వందే భారత్ మిషన్: న్యూయార్క్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు..

ABN , First Publish Date - 2020-05-27T02:16:56+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా న్యూయార్క్ నుంచి 329 మంది భారతీయులు

వందే భారత్ మిషన్: న్యూయార్క్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు..

న్యూయార్క్: వందే భారత్ మిషన్‌లో భాగంగా న్యూయార్క్ నుంచి 329 మంది భారతీయులు సోమవారం బెంగళూరుకు చేరుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత పూర్తి కాగా.. రెండో విడతలో మరింత మంది భారతీయులు  తీసుకొస్తున్నారు. మే 19 నుంచి 29 వరకు అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి భారత్‌కు విమానాలు రానున్నాయి. ఇప్పటివరకు మూడు విమానాలు రాగా.. నాలుగో విమానం మే 25న న్యూయార్క్ నుంచి బెంగళూరుకు చేరుకుంది. రెండో విడతలో భాగంగా రెండు విమానాలు న్యూయార్క్ నుంచి ఢిల్లీ, చండీఘడ్, బెంగళూరుకు నడపనున్నట్టు గతంలో కేంద్రం చెప్పింది. అదే విధంగా మరో రెండు విమానాలు శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు, హైదరాబాద్, కొచ్చీ, అహ్మదాబాద్‌కు నడపనున్నట్టు తెలిపింది. ఈ రెండు విమానాల్లో అత్యధికంగా తెలుగు వారు ఉండే అవకాశముంది. ఇక ఒక విమానం వాషింగ్టన్ నుంచి బెంగళూరు, అహ్మదాబాద్.. మరో రెండు విమానాలు చికాగో నుంచి న్యూఢిల్లీకి చేరుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కాగా.. ఈ విమానాల ద్వారా భారత్‌కు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉండటంతో.. అమెరికాలో చిక్కుకుపోయిన విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భవతులకు, వీసా సమస్యలతో ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వందే భారత్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మే 7న ప్రారంభించింది. మొదటి విడతలో గల్ఫ్, అమెరికా, యూకే, ఫిలప్పీన్స్, బంగ్లాదేశ్, మలేషియా, మాల్దీవుల నుంచి మొత్తంగా 6,527 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.

Updated Date - 2020-05-27T02:16:56+05:30 IST