బీరు.. నష్టం భరించేదెవరు!?

ABN , First Publish Date - 2020-09-09T10:24:08+05:30 IST

సర్కారు మద్యం దుకాణాల్లో కాలంచెల్లిన బీర్లు అమ్మించిన ఎక్సైజ్‌శాఖ తీవ్ర విమర్శలపాలైన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ బీర్ల నష్టం ఎవరు భరించాలనే దానిపై రగడ జరుగుతోంది. ముఖ్యంగా తమకు ఆర్డర్లు ఇవ్వడం లేదని,

బీరు.. నష్టం భరించేదెవరు!?

  • కాలం చెల్లిన 3.84లక్షల బీర్లపై రగడ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సర్కారు మద్యం దుకాణాల్లో కాలంచెల్లిన బీర్లు అమ్మించిన ఎక్సైజ్‌శాఖ తీవ్ర విమర్శలపాలైన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ బీర్ల నష్టం ఎవరు భరించాలనే దానిపై రగడ జరుగుతోంది. ముఖ్యంగా తమకు ఆర్డర్లు ఇవ్వడం లేదని, తమ సరుకు అమ్మడం లేదని ఆరోపిస్తున్న కంపెనీలు.. అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ సిద్ధమవుతున్నాయి. కింగ్‌ఫిషర్‌, నాకౌట్‌, కార్ల్స్‌బర్గ్‌ కంపెనీలు తమ డబ్బులు తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాపులర్‌ బ్రాండ్ల మద్యం, బీర్లు కనుమరుగైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్‌ఫిషర్‌, నాకౌట్‌, కార్ల్స్‌బర్గ్‌ కంపెనీలు ఎక్సైజ్‌ శాఖ ఆర్డర్‌ మేరకే లాక్‌డౌన్‌కు ముందు బీర్లు సరఫరా చేశాయి.


వాటిని డిపోల్లోనే నిల్వ ఉంచేసి, ఇతరత్రా నాసిరకం బీర్లు సర్కారు మద్యం దుకాణాల ద్వారా విక్రయించేది. దీంతో 32వేల కేసులు 6నెలల గడువు ముగియడంతో ఇటీవల ఎక్స్‌పైర్‌ అయ్యా యి. కేసుకు 12చొప్పున 3.84లక్షల బీర్లు ఉంటాయి. ఒక్కో బీరు విలువ కనీసం రూ.190 వేసుకున్నా 7.29 కోట్లు అవుతుంది. అయితే వాటి ఉత్పత్తికి అయిన ఖర్చు మాత్రం కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవికాకుండా మరో 1.2లక్షల కేసుల బీర్లు ఎక్స్‌పైర్‌ అయి కొన్ని డిపోల్లో, మరికొన్ని బ్రూవరీల్లోనే ఉండిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వానికి కావాల్సిన కంపెనీలవి కావడంతో వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కింగ్‌ఫిషర్‌ అత్యధికంగా బీర్లు అమ్మేది.


సాధారణ అమ్మకాల్లో సగం అంటే నెలకు సుమారు 12లక్షల కేసులు సరఫరా చేసేది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆర్డర్లు వేలల్లోకి వచ్చాయి. అవీ అమ్మకుం డా డిపోల్లోనే ఉంచి షాపులకు కొత్త బ్రాండ్లు పంపారు. వినియోగదారులు అడుగుతున్నా పాపులర్‌ బ్రాండ్లు కనిపించకుండా పోయా యి.  ఆ బ్రాండ్లు ఎవరూ అడగటం లేదని అందుకే సరఫరా చేయలేదని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. ఆర్డర్లు లేక శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బ్రూవరీ మొత్తం కంపెనీనే మూసేసింది. చివర్లో సరఫరా చేసిన వాటికి డబ్బులు ఇవ్వాలని కోరుతోంది.


ఎక్స్‌పైరీ బీర్లు వెనక్కి.. 

కాలం చెల్లిన బీర్ల అమ్మకాలతో చెడ్డపేరు తెచ్చుకున్న అధికారులు ఎట్టకేలకు కళ్లు తెరిచారు. రాష్ట్రంలో కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ రెండురోజులుగా వరుస కథనాలివ్వడంతో ఎక్సైజ్‌శాఖ నష్టనివారణ చర్యలు చేపట్టింది. షాపుల్లో సరుకు వెంటనే డిపోలకు పంపాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో స్టిక్కర్లు వేసిన బీర్లు షాపుల్లో కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్నిచోట్ల తిరిగి డిపోలకు పంపారు. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయంలో ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అదే ప్రైవేటు వ్యాపారులపై అయితే తక్షణ చర్యలంటూ హడావుడి చేసే ప్రభుత్వం.. సొంత శాఖే ఇంతటి నిర్వాకం చేసినా కనీసం ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. 

Updated Date - 2020-09-09T10:24:08+05:30 IST