HYD : అప్పట్లోగా కష్టమే.. మొదటి దశ పనులే పూర్తికాలేదే..!?

ABN , First Publish Date - 2022-05-06T18:21:20+05:30 IST

ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రతీ కాలనీకి తాగునీటి సౌకర్యం..

HYD : అప్పట్లోగా కష్టమే.. మొదటి దశ పనులే పూర్తికాలేదే..!?

  • నత్తనడకన ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 పనులు 
  • 272 కాలనీలకు 118 కాలనీల్లోనే పూర్తి
  • మెటీరియల్‌ సరఫరాలో జాప్యం వల్లే..
  • డిసెంబర్‌లో ప్రాజెక్టు పూర్తికి లక్ష్యం నిర్దేశం


హైదరాబాద్‌ సిటీ : ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రతీ కాలనీకి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చిన ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 పనులు లక్ష్యం దిశగా సాగడం లేదు. వేసవి నాటికి అత్యధిక కాలనీలకు నీళ్లు అందించాలన్న లక్ష్యాన్ని వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌ నిర్దేశించగా నేటికీ నిర్మాణ సంస్థలు అందుకోలేదు. ఇప్పటివరకు సగం పనులు కూడా పూర్తి చేయలేదు. వర్షాలు మొదలైతే పైపులైన్ల కోసం తవ్విన గోతులు ప్రమాదకరంగా మారనున్నాయి. ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 పనులు ప్రజలకు ప్రాణసంకటం కానున్నాయి. ఔటర్‌ పరిధిలోని ప్రాంతాలకు తాగునీటిని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌బోర్డుకు అప్పగించింది. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టులో భాగంగా రూ. 756 కోట్లతో పనులు పూర్తిచేశారు.


ఔటర్‌ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు తాగునీటిని అందించడానికి రూ.1,200 కోట్లతో పనులను మూడు నెలల క్రితం వాటర్‌బోర్డు చేపట్టింది. ఇందులో భాగంగా 2,863 కిలోమీటర్ల మేర పైపులైన్‌ విస్తరణ పనులతోపాటు 130 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం గల 70 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయితే ఔటర్‌ పరిధిలోని రెండు లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. సుమారు 20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది.


పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో వాటర్‌బోర్డు ఎండీ రెండు భాగాలుగా విభజించారు. ప్యాకేజ్‌-1లో రూ. 613.14 కోట్లతో 1571 కిలోమీటర్ల మేర కొత్తగా పైపులైన్‌ వేయడంతోపాటు 65.5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం కలిగిన 34 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్యాకేజ్‌-2లో రూ. 586.86 కోట్లతో 1094 కిలోమీటర్ల మేర పైపులైన్‌ విస్తరణ, 36 రిజర్వాయర్లు నిర్మించనున్నారు. హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సరూర్‌నగర్‌, శామీర్‌పేట, కీసర, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు మండలాల పరిధుల్లోని పలు ప్రాంతాల్లో పనులు సాగుతున్నాయి.


పూర్తికాని మొదటి దశ పనులు

ఫేజ్‌-2 ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయడానికి వాటర్‌బోర్డు ఎండీ సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్యాకేజ్‌-1, ప్యాకేజ్‌-2లో వేర్వేరుగా సాగుతున్న పనులకు నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించారు. ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌, డిస్ర్టిబ్యూషన్‌ పనులు ప్రాధాన్యతాపరంగా జరగడానికి, రిజర్వాయర్ల నిర్మాణంలో ప్రతిదశను పూర్తి చేయడానికి నిర్దేశిత గడువును నిర్ణయించారు. ఫిబ్రవరి నెలాఖరుకు 535 కిలోమీటర్ల పైపులైన్‌ పూర్తిచేయాలని, మార్చి చివరికి ఔటర్‌ పరిధిలో కొత్తగా 272 కాలనీలకు తాగునీటిని అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏప్రిల్‌ నాటికి 290 కిలోమీటర్ల మేర మాత్రమే పైపులైన్‌ పనులు పూర్తయ్యాయి. 118 కాలనీలకు తాగునీటి సరఫరా మొదలుపెట్టారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలని, నిర్దేశిత గడువులోపు పనులు పూర్తికాకపోతే అధికారులపై చర్యలతోపాటు నిర్మాణ సంస్థలకు జరిమానా విధించనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ హెచ్చరించినట్లు సమాచారం.


వర్షాలు ప్రారంభమైతే పనులకు ఆటంకం

పైపులైన్‌ విస్తరణ పనులు మే నెలాఖరుకు పూర్తి చేస్తే మున్ముందు ఇబ్బందులు తలెత్తవు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో పనులు చేయడానికి మనుషులతోపాటు యంత్రాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులుంటాయి. పైపులైన్లకు సంబంధించిన వాల్వ్‌, ఇతర మెటీరియల్‌ లేకపోవడం, సరఫరా తగ్గడం వల్ల పనులు  ఆలస్యమవుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించిన సందర్భంలోనే అవసరమైన మెటీరియల్‌ను పూర్తిగా సిద్ధం చేసుకోవాలని ఎండీ సూచించారు. కానీ ఆ దిశగా నిర్మాణ సంస్థలు సిద్ధమవకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Read more