వెయ్యి ఎకరాలకు పైగా విక్రయం!

ABN , First Publish Date - 2021-06-23T09:11:26+05:30 IST

వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

వెయ్యి ఎకరాలకు పైగా విక్రయం!

  • రంగం సిద్ధం చేసిన రాష్ట ప్రభుత్వం
  • వివాదాల్లేని భూముల గుర్తింపు
  • కలెక్టర్ల ఆధ్యర్యంలో వేగంగా ప్రక్రియ


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. మరోపక్క మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని వనరు ల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం కూడా భూ విక్రయ ప్రక్రియను పరిశీలిస్తోంది. ఎలాంటి వివాదాల్లేని, బహుళ ప్రయోజనకారిగా ఉండే భూములను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాల్లోని కలెక్టర్లు ఇలాంటి భూములను గుర్తించే చర్య లు చేపట్టారు. అయితే, ప్రజా ప్రయోజనార్థం తక్షణమే వినియోగించాల్సిన భూమిని అమ్మకానికి పెట్టరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దృష్ట్యా పట్టణాలు, జిల్లా కేంద్రాలకు సమీపాన ఉన్న బహుళ ప్రయోజనకారి భూములను గుర్తించాలంటూ ప్రభుత్వం.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా రెవెన్యూ అధికారులు తమ కలెక్టర్లకు భూ వివరాలను సమర్పిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి వనరుల సమీకరణ ఉప సంఘానికి అందించనున్నారు. అయితే, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని భూములకే ఎక్కువ ధరలు పలకనున్నాయి. అందుకే ఈ రెండు జిల్లాల భూములపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో పన్నేతర రాబడి కింద రూ.30,557.35 కోట్లను ప్రభుత్వం అంచనా వేసింది. ఎంత లేదన్నా రూ.20 వేల కోట్లను భూ అమ్మకాల ద్వారా సాధించాలన్నది ప్రభుత్వ ప్రాథమిక అంచనా. అందుకే భూ విక్రయ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. 


ఎంఎస్‌టీసీ ద్వారా విక్రయాలు 

భూముల విక్రయానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  ‘మెటల్‌ స్ర్కాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌(ఎంఎస్‌టీసీ) లిమిటెడ్‌’ను రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు ప్రొవైడర్‌గా నియమించుకుంది. దీని దీనదీద్వారా ‘ఈ-ఆక్షన్‌ కమ్‌ ఈ-టెండర్‌’ విధానంలో   అమ్మాలని నిర్ణయించింది. ఎంఎస్‌టీసీ ద్వారా విక్రయిస్తే... జాతీయ, ప్రపంచ స్థాయి సంస్థలు కూడా వేలంలో పాల్గొంటాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్‌ భూ విక్రయ బాధ్యతలను ఎంఎస్‌టీసీకి అప్పగించింది. ఈ రెండు ప్రాంతాల్లోని 65 ఎకరాలకు రూ.రెండు వేల కోట్ల వరకు వస్తాయని భావిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 50 ఎకరాలు, టీఎస్‌ఐఐసీ ఆధీనంలో ఉన్న 15 ఎకరాల అమ్మకానికి జూలై 15, 16 తేదీల్లో ఈ-ఆక్షన్‌ నిర్వహించనున్నారు. కోకాపేటలో  హెచ్‌ఎండీఏకు చెందిన 50 ఎకరాలను 8 ప్లాట్లుగా, టీఎస్‌ఐఐసీకి చెందిన ఖానామెట్‌లోని 15 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి ఎకరానికి రూ.25 కోట్లు ప్రతిపాదిత ధర (అప్‌సెట్‌ ప్రైస్‌)ను నిర్ణయించింది. అయితే, ఎకరానికి రూ.40 కోట్ల వరకు వస్తాయని భావిస్తోంది.

Updated Date - 2021-06-23T09:11:26+05:30 IST