భయం‘కరోనా’

ABN , First Publish Date - 2020-04-03T09:14:46+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యు విలయం సృష్టిస్తోంది. ఓవైపు రోజురోజుకు వేల కొద్దీ కేసులు నమోదవుతుంటే.. వందలకొద్దీ ప్రజలు వైర్‌సతో మరణిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే 950 మందిపైగా చనిపోవడంతో...

భయం‘కరోనా’

  • అగ్రరాజ్యం అమెరికాలో విరుచుకుపడుతున్న వైరస్‌
  • 5 వేలు దాటిన మృతుల సంఖ్య
  • ఒక్క రోజు వ్యవధిలో 900 మందిపైగా బలి!
  • ప్రజల ఉపాధికి భారీగా గండి
  • నిరుద్యోగ భృతికి 10 లక్షల మంది దరఖాస్తు


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 2: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యు విలయం సృష్టిస్తోంది. ఓవైపు రోజురోజుకు వేల కొద్దీ కేసులు నమోదవుతుంటే.. వందలకొద్దీ ప్రజలు వైర్‌సతో మరణిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే 950 మందిపైగా చనిపోవడంతో.. గురువారంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 5 వేలు దాటింది. ఇటలీ, స్పెయిన్‌ తర్వాత 5 వేల మంది చనిపోయిన దేశం అమెరికానే. మార్చి నెల సెలవులను బీచ్‌లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆస్వాదించిన ప్రజల్లో క్రమంగా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. మెక్సికో వెళ్లొచ్చిన టెక్సాస్‌ వర్సిటీ విద్యార్థులు 44 మంది ఇలానే వైరస్‌ బారినపడ్డారు. మరోవైపు కరోనా కారణంగా లక్షల మంది ఉపాధి గల్లంతవుతోంది. వీరంతా అసంఘటిత రంగంలోని వారే. కనీసం ఇంటి అద్దెలు కట్టలేని స్థితిలో వీధిన పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి కోసం ఇప్పటికే 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారంటేనే అమెరికాలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలో రోగులు పెరుగుతున్నా.. అందుకు తగ్గ వైద్య సామగ్రి లభించడం లేదు. వైరస్‌ నుంచి కాపాడటంలో కనీస అవసరమైన మాస్కులే కాదు.. ప్రాణాలు నిలిపే వెంటిలేటర్లకూ తీవ్ర కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థించారు.


కరోనాతో కనెక్టికట్‌లో ఆరు వారాల వయసున్న శిశువు మృతి చెందింది. అమెరికాలో వైర్‌సతో చనిపోయిన వారిలో అతి పిన్న వయసు ఈ శిశువుదే. కరోనా తీవ్రంగా ఉన్న న్యూయార్క్‌లో 16 వేల మంది వరకు చనిపోవచ్చని రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ ఖుమో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిక్కే ఇక్కడ 1500 మంది వరకు మరణించారు. కరోనాను చైనీస్‌ వైర్‌సగా అభివర్ణించిన ట్రంప్‌.. తాజాగా చైనాలో మరణాల సంఖ్య, కేసులపై అనుమానం వ్యక్తం చేశారు. చైనా వాస్తవాలు దాస్తోందని మండిపడ్డారు. దక్షిణ అమెరికా దేశాలన్నీ నిరాకరించినప్పటికీ నెదర్లాండ్స్‌కు చెందిన నౌకను ఫ్లోరిడా తీరంలో నిలిపేందుకు ఆయన అనుమతిచ్చారు. భారత్‌లో లాక్‌ డౌన్‌తో చిక్కుకున్న అమెరికన్లను తిరిగి పంపే ప్రయత్నాలు మొదలయ్యాయి. విమాన వాహక యుద్ధనౌక రూజ్‌వెల్ట్‌లో వంద మంది నావికులకు కరోనా వైరస్‌ సోకడంతో అనుమానంతో మూడు వేల మందిని దించేశారు. నౌకలో మొత్తం 5000 మంది నావికులు ఉన్నారు. హ్యూస్టన్‌లో ముగ్గురు భారతీయ అమెరికన్లు కొవిడ్‌ బారినపడ్డారు. వీరిలో ఓ వైద్యుడు కూడా ఉన్నారు. 


Updated Date - 2020-04-03T09:14:46+05:30 IST