భూమికి అవతల

ABN , First Publish Date - 2020-06-29T11:04:07+05:30 IST

రాత్రి చిక్కగా ఒలుకుతుంటే కాగితపు పక్షులను భుజంపై మోస్తూన్న కళ్ళు దేనినో ఆత్రంగా వెతుకుతున్నాయి...

భూమికి అవతల

రాత్రి చిక్కగా ఒలుకుతుంటే

కాగితపు పక్షులను

భుజంపై మోస్తూన్న కళ్ళు

దేనినో

ఆత్రంగా వెతుకుతున్నాయి

అక్కడ ఎన్నో వేల

వెన్నెల వాక్యాలు

నిశ్శబ్ద నిశీధిలో

పురుడు పోసుకోవడం 

గమనింపులోకి రాకపోలేదు

ఊపిరి పోసిన శ్వాస

నెప్పిని పంటి బిగువున

అదిమిపడుతూ

కునుకు రాని క్షణాలను

కష్టంగా కొలుస్తున్నట్టుంది

చూస్తున్న ఎడారి గుండెలోంచి

బొట్టుబొట్టుగా దుఃఖమేదో

కురుస్తోంది

సముద్రాలను ఈదలేని ప్రాణం

అలసిపోతూ

రాలిపడే రేపటి ఆకుల బేరీజులో

తలమునకలై ఉంది

ఆటలో అలసిన పసిమొగ్గలు

మళ్ళీ మరునాడు తాజాగా విరియడానికి

ముడుచుకుని మునగదీసుకున్నాయి

చుట్టూ ముసురుకుంటున్న

గతస్మృతులను

తోలుకుంటుంటే

తలపుల నెమరేతలోనే

తెల్లవారుఝాము ఘడియలు

దగ్గరపడుతున్నాయి

ఇక శక్తిని కూడదీసుకుని

కాలంతో పోరాడక తప్పదని

పదే పదే

గాయపడిన మనసుకు అర్థమైనట్టుంది

చీకట్లను వెంటేసుకుని నడుస్తూనే

జీవితపు చిటికెన వేలు పట్టుకుని

పగ్గాలను అదిలించడం

ఇక అనివార్యమైంది

ఈ భూమికే ఎంత వ్యత్యాసమో

ఒకరికి పట్టపగల్లాంటి

దీపపు కాంతినిచ్చి

మరొకరికి మొండిచెయ్యి చూపిస్తుంది

ఇవతల నేను మాత్రం

ఎర్రగా పొడుస్తున్న రవికిరణాలను 

కట్టగట్టుకుని

వెలుగు అడ్డంపడుతూ

తెగిపడుతున్న ఆలోచనలను 

కుట్టుకుంటూ...

పద్మావతి రాంభక్త

99663 07777


Updated Date - 2020-06-29T11:04:07+05:30 IST