లాక్‌డౌన్‌పై నిరసన గళం.. 250 మంది అరెస్ట్!

ABN , First Publish Date - 2021-08-22T19:02:09+05:30 IST

మహమ్మారి కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కారు. భారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు నిరసనకారుల ఆందోళనలతో హోరెత్తాయి.

లాక్‌డౌన్‌పై నిరసన గళం.. 250 మంది అరెస్ట్!

సిడ్నీ: మహమ్మారి కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కారు. భారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు నిరసనకారుల ఆందోళనలతో హోరెత్తాయి. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో సుమారు 250 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. నిరసనకారుల ఘర్షణలో ఏడుగురు పోలీస్ అధికారులు గాయపడినట్లు సమాచారం. కాగా, మెల్‌బోర్న్‌లో జరిగిన ఆందోళన పూర్తి హింసాత్మకంగా మారింది. సుమారు 4వేల మంది నిరసనకారుల్లో చాలా మంది ముఖానికి మాస్కులు ధరించకుండా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 218 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 200కు పైగా మందికి తలో 5400 ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ. 2.86లక్షలు) జరిమానాలు విధించారు.


ఇక సిడ్నీలో 2 నెలలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంటే.. ఈ నెల ప్రారంభంలో మెల్‌బోర్న్‌తో పాటు దేశ రాజధాని కాన్‌బెర్రాలోనూ లాక్‌డౌన్ వేశారు. ఈ ఆంక్షల నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో ఎవరినైనా కలవడం వంటివి కుదరడం లేదు. దాంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించాలని నిరసనకారులు ఆందోళన బాటపట్టారు. అయితే, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇలా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని, వారి శ్రేయస్సు కోసమే తాము తాపత్రాయపడుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.  

Updated Date - 2021-08-22T19:02:09+05:30 IST