాటాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రతిపాదించిన వైకుంఠధామాలను సత్వరమే పూర్తి చేయనున్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా వైకుంఠధామాలకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ పనులను పట్టణాభివృద్ధిశాఖ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో చేపట్టి నీటి సరఫరా పైపులైన్లు పూర్తి చేయాలని సర్కార్‌ ఆదేశించింది. ఈ పైపులైన్ల అనంతరం రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. గతంలో ప్రతిపాదించిన క్రీడాప్రాంగణాలు వెంటనే పూర్తిచేయడమే కాకుండా  కొత్తగా ప్రత్యేక ఆటస్థలాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. ఖాళీ ఆట స్థలాలను శుభ్రం చేయించి, వార్డు స్థాయి క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి క్రీడలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమైన సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్తగా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు గతంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటారు. పట్టణాల్లో చనిపోయిన వారి పార్థీవదేహాలను వైకుంఠధామాలకు తరలించేందుకు పురపాలిక సంఘాల తరపున పరమపద వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. అవసరాల మేరకు వీటిని కొనుగోలు చేసి స్థానిక పట్టణ ప్రాంతంలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు పంపేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. వీటి నిర్వహణకు సిబ్బందిని కూడా నియమించనున్నారు. 


స్థితిగతులు మారేనా?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నాలుగో విడత వచ్చే నెలలో జరగనుంది. పట్టణ స్థితిగతులు మార్చాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కింద గతంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని అంశాలకు సంబంధించి మంచి ఫలితాలే వచ్చాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. లక్ష్యానికి అనుగుణంగా అంచనాలు రూపొందించినా కార్యరూపం దాల్చడం లేదు. ముఖ్యంగా పారిశుధ్య పనుల విషయంలో గతంలో సిబ్బంది కొరత ఉండేది. ఇటీవల ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సిబ్బందిని తీసుకున్నారు. నాలుగో విడతలో చేపట్టే పనులకు ఈ సిబ్బంది సరిపోతారా? లేక ఇంకా అదనంగా అవసరమవుతారా? అనేది వేచి చూడాలి. పనుల సంఖ్యను బట్టి సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సి ఉం టుంది. గతంలో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు,  వైకుంఠధామాల నిర్మాణాలు అనేకచోట్ల ఇంకా పూర్తికాలేదు. నాలుగో విడతలో వీటిపై శ్రద్ధపెడితే సత్వరమే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వీటికి తోడు ప్రభుత్వం కూడా నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-05-27T05:08:57+05:30 IST