‘ఔట్‌’సోర్సింగ్‌..మిషన్‌ భగీరథ నుంచి 120 మంది తొలగింపు

ABN , First Publish Date - 2020-07-01T11:48:07+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది

‘ఔట్‌’సోర్సింగ్‌..మిషన్‌ భగీరథ నుంచి 120 మంది తొలగింపు

మిగిలిన శాఖల్లోనూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పంపించేందుకు కసరత్తు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 30: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అందులో భాగంగా తొలుత మిషన్‌ భగీరథలో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పని చేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై వేటు పడింది. వీరిని నేటి నుంచి (జూలై ఒకటో తేదీ) తొలగిస్తున్నామని, విధులకు హాజరు కావద్దని మిషన్‌ భగీరథ ఉన్నతాధికారులు మౌఖికంగా సమాచారం ఇచ్చారు.


మిషన్‌ భగీరథ ఏర్పడడానికి ముందు వాటర్‌ గ్రిడ్‌ ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా 120 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లగా నియామకమై పని చేస్తున్నారు. బీ-టెక్‌ పూర్తి చేసిన వీరికి నెలకు రూ.20వేల వేతనంపై విధుల్లోకి తీసుకున్నారు. వాటర్‌ గ్రిడ్‌ను మిషన్‌ భగీరథలో విలీనం చేసిన తర్వాత కూడా వీరు అలాగే విధుల్లో కొనసాగారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం పైపులైన్ల ఏర్పాటు, నీటి ట్యాంకుల నిర్మాణం, ఇంటింటికీ నీటిని అందించే పనులన్నింటిని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు దగ్గరుండి చేయించారు. ఇంకా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను జూలై 1 నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.


మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనూ ఆరా

ఇలా ఉండగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమితులైన ఉద్యోగుల గురించి ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అవసరానికి మించి పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే తొలగించాలని ప్రభుత్వం నుంచి అన్ని శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. అన్ని శాఖల్లోనూ ఔట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు తదితరులు పని చేస్తున్నారు.


మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల కార్యాలయంలోనూ వివిధ పోస్టులలో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల్లో ఉన్న 25 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా తొలగించారు. ఇలా ఉండగా, మిగిలిన జిల్లాల కార్యాలయాల్లోనూ ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న ఉన్నతాధికారులు అవసరానికి మించి ఉన్న వారిని త్వరలోనే తొలగించాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది.

Updated Date - 2020-07-01T11:48:07+05:30 IST