హనీమూన్‌ కోసం బాలీ వెళ్లిన కొత్త జంట.. ఇంతలో ఇలా!

ABN , First Publish Date - 2020-03-30T20:59:26+05:30 IST

ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా

హనీమూన్‌ కోసం బాలీ వెళ్లిన కొత్త జంట.. ఇంతలో ఇలా!

చెన్నై: ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా 21రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. విమాన సర్వీసులపై కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో తమిళనాడుకు చెందిన 400 మంది ప్రజలు ఇండోనేషియాలో చిక్కుకున్నారు. ప్రస్తుతం వారంతా దిక్కుతోచని స్థితిలో.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఎం.కే స్టాలిన్‌కు లేఖ రాశారు. ‘భారత్‌లో కంటే ఇండోనేషియాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇక్కడి ప్రభుత్వం ఇంకా లాక్‌డౌన్ విధించలేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భయాందోళనలకు గురవుతున్నాం. విమాన రాకపోకలను భారత ప్రభుత్వం రద్దు చేసిందన్న విషయం తెలుసు. కానీ.. మేమంతా ఇండియాకు రావాలనుకుంటున్నాం. మాకు సహాయం చేయండి’ అని లేఖలో పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. హాలిడేస్ ఎంజాయ్‌ చేయడానికి వెళ్లిన దాదాపు 100 మంది భారతీయులు బాలీలో చిక్కుకున్నారు. ఈ వంద మందిలో కొత్తగా పెళ్లై.. హనీమూన్  కోసం వెళ్లిన నవ దంపతులు కూడా ఉన్నారు. చెన్నైకి చెందిన శేషసాయి.. టొరెంటోలోని ఓ సంస్థలో అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. మార్చి 11న హైదరాబాద్‌లో వివాహం చేసుకుని.. హనీమూన్ కోసం ఈ నెల 17న బాలీ వెళ్లాడు. మార్చి 23న తిరుగు పయనం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ నెల 20 నుంచి విమాన రాకపోకలు రద్దవ్వడంతో.. ఆ నవ దంపతులు బాలీలో చిక్కుకున్నారు. భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. అన్ని రోజులపాటు అక్కడ ఉండటానికి సరిపడ డబ్బు తమ వద్ద లేదని, దయచేసి తమను ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. కాగా.. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 1200 కరోనా కేసులు నమోదవ్వగా.. 114 మంది మరణించారు. 


Updated Date - 2020-03-30T20:59:26+05:30 IST