ఇది న్యాయమా?

ABN , First Publish Date - 2020-07-06T09:37:39+05:30 IST

‘సీఎం జగనన్నకి! మేమందరం విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌గా ..

ఇది న్యాయమా?

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ‘సీఎం జగనన్నకి! మేమందరం విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాం. ప్రస్తుత ఈవో దేవస్థానంలో పని చేస్తున్న 60 మందికి జాబ్‌ లేకుండా చేశారు. మేమందరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారం.’ - ట్విట్టర్‌ ద్వారా ముఖ్యమంత్రికి దుర్గగుడి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల గోడు


దుర్గగుడిలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ కాలంలో ఈవో సురేష్‌బాబు తమను నిలిపివేశారని, లాక్‌డౌన్‌ సడలించిన తరువాత తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని అడిగితే స్పందించడం లేదని వీరంతా వాపోతున్నారు. దీంతో సీఎంకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు ట్విటర్‌ను ఆశ్రయిం చారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేనందున ఇలా అయినా తమ సమస్య సీఎం దృష్టికి వెళుతుందన్న ఆశతో ఉన్నారు. తమను తొలగించడం అన్యాయ మంటూ రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న ఈ ఉద్యోగులు ఆదివారం నేరుగా ఈవో సురేష్‌బాబును కలిశారు. అయితే ఈవో తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని వీరు వాపోతున్నారు. 


లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలపాటు  ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. అదే  సమయంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ అధికారులు నిలిపివేశారు. నిబంధనలను సడలించిన తర్వాత గత నెల 10వ తేదీ నుంచి కనకదుర్గమ్మ దర్శనాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఈవోను కలిసి విన్నవించుకున్నారు. అయితే ఈవో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అవసరం లేదంటున్నారని వారు వాపోతున్నారు.


మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించి, తమ కుటుంబాలను రోడ్డున పడేయడం అన్యాయమంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవస్థానం తమకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, తమను ఉద్యోగాల నుంచి తొలగించడానికి కారణాలేంటో చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పదేళ్లుగా అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న తమను విధుల నుంచి తొలగించి దేవస్థానం అధికారుల బంధువులను, కావలసినవారిని కొత్తగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనే నియమించుకున్నారని ఆరోపించారు. 


దుర్గగుడి ఈవో తమను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది హెచ్చరించారు. 

Updated Date - 2020-07-06T09:37:39+05:30 IST