‘ఆప్కాస్‌’తో అవుట్‌ సోర్సింగ్‌

ABN , First Publish Date - 2020-07-04T11:11:53+05:30 IST

అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల అన్యాయాలను అరికట్టడానికే ఏపీ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డిప్యూటీ

‘ఆప్కాస్‌’తో అవుట్‌ సోర్సింగ్‌

ఏజెన్సీల అన్యాయాలకు అడ్డుకట్ట 

మంత్రుల వెల్లడి.. 2906 మందికి నియామక పత్రాల పంపిణీ 


తిరుపతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల అన్యాయాలను అరికట్టడానికే ఏపీ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతి నుంచి శుక్రవారం ఏపీకాస్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి మంత్రులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఉద్యోగులకు కాంట్రాక్టర్లు సక్రమంగా జీతాలివ్వకుండా దోచుకున్నారన్నారు.


ఈ క్రమంలో పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు కార్పొరేషన్‌ను సీఎం జగన్‌ ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 2,906 మందికి నియామకపత్రాలను అందించినట్లు చెప్పారు. ఆప్కాస్‌లో రిజర్వేషన్‌ను కూడా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బల్లి దుర్గాప్రసాద్‌, రెడ్డెప్ప, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కలెక్టర్‌ భరత్‌ గుప్తా, జేసీ చంద్రమౌళి, ఉపాధి కల్పనాధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు. 


టీటీడీ కాంట్రాక్టర్‌పై సీఎం విమర్శలు

ఆప్కాస్‌ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి  జగన్‌ విడియో కాన్ఫరెన్స్‌లో పదేపదే టీటీడీ కాంట్రాక్టర్‌ భాస్కర్‌నాయుడు పేరును  ప్రస్తావించారు. చంద్రబాబు  సమీప బంధువు కావడంతోనే టీటీడీలో కాంట్రాక్టులు దక్కించుకున్నారంటూ నేరుగా ఆరోపణలు చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తన వద్దకు వచ్చి జీతాలను కాంట్రాక్టరు కట్‌ చేస్తున్నారని, ఉద్యోగం రావడానికి, జీతాలు తీసుకోవడానికి కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తోందని  మొరపెట్టుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ఏడు ఆలయాలకు పారిశుధ్య కాంట్రాక్టు గతంలో రూ. 4 లక్షలో లేక రూ. 7 లక్షలో వుంటే దాన్ని రూ. 32 లక్షలకు పెంచేశారని ఆరోపించారు.


ఎవరీ భాస్కర్‌నాయుడు అంటే చంద్రబాబు  సమీప బంధువని తేలిందన్నారు. ఈ వ్యవస్థను మార్చాలనే ఆప్కాస్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.కాగా టీటీడీలో చాలా ఏళ్ళుగా భాస్కర్‌నాయుడు అతిధిగృహాలు, కాటేజీలలో హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్టు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సేవలు బాగాలేవన్న పేరిట కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దుచేశారు. టెండర్లు పిలవగా తిరిగి భాస్కర్‌నాయుడు సంస్థకే పనులు దక్కాయి. గత మే నెల 28న జరిగిన బోర్డు సమావేశంలో పాలకమండలి మళ్ళీ రద్దు చేసి రీ టెండర్లకు ఆదేశించింది. తాజాగా సీఎం సైతం భాస్కర్‌నాయుడిపై ఆరోపణలు చేయడంతో రాజకీయ కారణాలతోనే ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో మొదలైంది. 

Updated Date - 2020-07-04T11:11:53+05:30 IST